mt_logo

సెప్టెంబర్ 1 నుండి నూతన విద్యాసంవత్సరం

సెప్టెంబర్ ఒకటవ తేదీ నుండి నూతన విద్యాసంవత్సరం ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్రా రామచంద్రన్ ఈమేరకు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ కు సోమవారం ఆదేశాలు జారీ చేశారు. స్కూళ్లలో ప్రవేశాలతో పాటు ఈ-లెర్నింగ్, దూర విద్యావిధానంలో బోధించేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. టీవీ లేదా టీ శాట్ ద్వారా పాఠశాల విద్యార్థులకు సెప్టెంబర్ 1 నుండి డిజిటల్ పాఠాలు చెప్పాలని పేర్కొన్నారు.

ఉపాధ్యాయులంతా ఈనెల 27 నుండి స్కూళ్లకు హాజరు కావాలని, విద్యార్థులకు కావల్సిన డిజిటల్ కంటెంట్ తయారీకి ప్రణాళికలు రూపొందించడం వంటి వీధుల్లో పాల్గొనాల్సి ఉంటుందని తెలిపారు. సెప్టెంబర్ 1 నుండి విద్యా సంవత్సరం ప్రారంభం అయ్యేలా ఎస్సీఈఆర్టీ రూపొందించిన క్యాలెండర్ ను అమలు చేయాలని చిత్రా రామచంద్రన్ సూచించారు. కేంద్రప్రభుత్వం ఇచ్చే మార్గదర్శకాల ప్రకారం రెగ్యులర్ తరగతుల ప్రారంభంపై నిర్ణయం తీసుకుంటామని, అప్పటివరకు విద్యార్థులు స్కూళ్లకు వెళ్లేది లేదని స్పష్టం చేశారు.

ఇదిలాఉండగా డిజిటల్ పాఠాలను నేర్చుకోవడంతోపాటు వాటిని ప్రాక్టీస్ చేసేందుకు అనుకూలంగా రూపొందించిన వర్క్ షీట్లను సోమవారం ఎస్సీఈఆర్టీ విడుదల చేసింది. తెలంగాణ ఎస్సీఈఆర్టీ అధికారిక వెబ్ సైట్ (scert.telangana.gov.in/worksheets-24082020/mobile/index.html) ద్వారా 2నుండి 10 తరగతుల ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్ల విద్యార్థులు, ఉపాధ్యాయులు అందరూ ఈ వర్క్ బుక్ ను డౌన్ లోడ్ చేసుకోవచ్చు. తెలుగు, హిందీ, ఉర్దూ, ఇంగ్లీష్ భాషల్లో అన్ని సబ్జెక్టులు ప్రాక్టీస్ చేసుకునే విధంగా వర్క్ షీట్ ను రూపొందించినట్లు ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ బీ శేషుకుమారి చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *