బోధన్ నియోజకవర్గంలోని నవీపేట్ మండలంలో ఏర్పాటు చేసిన సభలో నిజామాబాద్ టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కల్వకుంట్ల కవిత పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం గత ఐదు సంవత్సరాల్లో అనేక మంచి పనులు చేసిందని, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత ఈ జిల్లాకు న్యాయం జరిగిందని అన్నారు. గతంలో సాగునీటికి ఇబ్బందులు ఉండేవి. ఇప్పుడు అలాంటి పరిస్థితులు లేవు. కాంగ్రెస్ హయాంలో నిజాంసాగర్ ను నిర్లక్ష్యం చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సింగూరు జలాలను నిజాంసాగర్ కు తరలించాం. నిజాంసాగర్ కింద చివరి ఆయకట్టు వరకు సాగునీరు ఇస్తున్నాం. రైతుల కోసం రైతుబంధు, రైతు బీమా పథకాలు అమలుచేస్తున్నాం. రైతులు అడగకముందే 24 గంటల ఉచిత కరెంట్ ఇస్తున్నాం. గతంలో సబ్ స్టేషన్ల కోసం రైతులు చెప్పులరిగేలా తిరిగేవారు. ఇప్పుడు సబ్ స్టేషన్ల ఏర్పాటుకు సమస్యలు లేవని కవిత పేర్కొన్నారు.
మే 1వ తేదీ నుండి పెన్షన్లు రెట్టింపు అవుతున్నాయి. 800 మంది వికలాంగ సోదరులకు అన్ని విధాలా అండగా ఉన్నాం.బీడీ కార్మికుల గురించి కాంగ్రెస్ నాయకులు ఆలోచించలేదు. నాకు చేతనైనంత అభివృద్ధి చేశాను. మన హక్కుల కోసం పార్లమెంట్ లో పోరాడాను. తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధే దేశవ్యాప్తంగా జరగాలి. తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలు దేశవ్యాప్తంగా అమలు చేయాలి. ఈ ఎంపీ ఎన్నికల్లో నిజామాబాద్ పార్లమెంట్ స్థానంతో పాటు మిగతా ఎంపీ స్థానాల్లో టీఆర్ఎస్ అభ్యర్ధులనే గెలిపించాలి. ప్రతి ఒక్కరూ కారు గుర్తుకే ఓటు వేయాలని కవిత విజ్ఞప్తి చేశారు.