mt_logo

న్యూ జెర్సీ లో ఘనంగా జరిగిన బతుకమ్మ ఉత్సవాలు

ఉత్తర అమెరికా లో న్యూ జెర్సీ రాష్ట్రం లో అక్టోబర్ మాసం , ఆదివారం. చిరు చలిగాలులు వీస్తున్న మధ్యాహ్న సమయం. సూర్యుడు క్రమంగా తన ప్రతాపాన్ని కోల్పోతున్న వేళ! హై లాండ్ పార్క్ పట్టణంలోని డొనాల్డ్సన్ పార్క్ లో కోలాహలం! తెలంగాణ స్త్రీలు, రంగు రంగుల చీరలు ధరించి, ఆడంబరంగా నగలు, మణిహారాలు వేసుకుని, స్త్రీలు తమ తమ ఆడ పిల్లలని బహుసుందరంగా ముస్తాబుచేసి రకరకాల ఆభరణాలు ధరింపచేసి, చేతుల్లో పెద్ద పెద్ద బతుకమ్మలని తీసుకుని, సంతోషంగా పాడుకుంటూ వస్తున్నారు. అంతకు ముందే అక్కడికి చేరుకున్న స్త్రీలు తమ తమ బతుకమ్మలని చక్కని వేదిక మీద ఉంచి అగరువత్తులు వెలిగించి భక్తిగా పూజించారు. ‘న్యూ జెర్సీ బతుకమ్మ ఉత్సవాలు’ అని కట్టి ఉన్న బానర్ ముందు ప్రొ. జయశంకర్ చిత్రపటం. దాని ముందు బతుకమ్మలు ఉంచిన వేదిక.

న్యూజెర్సీ తెలంగాణ అసోసియేషన్ బతుకమ్మ ఉత్సవాలను ఘనంగా జరుపుకోవాలని ఇచ్చిన పిలుపును అందుకుని న్యూజెర్సీ రాష్ట్ర నలుమూలల నుండీ వందలాది తెలంగాణ కుటుంబాలు ఇంటిల్లిపాదీ తరలి వచ్చారు. తెలంగాణ కుటుంబాల శ్రేయోభిలాషులైన ఆంధ్రా ప్రాంతపు మిత్రులు కూడా చాలా మందే తరలి వచ్చారు. ప్రొ. జయశంకర్ చిత్రపటానికి రవి ధన్నపునేని పూలమాల వేసి బతుకమ్మ పండుగ ఉత్సవాలను ప్రారంభించారు. శిరీష పొగాకు, కవిత పెద్ది, మంజుల గనగోని, లావణ్య బుపతి, సుభాషిణి తంగ్డ , ఇందు బస, భాను మాగంటి, రాణి వెలిశాల, సరిత చింతావర్ వసంత గడ్డంసెట్టి, మీనా మంద, లక్ష్మి దేవినేని, కల్పన సువర్ణ, విద్య వెంకటయోగి, సంగీత ధన్నపునేని తదితరులు బతుకమ్మ ఉత్సవాలని ఒక అద్భుతమైన కార్యక్రమంగా తీర్చిదిద్దడానికి తమ శాయశక్తులూ ఒడ్డి కృషి చేశారు. తాము స్వయంగా పెద్ద పెద్ద బతుకమ్మలను, తెలంగాణ గడ్డ మీద బతుకమ్మలతో పోటీ పడే బతుకమ్మలను, పట్టు కుచ్చుల పూలు, గునుక పూలు తదితర పూలతో పేర్చుకుని వక్చారు. వచ్చిన అతిథులందరికీ భోజన సదుపాయాలు కల్పించారు. పిల్లలతోటి , పెద్దల తోటి అనేక ఆటలు ఆడించి బహుమతులు ప్రదానం చేశారు. అనేక కార్యక్రమాలు నిర్వహించారు.

కంట్రీ ఒవెన్ , దక్షిణ, పారడైస్ బిర్యాని, కోరియాండర్ , హైదరాబాద్ బావర్చి, మిర్చి మరియు స్పైస్ జోన్ రెస్టారెంటులు భోజనాలని ఏర్పాటు చేశారు.

పిల్లల, పెద్దల ఆటల కార్యక్రమాలయ్యాక, ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న స్త్రీలు పెల్లుబికిన ఉత్సాహంతో , ఉరకలేసే ఆనందాతిరేకంతో బతుకమ్మలాడటానికి ఉపక్రమించారు. మధ్యలో బతుకమ్మలని ఉంచి చుట్టూ వలయంగా చప్పట్లు కొడుతూ, లయ బద్దంగా కాల్లు కదుపుతూ బతుకమ్మ పాటలు పాడుకుంటూ బతుకమ్మలాడారు.ఈ కార్యక్రమానికి న్యూజెర్సీ అసెంబ్లీ మెన్ శ్రీ ఉపేంద్ర చివుకుల హాజరై బతుకమ్మ ఆడిన వారికి అబినందన తెలియజేసి, బతుకమ్మలలో ఉతమమైన నాల్గింటికి బహుమతులందించారు. ఈ కార్యక్రమానికి స్థానిక ప్రముఖులు హరి ఎప్పనపల్లి కూడా హాజరయ్యారు.

బుద్దితీరా తృప్తిగా బతుకమ్మలాడినంక ఆడవాళ్ళు బతుకమ్మలని చేతుల్లో భద్రంగా ఎత్తుకుని, బతుకమ్మ పాటలు పాడుకుంటూ పక్కనే ఉన్న చెరువుకేసి ప్రయాణమయ్యారు. బతుకమ్మలని గౌరమ్మలని మరొక్కసారి భక్తితో కొలిచిన ఆడవాళ్ళు బతుకమ్మలని చెరువులో వదిలి భక్తి శ్రద్దలతో దండం పెట్టుకుని, కళ్లలో ఆనందబాష్పాలతో బతుకమ్మలని నిమజ్జనం చేసారు. తమ వెంట తెచ్చిన బతుకమ్మ ప్రసాదమైన సద్దులని మలీద ముద్దలని అందరికీ పంచి తామూ ఆనందంగా తిని, నీళ్ళలో తేలిపోతున్న తమ తమ బతుకమ్మలని కడసారిగా చూసుకుని ఇళ్ళ వైపు ప్రయాణమయ్యారు. తెలంగాణ ప్రత్యేక సాంస్కృతిక చిహ్నమైన బతుకమ్మని ఘనంగా జరుపుకుని మరొక్క మారు తెలంగాణ జండాను అమెరికాలో న్యూజెర్సీలో సమున్నతంగా ఎగరేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *