తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతిబింబమైన బతుకమ్మ సంబరాలతో ఇందూరు పూల జాతరను తలపించింది. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో గురువారం బంగారు బతుకమ్మ కార్యక్రమాన్ని కలక్టరేట్ మైదానంలో నిర్వహించారు. తెలంగాణ జాగృతి, టీఆర్ఎస్ ఆధ్వర్యంలో పేర్చిన భారీ బతుకమ్మలు చూపరులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా జాగృతి అధ్యక్షురాలు కవిత మాట్లాడుతూ తెలంగాణ, సంస్కృతి, సాంప్రదాయాలను కాపాడుకునేందుకే ఏడు సంవత్సరాలుగా తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలను నిర్వహిస్తున్నామని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణంలో తెలంగాణ జాగృతి ప్రముఖ పాత్ర పోషిస్తుందని ఆమె అన్నారు.
ఈ సందర్భంగా కవి, గాయకుడు దేశపతి శ్రీనివాస్ బతుకమ్మపై పాట పాడి బతుకమ్మ చరిత్రను వివరించారు. అనంతరం నగరంలోని కంఠేశ్వర్ మందిరంలోగల కోనేరులో బతుకమ్మలను పాటలతో నిమజ్జనం చేసారు.
వెయ్యి సంవత్సరాల చరిత్ర కలిగన ఖిల్లా రామాలయాన్ని కవిత సందర్శించి పర్యాటక కేంద్రంగా తీర్చి దిద్దేందుకు కృషి చేస్తానని తెలిపారు. అనంతరం ప్రత్యేక పూజలు జరిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఖిల్లా రామాలయానికి వెయ్యి సంవత్సరాల ఘన చరిత్ర వుందని, నిజామాబాద్ జిల్లాను పర్యాట కేంద్రంగా తీర్చి దిద్దేందుకు జాగృతి సంస్థ తన వంతు కృషి చేస్తుందని తెలిపారు. నా తెలంగాణ కోటి రతనాల వీణ అని నినదించిన దాశరథిని ఖిల్లా రామాలయంలో బంధించారని, ఆయన ఆశయాల కోసం ప్రతి ఒక్కరు నిరంతరం కృషి చేయాలని పిలుపునిచ్చారు.