ఎన్నో ఉద్యమాల ఫలితంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని, రాష్ట్ర పునర్నిర్మాణంలో ప్రతిఒక్కరూ కృషి చేయాలని భువనగిరి ఎంపీ బూర నర్సయ్యగౌడ్ అన్నారు. ఆదివారం నల్గొండలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ, నల్గొండ జిల్లా బీబీనగర్ నిమ్స్ ఆస్పత్రిలో అత్యాధునిక సౌకర్యాలు కల్పించి తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ తో ప్రారంభం చేయిస్తానని, నిమ్స్ ను సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిగా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు. డాక్టర్ జేఏసీ తరపున ఎన్నో ఉద్యమాలు చేసిన తనను ఆదరించి ఎంపీ గా గెలిపించినందుకు భువనగిరి పార్లమెంటు నియోజకవర్గ ప్రజలకు, పార్టీ కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు.
జిల్లాలో ఫ్లోరోసిస్ సమస్య తీవ్రంగా ఉందని, అంతకుముందు పాలకులు ఫ్లోరోసిస్ సమస్య పరిష్కారంకై 1800 కోట్లు ఖర్చు పెట్టినా సమస్య అలాగే ఉందని, సరికొత్త రీతిలో తాను అభివృద్ధి చేపడుతానని పేర్కొన్నారు. భువనగిరి ఎంపీ అయినప్పటికీ, జిల్లా అభివృద్ధికి కృషి చేస్తానని, సాగునీరు, తాగునీటి సమస్యలను పరిష్కరించేందుకు ఎక్కువ నిధులు తీసుకొచ్చి ఇక్కడి ప్రజల సమస్యలు తీరుస్తానని స్పష్టం చేశారు.