mt_logo

నమస్తే తెలంగాణ ఆత్మీయ యాత్ర

తెలంగాణ, సీమాంధ్ర ప్రాంతాల మధ్య ఒక సంభాషణ జరగవలసి ఉన్నది. విభజనపై స్పష్టంగా మంచీ చెడ్డ మాట్లాడుకోవలసి ఉన్నది. అపోహలు తొలగించుకోవలసి ఉన్నది. ‘విడిపోయి కలిసుందాం’ అని నమస్తే తెలంగాణ నమ్ముతున్నది. విభజన వికాసానికే అని ప్రతిపాదిస్తున్నది. అందుకోసం నమస్తే తెలంగాణ రథంతో ఆత్మీయయాత్ర ప్రారంభిస్తున్నది. ఆదరించండి.. ఆశీర్వదించండి..

తెలంగాణ కోసం అక్షర గవాక్షాలు తెరిచి నిలిచింది నమస్తే తెలంగాణ. తెలంగాణ విశిష్ట సంస్కృతి, చరిత్ర, సామాజిక ఆర్థిక అంశాలన్నింటికీ అక్షర రూపం ఇచ్చింది. వివక్ష, కొలువులు, వనరులు, భాష, యాస, సమస్త జీవన రంగాల్లో ఆధిపత్యశక్తులకు వ్యతిరేకంగా అక్షర శర సంధానం చేసింది. ఉద్యమానికి ఊతంగా నిలిచింది. మీడియా అంతా ఒకవైపు నడుస్తున్న తరుణంలో తెలంగాణపక్షంగా, ఆకాంక్షల పతాకగా నిలిచి మన పత్రిక, మన ఆత్మగౌరవ నినాదమైంది. తెలంగాణవ్యాప్తంగా అశేష పాఠకుల విశేష ఆదరణను చూరగొన్నది. పత్రిక నడపడంలో పడే ప్రయాసలన్నింటినీ నమస్తే తెలంగాణ పాఠక మహాశయుల ప్రేమతో మరచిపోయింది.

కష్టాలను దాటి నిర్విఘ్నంగా, దీటుగా, రాజీపడకుండా, సాంకేతిక రంగుల హరివిల్లులను ఆవిష్కరిస్తూ రెండేళ్లు తెలంగాణ పతాక శీర్షిక అయింది నమస్తే తెలంగాణ. కేవలం ఒక పత్రిక నడపడంతోనే అయిపోయిందా? తెలంగాణ తల్లి బిడ్డగా ఒక పత్రిక ఇంతకుమించి చేయాల్సిందేమీ లేదా? అన్నప్పుడు.. ముఖ్యంగా తెలంగాణ కోసం ఆరిపోయిన దీపాల వంటి అమరుల గురించి ఆలోచించింది నమస్తే తెలంగాణ. అందుకే బిడ్డలను పోగొట్టుకుని దుఃఖిస్తున్న తల్లుల కన్నీరు తుడవడానికి ‘అమర వీరుల నిధి’ ఏర్పాటు చేసి తెలంగాణ అమరవీరుల కుటుంబాల బాధ్యతనూ ఎత్తుకున్నది. అరవై లక్షల రూపాయల నిధి సమీకరించి, సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో అమరవీరుల కుటుంబాలకు 25000 రూపాయల చొప్పున కనీస సాయాన్ని అందించింది. ఆనాడు సుందరయ్య విజ్ఞాన కేంద్రం దుఃఖంతో నిండింది. ఆ అమరవీరుల కుటుంబాల కన్నీళ్లు తుడిచిన ఆ మహత్తర క్షణాలు నమస్తే తెలంగాణ మరిచిపోలేని అనుభవం.

అట్లాగే తెలంగాణ ఒక విశిష్ట సంస్కృతీ చిహ్నం. పది జిల్లాలలో వందలాది దేవాలయాలు. పురావైభవ చిహ్నాలు.

దక్కనీ సంస్కృతీపతాకలు. తెలంగాణ దేవాలయాలన్నింటినీ అద్భుతమైన చిత్రకళా రూపాలుగా మలిచి ‘టెంపుల్స్ ఆఫ్ తెలంగాణ’ అని ప్రపంచానికి చాటింది నమస్తే తెలంగాణ. ఒకవంక తెలంగాణ కోసం పత్రిక నిర్వహణ. మరోవంక తెలంగాణ అమరవీరుల కుటుంబాలకు అండగా నిలవడం, దేవాలయాల కీర్తి పతాకను ఎగరేయడం ఈ రెండేళ్ల కాలంలో నమస్తే తెలంగాణ సగర్వంగా ప్రకటించుకుంటున్న విజయాలు. నిజానికి పత్రిక మాది అని ప్రజలు, పాఠకులు స్వీకరించడమే ఈ పత్రిక అతి గొప్ప విజయం.తెలంగాణ ఉద్యమం సీమాంధ్ర ప్రాంత ప్రజలకు వ్యతిరేకంగా లేదన్న విషయాన్ని మలి విడత ఉద్యమం ప్రారంభం అయిన తర్వాత చాలామంది బుద్ధిజీవులు, మేధావులు ఎప్పటికప్పుడు తేటతెల్లంచేస్తూనే ఉన్నారు. కొంతమంది స్వార్థపూరిత, రాజకీయ, ఆర్థిక పెత్తందారీ శక్తులకు తప్ప రాష్ట్ర విభజన పట్ల సీమాంధ్ర సామాన్య జనానికి ఎలాంటి వ్యతిరేకత లేదనే అభిప్రాయం ఉంది. కానీ ఆ ప్రాంతం వారితో ఇప్పటి వరకు తెలంగాణ రాజకీయ, ఉద్యమ, సామాజిక శక్తులేవీ సంభాషించలేదు. సామరస్యంగా విడిపోవడానికి ఏ ప్రయత్నమూ జరగలేదు. ఈ ప్రయత్నాలు జరగడం అత్యవసరం అనేవారు తెలంగాణలో ఎందరున్నా ఆచరణలో అవతలి ప్రాంతంతో సంభాషించిన వాళ్లెవరూ లేరు. ఇప్పుడిక ఒక బాధ్యత గల పత్రికగా ఈ ప్రయత్నాన్ని ప్రారంభిస్తున్నది నమస్తే తెలంగాణ. ‘విడిపోయి కలిసుందాం’ అనే నినాదంతో.. సీమాంధ్ర ప్రాంతంలో, అక్కడి ప్రజానీకంతో సంభాషించడానికి నడుం కట్టింది. ఇది చరిత్రాత్మకమైన ఘట్టం. ఒక సామాజిక బాధ్యతగా తెలంగాణ తరఫున సీమాంధ్ర ప్రజలతో సంభాషించే ప్రయత్నం చేయడం చరిత్రే. ఆ చరిత్రకు మేము శ్రీకారం చుడుతున్నాం.

నిజానికి రాష్ట్ర విభజన అనేది ఇప్పుడొక చారిత్రిక ఆవశ్యకత. సమైక్య ఆంధ్రప్రదేశ్ ఆవిర్భవించినప్పుడు రాష్ట్ర జనాభా మూడు కోట్లు ఉంటే.. ఇప్పుడు అది ఎనిమిది కోట్లకు చేరింది. విభజన జరగాల్సిన పరిపాలనాపరమైన ఆవశ్యకతను ఇది వెల్లడిస్తున్నది. రెండు రాష్ట్రాలుగా విడిపోయి.. కలిసికట్టుగా మనం చేసే కృషి.. వెలుగుల కేంద్రంగా చెప్పే గుజరాత్‌ను సైతం అధిగమిస్తుంది. ఇందులోనూ అధిక ప్రయోజనాలు విస్తారమైన తీర ప్రాంతం ఉన్న కోస్తాంధ్రకే దక్కుతాయి. విజయవాడ, విశాఖపట్నం వంటి అనేక నగరాలు.. ప్రపంచ స్థాయి నగరాలుగా అభివృద్ధి చేసుకునేందుకు, ప్రపంచంతో పోటీపడేందుకు అవకాశం కలుగుతుంది. అంతర్జాతీయ విమానాశ్రయాలు.. దుబాయి, సింగపూర్, హాంకాంగ్ వంటి దేశాలకు నేరుగా విమాన సౌకర్యం.. భారీ స్థాయిలో విస్తరించే ఐటీ పరిశ్రమ.. కొత్తగా వచ్చే హైకోర్టు.. నవ నగరంగా ఆవిర్భవించే కొత్త రాజధాని.. అసెంబ్లీ! మొత్తంగా మౌలికరంగ విప్లవాత్మక వృద్ధి! అందుకు అవకాశం ఇస్తున్నది రాష్ట్ర విభజన.

