సోమవారం జరిగిన శాసనసభ సమావేశాల్లో రైతు ఆత్మహత్యలపై వాడివేడి చర్చ జరిగింది. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ ప్రతిపక్షనేతల విమర్శలకు ధీటుగా సమాధానం చెప్పారు. ఏ సందర్భంలో ఆత్మహత్య చేసుకున్నా రైతుల ఆత్మహత్యలు బాధాకరమని, ఈ సమస్య తమకు వారసత్వంగా సంక్రమించినదే తప్ప తాము వాటికి బాధ్యులం కాదని అన్నారు. గత పాలకుల నుండి వారసత్వంగా సంక్రమించిన సమస్యలు ఈనాడు తెలంగాణ రైతులకు శాపంగా మారాయని, కేవలం తెలంగాణ ప్రభుత్వంలోనే ఆత్మహత్యలు జరుగుతున్నాయా అన్నట్లు విపక్ష సభ్యులు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
సమస్యకు మూలం వారి ప్రభుత్వాలే అన్న విషయాన్ని మర్చిపోయి గోరంతను కొండంతలు చేస్తున్నారని, తమ ప్రభుత్వం రైతుల సంక్షేమానికి చిత్తశుద్ధితో పనిచేస్తుందని సీఎం స్పష్టం చేశారు. అనంతరం ఎర్రబెల్లి మాట్లాడుతూ, తాను రైతు బిడ్డనని, రైతుల సమస్యలు తనకు తెలుసని, రైతుల ఆత్మహత్యలకు టీఆర్ఎస్ సర్కారే కారణమని అనడంతో స్పందించిన కేసీఆర్ నీవు రైతు బిడ్డవైతే నేను రైతును.. రైతు కష్టాలు, నష్టాలు నాకు తెలుసు అంటూ ఎర్రబెల్లిని విమర్శించారు.
దేశంలో ఎక్కడా ఆత్మహత్యలే జరగనట్లు అవి ఇప్పుడే జరుగుతున్నట్లు ప్రతిపక్ష సభ్యులు మాట్లాడుతున్నారని, దేశమంతా ఈ సమస్య ఉందని, 1997 నుండి ఒక్క ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంలోనే 35,800 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నట్లు నేషనల్ క్రైం బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ వెల్లడి చేసిందని సీఎం తెలిపారు. దేశవ్యాప్తంగా 2,84,600 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నట్లు రిపోర్టులో ఉందని చెప్తూ ఎన్సీబీ రిపోర్టును కేసీఆర్ సభలో చూపించారు.
మంత్రి పోచారం మాట్లాడుతూ ఇప్పటివరకూ ఆత్మహత్యకు పాల్పడ్డ 49 మంది రైతులకు రూ. 50 లక్షల రూపాయల పరిహారం చెల్లించామని, 2012 ఖరీఫ్ పంటకు 42 వేలమంది రైతులకు రూ. 15.53 కోట్లు నష్టపరిహారం చెల్లించామని, 2013 సం.కి. వాతావరణ భీమా పథకం కింద 83,431 మంది రైతులకు రూ. 29.85 కోట్లు నష్టపరిహారం చెల్లించామని పేర్కొన్నారు.