mt_logo

నవశకం..

-అవినీతిరహిత పాలనతో బంగారు తెలంగాణ
-సర్వేపై దుష్ప్రచారాన్ని నమ్మొద్దు
-అది సంక్షేమ పథకాల అమలుకే
-టీఎస్‌పీఎస్సీ ద్వారా 50 వేల ఉద్యోగాల భర్తీ: సీఎం కేసీఆర్
-దళితులకు భూ పంపిణీ ప్రారంభం

-రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీ కింద రూ.482 కోట్లు
-హైదరాబాద్ చుట్టూ హబ్ సిటీలు
-ఆటోలు, ట్రాక్టర్లకు రవాణా పన్ను రద్దు
-గోల్కొండ కోటలో సీఎం కేసీఆర్ ప్రసంగం
-ఖిల్లాపై త్రివర్ణ పతాకావిష్కరణ

సుమారు అరవై ఏండ్ల వలసపాలన శృంఖలాలు తెంచుకున్న స్వేచ్ఛా తెలంగాణ ఆత్మగౌరవం వెయ్యేండ్ల చరిత్రగల గోల్కొండ ఖిల్లా వేదికగా నింగినంటింది. తెలంగాణ సంస్కృతికి, వారసత్వానికి, ఔన్నత్యానికి, కష్టాలకు, నష్టాలకు, కన్నీళ్లకు, దోపిడీకి, అభివృద్ధికి, ఆదరణకు, సహనానికి కేంద్రంగా కలగలిసి నిలిచిన కోటలో పంద్రాగస్టు వేడుకలు కన్నులపండువగా జరిగాయి. వరుస వలసపాలకుల అణచివేతలో తన చరిత్రను తాను వెతుక్కున్న తెలంగాణ.. ఒకనాటి ఆధిపత్య అహంకారానికి, దోపిడీ శక్తులకు నిలయంగా నిలిచిన చోట ప్రజాస్వామ్య స్వేచ్ఛాగీతికలు ఆలపించింది. ఒక చారిత్రక దుర్గం.. మరో చరిత్రాత్మక మార్గానికి బాటలు వేసింది.

గోల్కొండ కోటపై మువ్వన్నెల పతాకం రెపరెపలాడింది. తెలంగాణ ప్రజల తొలి ప్రభుత్వ సారథి ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు గోల్కొండ కోటలోని రాణీమహల్ వద్ద 60 అడుగుల ఎత్తున ఏర్పాటు చేసిన జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. పోలీసుల గౌరవ వందనం స్వీకరించి.. అనంతరం ప్రజలనుద్దేశించి ప్రసంగించారు.

తెలంగాణ చరిత్రను గోల్కొండ కోట ప్రపంచానికి చాటిచెప్పింది. రోమ్, ఇంగ్లండ్, టర్కీ వంటి దేశాల వారు వజ్రాల వ్యాపారం కోసం వచ్చింది ఇక్కడికే. అందుకే ప్రపంచ ప్రసిద్ధి పొందిన గోల్కొండ కోటలో స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా త్రివర్ణపతాకాన్ని ఎగురవేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
– కేసీఆర్, సీఎం

కేంద్ర బిందువుగా, ప్రజా సమస్యలే ఇతివృత్తంగా, అవినీతిరహిత పరిపాలనతో తెలంగాణ రాష్ట్రాన్ని అభ్యుదయపథంలో ముందుకు తీసుకువెళతామని రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు చెప్పారు. బంగారు తెలంగాణ నిర్మిస్తామని ప్రతినబూనారు. ఇప్పటికే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ)ని ఏర్పాటు చేశామని, త్వరలోనే నోటిఫికేషన్ విడుదల చేసి 50 వేల ఉద్యోగాలను భర్తీ చేస్తామని సీఎం ప్రకటించారు.

ప్రజల సామాజిక స్థితిగతులను తెలుసుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న సర్వేపై కొన్ని దుష్టశక్తులు దుష్ప్రచారం చేస్తున్నాయని విమర్శించారు. ఆ దుష్ప్రచారాన్ని నమ్మవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. సంక్షేమ పథకాలు సక్రమంగా అమలుచేయడం కోసమే సమగ్ర సర్వే చేపడుతున్నామని, ఇందుకు ప్రజలందరూ సహకరించాలని ముఖ్యమంత్రి కోరారు. గోల్కొండ కోటలో శుక్రవారం నిర్వహించిన 68వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో సీఎం పాల్గొని, జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న, చేయబోయే అభివృద్ధి, సంక్షేమ పథకాలను ముఖ్యమంత్రి వివరించారు.