ప్రత్యేక తెలంగాణ ఏర్పడటం ఖాయమని దాదాపు తేలిపోయింది. అది ఎప్పుడన్నదే ప్రశ్న. మరో ఏడాది తర్వాతనో.. ఐదేళ్ల తర్వాతనో కాకుండా.. అది ఎంత త్వరగా జరిగితే సీమాంధ్ర ప్రజలకు, వారి ప్రాంత మౌలికరంగ అభివృద్ధికి అంత మేలు. విభజన జరిగిన తర్వాత తెలంగాణలోని ఇతర ప్రాంతాలవారి భద్రతేంటి? పెట్టుబడుల పరిస్థితేంటి? నిజానికి ఈ విషయాల్లోనే కొంతమంది సీమాంధ్ర పెట్టుబడిదారులు లేనిపోని అనుమానాలు లేవనెత్తుతున్నారు. అర్థంపర్థంలేని భయాలు కల్పిస్తున్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఈ ప్రాంతంలో స్థిరపడిన ఇతర ప్రాంత ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేదు. సీమాంధ్ర పెట్టుబడిదారులకు ఎర్ర తివాచీ పరుస్తామని టీఆర్‌ఎస్ అధ్యక్షుడు కే చంద్రశేఖర్‌రావు సహా వివిధ తెలంగాణ పార్టీల నాయకులు ఈ విషయంలో ఇప్పటికే విస్పష్టంగా చెప్పి ఉన్నారు. దేశంలోని ఇతర రాష్ట్రాలకు చెందిన అనేక మంది ప్రస్తుతం తెలంగాణలో, ప్రత్యేకించి హైదరాబాద్‌లో సురక్షితంగా ఉన్నట్లే.. వారి బతుకుదెరువు వారు చూసుకుంటున్నట్లే సీమాంధ్ర వాసులు కూడా నిర్భయంగా ఉండొచ్చు. రియల్‌ఎస్టేట్ రంగం అనేది కూడా విభజనలో కీలక ప్రభావం చూపే అంశం. ఇప్పటికే హైదరాబాద్‌లో, దాని చుట్టుపక్కల రియల్ ఎస్టేట్ ధరలు తక్కువ స్థాయిలో ఉన్నాయి. ఈ స్థాయిని దాటి ఇంకా కిందికి వెళ్లే అవకాశం లేదు. కానీ విభజన జరిగి అంతా సర్దుకున్న తర్వాత వచ్చే జాతీయ, అంతర్జాతీయ ఇన్వెస్టర్లతో హైదరాబాద్‌లో స్థిరపడిన ఆంధ్రా ప్రజలు అధికంగా లబ్ధి పొందుతారు. మరోవైపు ఆంధ్రా ప్రాంతంలో భూముల ధరలు రాష్ట్ర విభజన ప్రకటన రావడంతోనే రెట్టింపు అవుతాయి.

రాష్ట్రం విడిపోయిన తర్వాత ఇక్కడే ఉండిపోయే సీమాంధ్ర ప్రజల రాజకీయ హక్కులకు కూడా తెలంగాణ నాయకత్వం భరోసా ఇస్తున్నది. తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర వంటి చోట్ల ఉన్నట్లే ఇక్కడి సీమాంధ్ర ప్రజలు కూడా ఎన్నికల్లో పోటీ చేసి.. తెలంగాణ రాజకీయ వేదికపై భాగం పంచుకోవచ్చు. హిందీ మాట్లాడే రాష్ట్రాలు ఏడు ఉండగా.. తెలుగు మాట్లాడే రాష్ట్రాలు రెండు ఉండటంలో తప్పేమీ లేదు. నీటి వనరులు, ఆస్తుల పంపకాలు అన్నీ కేంద్ర ప్రభుత్వం నియమించిన ట్రిబ్యునల్ ఆధ్వర్యంలోనే జరుగుతాయి కనుక ఆ విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరమే లేదు. నమస్తే తెలంగాణ పత్రికగా మేం భావించేది ఒక్కటే. శాంతియుత విభజన అనేది రెండు ప్రాంతాల సుస్థిరతకు, శ్రేయస్సుకు, అభివృద్ధికి బాటలు తీస్తుంది. తెలుగు ప్రజల ప్రయోజనాల కోసం ఒక సామాజిక బాధ్యతకు తెలుగువారిగా కట్టుబడేందుకు మనల్ని భాగస్తులను చేస్తుంది. అందుకే.. ఇక్కడి ప్రజల ఆకాంక్షలను తెలియజేస్తూ నమస్తే తెలంగాణ ఒక రథాన్ని తయారు చేసింది. ఆంధ్రప్రదేశ్ విడిపోతే ఎవరికీ నష్టం లేదని, రెండు ప్రాంతాలు విడిపోయి, కలిసి ఉండవచ్చునని, విడిపోతే తెలంగాణ కన్నా సీమాంధ్ర ‘అభివృద్ధి తరంగంలా మారిపోతుందని నమస్తే తెలంగాణ నమ్ముతున్నది. అందుకోసమే నమస్తే తెలంగాణ రథం ఇక్కడి ప్రజల అభిప్రాయాలు మోసుకొని, సీమాంధ్ర ప్రజల చెంతకు యాత్ర చేస్తున్నది. తెలుగు ప్రజలు విడిపోయి కలిసుందామని, ఈ రాష్ట్రానికి అదే భవిష్యత్తని నమ్ముతూ, ఒక మంచి ప్రయత్నంగా ఇరు ప్రాంతాల మధ్య వారధిని నిర్మించే సాధనంగా మా నమస్తే తెలంగాణ రథాన్ని చూడాలని, ఆదరించి, రెండు ప్రాంతాల తెలుగు ప్రజల మధ్య సామరస్యం, శాంతి, సద్భావన కోసం కృషి చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం. మా ఈ ప్రయత్నం కేవలం ఇరు ప్రాంతాల మధ్య అభివూపాయాలు పంచుకోవడానికి మాత్రమే. ఆశీర్వదించండి. విడిపోయి కలిసుందాం…

మీ
సీఎల్ రాజం
సీఎండీ నమస్తే తెలంగాణ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *