నల్గొండ జిల్లా బీబీనగర్ లో హెల్త్ యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని రాష్ట్రప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేస్తుంది. యూనివర్సిటీ నిర్మాణం కోసం 300 ఎకరాల భూమిని కూడా గుర్తించారు. తెలంగాణలో ఉన్న మెడికల్, డెంటల్, నర్సింగ్, పారామెడికల్, ఆయుర్వేద, హోమియోపతి, యునానీ, నేచురోపతి తదితర కళాశాలలు ఇప్పటికీ ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నట్లుగానే ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పరిధిలో ఉన్నాయి.వీటన్నింటికీ ప్రతి సంవత్సరం అఫిలియేషన్ రెన్యూవల్ చేయించుకోవాల్సి ఉంటుంది.
అదేకాకుండా రాష్ట్ర విభజన నేపథ్యంలో తెలంగాణలోని నర్సింగ్, పారామెడికల్ కళాశాలల రిజిస్ట్రేషన్ విషయంలో ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీలోని ఆంధ్ర అధికారులు వివక్ష చూపుతున్నారని విమర్శలు వస్తున్నాయి. ఎంబీబీఎస్ కోర్సుకు పరీక్షలు అన్నీ ఆ యూనివర్సిటీనే నిర్వహిస్తుండటంతో రాష్ట్ర విద్యార్థులకు, వైద్య కళాశాలలకు తీవ్ర నష్టం జరిగే అవకాశం ఉంది. ఇటీవల రాష్ట్ర స్థాయి ర్యాంకు సాధించిన గిరిజన విద్యార్థినికి యూనివర్సిటీ అధికారులు సీటు ఇవ్వకుండా అన్యాయం చేసిన ఘటనే ఇందుకు ఉదాహరణ.
పైన చెప్పిన సమస్యలన్నిటినీ పరిశీలించిన తర్వాత తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో హెల్త్ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది. అసెంబ్లీలో చట్టం లేదా ఆర్డినెన్స్ తీసుకురావడం ద్వారా హెల్త్ యూనివర్సిటీ ఏర్పాటు చేయవచ్చు. ఇప్పటినుండి మొదలుపెడితే వచ్చే విద్యా సంవత్సరం కల్లా యూనివర్సిటీ పూర్తి అవుతుంది.