ఇదే కార్యక్రమం సందర్భంగా భూమిలేని నిరుపేద దళిత కుటుంబాలకు మూడెకరాల వ్యవసాయ భూమిని పంపిణీ చేసే కార్యక్రమాన్ని సీఎం ప్రారంభించారు. తన ప్రసంగంలో చారిత్రక గోల్కొండ కోట వైభవాన్ని కేసీఆర్ గుర్తు చేశారు. కాకతీయుల కాలంలో సువిశాల సామ్రాజ్యాన్ని స్థాపించిన గోల్కొండ కోటలో తెలంగాణ ప్రజలు స్వాతంత్య్ర దినోత్సవాన్ని జరుపుకోవడం గర్వకారణం. దేశానికి స్వాతంత్య్రం సాధించిన మహాత్ముని అడుగుజాడల్లో అహింస మార్గంలో పోరాడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం.

ఫతే దర్వాజ దగ్గర చప్పట్లు కొడితే బాలా హిస్సార్ దర్వాజ దగ్గర ప్రతిధ్వనించే ధ్వని శాస్త్ర విజ్ఞానానికి, వాస్తుకళా కౌశలానికి నిదర్శనంగా నిలిచిన గోల్కొండ కోట, నేడు తెలంగాణ ప్రజల స్వాతంత్య్ర వేడుకలకు వేదిక కావడం హర్షణీయం. తానీషా ప్రభువుకు శ్రీరామ, లక్ష్మణులు సాక్షాత్కరించింది గోల్కొండ కోటలోనే. భక్త రామదాసు నోట వెలువడిన సుప్రసిద్ధ కీర్తనలెన్నో ప్రతిధ్వనించింది ఈ కోటలోనే. భద్రాద్రి రామయ్యకు ప్రతి ఏటా ముత్యాల తలంబ్రాలు తీసుకు వెళ్లే సత్సాంప్రదాయాన్ని ప్రారంభించింది కూడా గోల్కొండ పాలకులే.

ప్రపంచ ప్రసిద్ధి పొందిన కోహినూర్, దరియా ఏ నూర్ వజ్రాలకు ఆలవాలంగా విలసిల్లింది గోల్కొండ సామ్రాజ్యంలోనే. రోమ్, ఇంగ్లండ్, టర్కీవంటి దేశాల వారు వజ్రాల వ్యాపారం చేసింది కూడా హైదరాబాద్‌లోనే. తెలంగాణ ప్రజలు సంతోషంగా జరుపుకునే బోనాల పండుగ కూడా గోల్కొండ కోట నుంచే ప్రారంభమవుతది అని సీఎం వివరించారు. తెలంగాణ చరిత్రను ప్రపంచానికి గోల్కొండ కోట చాటిందని, అందుకే స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఇక్కడ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయాలనే నిర్ణయాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుందని చంద్రశేఖర్‌రావు చెప్పారు. స్వాతంత్య్ర వేడుకల సందర్భంగా భూమిలేని నిరుపేద దళితుకు భూ పంపిణీని కూడా ఇక్కడి నుంచే ప్రారంభిస్తున్నామని సీఎం తెలిపారు.

పథకాల్లో అవినీతి తొలగించేందుకే సర్వే
ప్రభుత్వం వద్ద సరైన లెక్కలు లేకపోవడం వల్లే సంక్షేమ పథకాలు దుర్వినియోగం అవుతున్నాయని ముఖ్యమంత్రి కేసీఆర్ అభిప్రాయపడ్డారు. అవినీతి, అక్రమాలు లేని రాష్ట్రంగా రూపుదిద్దడానికే 19న సమగ్ర సర్వే నిర్వహిస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. ఇందుకోసం విస్తృత ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. ఒకే రోజు తెలంగాణ అంతటా సర్వే జరుగుతుందని, ఆ రోజున ప్రభుత్వం సెలవును కూడా ప్రకటించినందున అందరూ ఇండ్లలోనే ఉండి సరైన సమాచారం అందించాలని ప్రజలను కోరారు. సర్వేపై కొన్ని దుష్టశక్తులు దుష్ప్రచారానికి పాల్పడుతున్నాయన్న సీఎం.. వాటిని నమ్మవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

ఇన్‌పుట్ సబ్సిడీ కింద రూ.482 కోట్లు
ఎంతో కాలంగా పోరాడుతున్న నిజామాబాద్ జిల్లా ఎర్రజొన్న రైతుల బకాయిలు రూ.11 కోట్లను మంజూరు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు. తెలంగాణ జిల్లాల్లోని రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీకింద రూ.482 కోట్లను విడుదల చేస్తున్నామని, ఈ డబ్బు నేరుగా రైతుల ఖాతాల్లోకే వెళుతుందని తెలిపారు. పవర్‌లూమ్ కార్మికులను ఆదుకునేందుకు వారికి కుటుంబానికి లక్ష రూపాయల చొప్పున ఐదున్నర కోట్లు విడుదల చేస్తున్నామని చెప్పారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర వహించి, సకల జనుల సమ్మెలో అద్భుత పోరాటాలు చేసిన తెలంగాణ ఉద్యోగులకు ఇచ్చిన మాట ప్రకారం రాష్ట్రం ఏర్పడిన వెంటనే స్పెషల్ ఇంక్రిమెంట్ మంజూరు చేశామని ముఖ్యమంత్రి తెలిపారు.

రుణమాఫీతో 40 లక్షల కుటుంబాలకు లబ్ధి
ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రైతులకు లక్ష రూపాయల వరకు రుణ మాఫీ చేస్తుందని చెప్పారు. ఫలితంగా 40 లక్షల కుటుంబాలు లబ్ధిపొందుతాయని కేసీఆర్ తెలిపారు. రైతులకు రుణమాఫీ వల్ల ప్రభుత్వంపై 18 వేల కోట్ల రూపాయల భారం పడినా రైతుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని అమలు చేస్తున్నామన్నారు. స్థానిక సంస్థలకు అధికారాలు, బాధ్యతలు అప్పగించడం ద్వారా జవాబుదారీతనాన్ని పెంచుతమన్నారు. ఆటో రిక్షాలకు, వ్యవసాయానికి ఉపయోగించే ట్రాక్టర్లకు రవాణా పన్నును రద్దు చేస్తున్నట్లు, పాత బకాయిలు 76 కోట్లను మాఫీ చేస్తున్నట్లు సీఎం ప్రకటించారు.

పరిశ్రమలకు సింగిల్ విండో అనుమతులు
తెలంగాణలో పరిశ్రమల ఏర్పాటును ప్రోత్సహించడానికి నూతన పారిశ్రామిక విధానం తెస్తున్నామని సీఎం చెప్పారు. సింగిల్ విండో విధానంలో పరిశ్రమలకు అనుమతులు ఇస్తామని పునరుద్ఘాటించారు. పరిశ్రమల స్థాపనకు టీఎస్‌ఐఐసీకి 5 లక్షల ఎకరాల భూమిని కేటాయించి, పారిశ్రామికవాడలను ఏర్పాటు చేస్తామన్నారు. హైదరాబాద్ నగరం చుట్టూ ఫార్మాసిటీ, స్పోర్ట్స్ సిటీ, సినిమా సిటీ, మ్యానుఫాక్చరింగ్ సిటీ, ఎడ్యుకేషన్ సిటీ, హెల్త్ సిటీలను ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి చెప్పారు. కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయడానికి కమిటీని వేశామని, త్వరలోనే వారిని పర్మినెంట్ చేస్తామని అన్నారు.

హైదరాబాద్‌లో మళ్లీ కల్లు దుకాణాలు
కల్లుగీత కార్మికులను ఆదుకోవడానికి దసరా పండుగ నుంచి హైదరాబాద్‌లో మళ్లీ కల్లు దుకాణాలను ప్రారంభిస్తామని ముఖ్యమంత్రి చెప్పారు. దీని వల్ల 60 వేల మంది కల్లుగీత కార్మికులు ఉపాధి లభిస్తుందని అన్నారు. పర్యావరణ సమతుల్యాన్ని కాపాడేందుకు తెలంగాణలో హరితహారం పేరుతో 230 కోట్ల మొక్కలను నాటాలనే దృఢ నిశ్చయంతో ప్రభుత్వం ఉందన్నారు. ఎన్నికల హామీ మేరకు గిరిజన తండాలు, ఆదివాసీగూడేలను గ్రామ పంచాయతీలుగా మార్చుతామని చెప్పారు. ముస్లిం మైనార్టీలకు 12% రిజర్వేషన్ల కల్పనకు రిటైర్డ్ హైకోర్టు న్యాయమూర్తితో కమిటీ వేశామని, కమిటీ నివేదిక వచ్చిన వెంటనే ముస్లింలకు రిజర్వేషన్లు అమలు చేస్తామని అన్నారు.

