మెదక్ జిల్లా నంగునూర్ మండలం రాజ్ గోపాల్ పేట పెద్దచెరువు పనులను బుధవారం మంత్రి హరీష్ రావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. అక్కడి అధికారులకు, ప్రజాప్రతినిధులకు సమాచారం ఇవ్వకుండానే చెరువు వద్దకు చేరుకొని అక్కడి పరిస్థితిని సమీక్షించారు. వెంటనే ఆర్డీవో ముత్యంరెడ్డికి ఫోన్ చేసి చెరువు శిఖం హద్దులు చూపడంలో నిర్లక్ష్యం దేనికని ప్రశ్నిస్తూ మండిపడ్డారు. చెరువు హద్దులు పూర్తి స్థాయిలో చూపడంలో నిర్లక్ష్యం తగదని మంత్రి హెచ్చరించారు. మిషన్ కాకతీయ పనుల నిర్వహణను ప్రతిరోజూ ఎందుకు పరిశీలించడం లేదని, ఇకనైనా అధికారులు సమన్వయంతో వ్యవహరిస్తూ ప్రతిరోజూ మండల పరిధిలోని ప్రతి చెరువు పనులను పరిశీలించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
చెరువు నుండి పూర్తిస్థాయిలో మట్టి తరలించడంలో ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు? మిషన్ కాకతీయ పనుల పర్యవేక్షణకు నియమించబడ్డ ప్రత్యేకాధికారులు ఎక్కడున్నారు? చెరువులను సందర్శిస్తున్నారా? అని మంత్రి హరీష్ మండిపడ్డారు. నేనొచ్చినప్పుడే వస్తారు తప్ప మళ్ళీ ఇటువైపు కన్నెత్తి కూడా చూడరు.. ఇకనుంచైనా పద్దతి మార్చుకుని చెరువు మట్టి తరలింపులో ఎదురయ్యే సమస్యలు అక్కడికక్కడే పరిష్కరించుకుని పనులు వేగవంతంగా పూర్తయ్యేలా చూడాల్సిన బాధ్యత స్థానిక ప్రజాప్రతినిధులపై ఉందని హరీష్ స్పష్టం చేశారు. ప్రభుత్వం ట్రాక్టర్లపై పన్నులు తగ్గించినందున రైతుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని తక్కువ ధరకే మట్టిని పొలాలకు తరలించాలని ట్రాక్టర్ల యజమానులను మంత్రి కోరారు.