క్రీడాకారులకు అత్యంత ప్రోత్సాహం
రాష్ట్రంలో క్రీడలను ప్రోత్సహించడానికి సమగ్ర క్రీడా విధానాన్ని రూపొందిస్తున్నామన్నారు. ఒలింపిక్స్, కామన్‌వెల్త్, ఆసియా క్రీడల్లో పాల్గొన్న క్రీడాకారులు బంగారు పతకం గెలిస్తే రూ.50 లక్షలు, వెండి పతకం సాధిస్తే రూ.25 లక్షలు, కాంస్య పతకం గెలిస్తే రూ.15 లక్షలు చొప్పున నగదు బహుమతులు అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పారు. అంతర్జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొనే క్రీడాకారుల ఖర్చులో రూ.3 లక్షలను ప్రభుత్వమే చెల్లిస్తుందన్నారు. క్రీడాకారులను అంతర్జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొనేలా తీర్చిదిద్దిన కోచ్‌లకు కూడా రూ.25 లక్షల నగదు ప్రోత్సాహకాలను ఇస్తున్నట్లు సీఎం తెలిపారు. అతి చిన్న వయసులో ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించి తెలంగాణ రాష్టానికి జాతీయ స్థాయిలో ఖ్యాతి తెచ్చిపెట్టిన గిరిజన, దళిత విద్యార్థులు మాలావత్ పూర్ణ, అనంద్‌లకు చెరొక రూ.25 లక్షల నగదును అందిస్తున్నట్లు తెలిపారు.

హైదరాబాద్‌పై ప్రత్యేక శ్రద్ధ
హైదరాబాద్ ప్రజలు సుఖ శాంతులతో జీవించేలా శాంతి భద్రతల పరిరక్షణకు పోలీస్ వ్యవస్థకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నామని సీఎం చెప్పారు. ఇందుకోసం వైర్‌లెస్, ఇంటర్నెట్, జీపీఎస్ సౌకర్యాలతో కూడిన ఆధునిక వాహనాలను పోలీసు శాఖకు అందించామని తెలిపారు. వీటికి రూ.340 కోట్ల నిధులను ప్రభుత్వం వెంటనే విడుదల చేసిందని తెలిపారు. ప్రైవేటు సంస్థలతో కలిసి త్వరలోనే హైదరాబాద్ నగరాన్ని వైఫై, 4జీ నగరంగా తీర్చుదిద్దుతామని స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి ప్రకటించారు.

మన సంస్కృతికి గౌరవం
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు తలమానికమైన బతుకమ్మ, బోనాల పండుగలను రాష్ట్ర పండుగలుగా ప్రభుత్వం ప్రకటించిందన్నారు. నా తెలంగాణ కోటి రతనాల వీణ అని నినదించిన తెలంగాణ కవి దాశరథి కృష్ణమాచార్య పేరున ప్రతి సంవత్సరం ఒక ఉత్తమ కవిని వెయ్యి నూటపదహార్లతో సత్కరించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు కేసీఆర్ తెలిపారు.

మతసామరస్యానికి తెలంగాణ ప్రతీక
వక్ఫ్ ఆస్తుల పరిరక్షణ కోసం వక్ఫ్ బోర్డుకు జుడిషియల్ అధికారాలను కల్పిస్తామన్నారు. దళిత క్రైస్తవులు చర్చిల నిర్మాణం కోసం కలెక్టర్ అనుమతి కోసం నిరీక్షించకుండా గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీల అనుమతితోనే ఇక నుంచి చర్చిలు నిర్మించుకునేలా నిబంధనలు సరళం చేస్తామని సీఎం తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో ఒక సిక్కు మతస్తుడు కరీంనగర్ కార్పొరేషన్ మేయర్‌గా ఎన్నికయ్యాడని, తెలంగాణలోని మత సామరస్యానికి, కాస్మొపాలిటన్ కల్చర్‌కు ఇది ప్రతీక అని చెప్పారు.

బలహీన వర్గాలు, వెనుకబడిన తరగతులు, అత్యంత వెనుకబడిన తరగతులకోసం ప్రభుత్వం ప్రత్యేక పథకాలు రూపొందిస్తుందన్నారు. వృద్ధులు, వితంతువులకు వెయ్యి రూపాయల పెన్షన్‌ను, వికలాంగులకు 1500 రూపాయల పెన్షన్‌ను దసరా కానుకగా అందజేస్తామన్నారు. దళిత, గిరిజన అమ్మాయిలకు పెళ్లికోసం 50 వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించే కళ్యాణలక్ష్మి పథకాన్ని కూడా దసరా పండుగ నుంచి ప్రారంభిస్తామని తెలిపారు. ఇలాంటి పథకం ఇప్పటి వరకు ఏ రాష్ట్రంలోనూ లేదని అన్నారు. మాజీ ప్రధాన మంత్రి పీవీ నర్సింహారావు పేరున వెటర్నరీ యూనివర్సిటీని, ప్రొఫెసర్ జయశంకర్ పేరుపై వ్యవసాయ విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేసి, వారిని స్మరించుకుంటున్నామని కేసీఆర్ అన్నారు. తెలంగాణలోని ప్రతి పల్లెకూ, ప్రతి ఇంటికి పరిశుభ్రమైన నీటిని అందించడం కోసం వాటర్ గ్రిడ్‌ను ఏర్పాటు చేస్తామని తెలిపారు. తెలంగాణలోని సర్వజనులు, సకల ప్రజానీకం సుఖశాంతులతో ఉండాలని స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా సీఎం కేసీఆర్ ఆకాంక్షించారు.

దళిత మహిళలకు భూమి పట్టాలు అందజేసిన కేసీఆర్
భూమిలేని నిరుపేద దళితులకు భూ పంపిణీని సీఎం కేసీఆర్ గోల్కొండ కోటనుంచి ప్రారంభించారు. తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఈ కార్యక్రమాన్ని సీఎం స్వయంగా ప్రారంభించారు. ఇందుకోసం తొమ్మిది జిల్లాల నుంచి 48 మంది భూమిలేని నిరుపేద దళిత మహిళలను గోల్కొండ కోటకు పిలిపించారు. సీఎం చేతుల మీదుగా పట్టాలు అందుకున్న వారిలో నిజామాబాద్ జిల్లాకు చెందిన మదారి శోభ, కరీంనగర్ జిల్లాకు చెందిన ఆరె నర్సమ్మ, నల్లగొండ జిల్లాకు చెందిన ఆదిమల్ల మాధవి, ఆదిలాబాద్ జిల్లాకు చెందిన కుంటల ప్రమీల, రాధమ్మ, మెదక్ జిల్లాకు చెందిన గడ్డం కల్పన ఉన్నారు. వీరితోపాటు తొమ్మిది జిల్లాకు చెందిన 48 మంది దళిత మహిళలకు సీఎం భూమి పట్టాలను అందజేశారు.

భూమి కొనుగోలుకు నిధుల మంజూరు
భూమిలేని నిరుపేద దళితులకు భూమిని అందజేయడానికి ప్రభుత్వమే భూమిని కొనుగోలు చేయనుంది. ఇందుకు జిల్లాలవారీగా నిధులను మంజూరు చేసింది. ఇందులో కరీనగర్ జిల్లాకు రూ.24.54 కోట్లు, మహబూబ్‌నగర్ రూ.24.52 కోట్లు, రంగారెడ్డి రూ.23.97 కోట్లు, నల్లగొండ రూ.22.57 కోట్లు, వరంగల్ రూ.21.99 కోట్లు, మెదక్ రూ.19.87 కోట్లు, ఆదిలాబాద్ రూ.18.53 కోట్లు, ఖమ్మం రూ.17.83 కోట్లు, నిజామాబాద్ రూ.15.33 కోట్లు, హైదరాబాద్ జిల్లాకు రూ.25 లక్షలు మంజూరు చేశారు. మొదటి దశ భూమి కొనుగోలు కోసమే ఈ నిధులు. ఇంకా అవసరమైతే రెండో, మూడో దశల్లో కూడా నిధులను మంజూరు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని అధికారులు వివరించారు.

[నమస్తే తెలంగాణ సౌజన్యంతో]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *