-12 ఏళ్ల క్రితం సీఎం కేసీఆర్‌ను కదిలించిన అగ్నిప్రమాదం
-వరంగల్ జిల్లా ములుగు మండలం భాగ్యతండాలో ఘటన
-ఆగిపోయే పెళ్లిని చేతులమీదుగా జరిపించి ఆదుకున్న ఉద్యమ నేత
-కృతజ్ఞతగా పిల్లలకు చంద్రకళ, చంద్రహుస్సేన్ పేర్లు పెట్టిన కల్పన
ఆకలైన వారికే అన్నం విలువ తెలుస్తుంది! కన్నీళ్లలో భాగం పంచుకున్నవారికే కష్టమేందో అర్థమైతది! హృదయ విదారక ఘటనలను చూసి చలించిన హృదయం స్పందిస్తుంది! ఉడుతాభక్తిగా ఉన్నంతలో సాయం చేయడానికి ముందుకొస్తుంది.
అలాంటి మనసున్న మహోన్నత వ్యక్తి పాలనాదక్షుడైతే ప్రజోపయోగకరపథకాలు పుట్టుకొస్తాయి! ఆ కోవలోనిదే ఎస్సీ, ఎస్టీ వధువులకు రూ.50,000 ఇచ్చేందుకు టీఆర్‌ఎస్ సర్కార్ ప్రవేశపెట్టిన కళ్యాణ లక్ష్మి. స్పందించే హృదయం.. మనసున్న మారాజు సీఎం కేసీఆర్ అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ పథకం మదిలో రూపుదిద్దుకోవడానికి 2002లో వరంగల్ జిల్లా ములుగు మండలం కొడిశలకుంట పంచాయతీ పరిధిలోని భాగ్యతండాలో జరిగిన అగ్నిప్రమాద సంఘటనే కారణం. ఆ ప్రమాదంలో కట్నం కోసం దాచిపెట్టిన డబ్బుతోపాటు ఇల్లు కాలిపోవడంతో కూతురు పెళ్లి ఆగిపోతుందేమోనని తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు.
ఆనాడు తెలంగాణ ఉద్యమ జెండానెత్తుకొని ఊరురా తిరుగుతున్న టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌ను ఈ ఘటన కదిలించింది. ఆ పిల్ల పెళ్లి చేయిస్తానని హామీ ఇచ్చుడే కాకుండా, పెళ్లి ఖర్చు భరించారు. పట్టుచీర, పసుపు కుంకుమలు, పండ్లు ఒడిలో పెట్టి నవదంపతులను ఆశీర్వదించారు. ఈ విషయాన్ని గురువారం టీ న్యూస్ ముఖాముఖిలో సీఎం కేసీఆర్ స్వయంగా వెల్లడించారు. ఈ నేపథ్యంలో టీ మీడియా శుక్రవారం ఆ తండాను సందర్శించి బాధితులతో మాట్లాడింది. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రకటించిన కళ్యాణలక్ష్మి వెనుక ఆనాటి వధువు కల్పన వ్యథ ఉండటం, అది ఆయన గుర్తుంచుకోవడం పూర్వజన్మ సుకృతంగా కల్పన కుటుంబసభ్యులు భావిస్తున్నారు. కేసీఆర్ అందించిన సాయాన్ని ఆ కుటుంబం మరువలేదు. ఆయనను నిత్యం తలచుకునేందుకు కూతురుకి చంద్రకళ, కొడుక్కు చంద్రహాసన్ పేరు పెట్టుకున్నారు.
ఆనాడు ఏం జరిగింది?
అది 2002 సంవత్సరం. ఉగాది పండుగకు వరంగల్ జిల్లా ములుగు మండలం కొడిశలకుంట భాగ్యతండాలోని పెద్దలంతా బంధువుల ఇండ్లకు దుర్గమ్మ పండుగకు వెళ్లారు. తండాకు చెందిన బానోతు కీమానాయక్, రుక్కలమ్మల ముగ్గురు బిడ్డలైన కల్పన, సునీత, కవిత ఇంటి వద్దే ఉండి రాత్రి నిద్ర పోతుండగా గుడిసెకు నిప్పంటుకుంది. ముగ్గురూ బయటికి పరుగుపెట్టారు. అప్పటికే మంటలు వ్యాపించి కళ్ల ముందే వస్తువులన్నీ బూడిదైపోయాయి. తండా మొత్తం బూడిదైంది. ఆవులు, బర్రెలు, జీవాలు, కోళ్లు ఎముకల గూళ్లలయ్యాయి. ఇంటియజమాని బానోతు కీమా దంపతులు దుఃఖంలో మునిగి ఇంటికిచేరారు. శ్రీరామనవమి ఎల్లినంక పెద్ద బిడ్డ(కల్పన) పెళ్లి పెట్టుకున్నారు. పెళ్లి కోసం కీమా ఇంట్లో దాచిన రూ.50వేలు కాలి బూడిదవడంతో పెళ్లి ప్రశ్నార్థకమైంది.
ఆ సమయంలో తెలంగాణ సింహగర్జన చేస్తున్న ఉద్యమనేత కేసీఆర్ బాధితులను పరామర్శించడానికి అన్ని పార్టీల నేతల కంటే ముందు వచ్చారు. తెలంగాణవాళ్లు సచ్చినా పట్టించుకునే సోయిలో చంద్రబాబు లేడు. హైటెక్ సోకుల్లో పడి పైపైకి చూస్తున్నడు. కాలిపోయిన ఈ లంబాడోళ్ల బతుకులు నీకు కనిపిస్తలేదా చంద్రబాబు అని ఆరోజు కేసీఆర్ నిలదీశారు. అసలు అగ్గి ఎక్కడ పుట్టిందని బానోతు కీమా ఇంటికి వెళ్ల్లి పరిశీలిస్తుండగా భోరున ఏడుస్తూ ముగ్గురు ఆడపిల్లలతో బాధితుడు అమాంతం కేసీఆర్ కాళ్లపై పడ్డాడు. ఆయనను ఓదార్చి, ఏం కష్టమెందని ఆరాతీశారు. కీమా పూసగుచ్చినట్లు చెప్పగా విన్న కేసీఆర్ చలించిపోయి అప్పటికప్పుడే నిర్ణయాన్ని ప్రకటించారు. కల్పన పెళ్లికయ్యే ఖర్చంతా భరిస్తా. కాలిన రూ.50వేలు నేనే ఇస్తా. పెళ్లి ఎప్పుడో చెప్తే స్వయంగా వస్తా.
పెళ్లి భోజనాలు, లాంఛనాల ఖర్చులన్నీ భరిస్తా అని భరోసా ఇచ్చారు. అన్నట్టే పెళ్లికి కేసీఆర్ హాజరై కట్నకానుకలు అందించి నవ దంపతులను దీవించారు. అప్పుడే అనుకున్నారేమో తెలంగాణ పల్లెల్లో ఈ దుఃఖం పోవాలని! అప్పుడే అనుకున్నారేమో తెలంగాణ వస్తే వీళ్లందరికీ ఏదో సాయం చేయాలని! తెలంగాణ వచ్చింది. కేసీఆరే ముఖ్యమంత్రి అయ్యారు. ఎన్నికల మ్యానిఫెస్టోలో పేర్కొనకపోయినా గత స్మృతులు గుర్తొచ్చాయి. అంతే.. దళిత, గిరిజన అమ్మాయిల పెళ్లికి రూ.50 వేలు చెల్లించేలా కళ్యాణలక్ష్మి పథకాన్ని ఈనెల 16న క్యాబినెట్ ప్రకటించింది. ఏదేమైనా ఆనాటి ఘటనను భాగ్యతండావాసులు ఇప్పటికీ గుండెల్లో పదిలంగా దాచుకున్నారు. కేసీఆర్ వచ్చి పోయినంకనే అధికారుల్లో కదలిక వచ్చిందని, తండా పునర్నిర్మాణానికి పక్కా ఇండ్లు, నీళ్ల ట్యాంక్ ఏర్పాటు చేశారని మాలోతు పాత్యానాయక్, ధారావత్ రమేశ్, ఎంపీటీసీ హరిలాల్ తెలిపారు.
మా పిల్లలకు సారు పేరే పెట్టుకున్నం
– నూనావత్ కల్పన
తండాల్లో పుట్టిన నాకు సదువు అబ్బలేదు. అమ్మనాయినలతో పొలం పనులకు పోయేదాన్ని. నా పెళ్లి పెట్టుకున్న కొద్దిరోజులకే ఇల్లు కాలి పైసలు కాలిపోయినయ్. కేసీఆర్ సారొచ్చి నాపెళ్లి ఖర్చులు భరిస్తానని మాట ఇచ్చి నా పెళ్లికి వచ్చి అక్షింతలు ఏసినప్పుడు మా నాయిన ముఖంలో సంతోషాన్నిచూసిన. అంత పెద్దాయన నా పెళ్లికి వచ్చిండు. నేను కేసీఆర్ సార్‌ను జీవితంలో మర్చిపోను. అందుకే నా పిల్లలకు చంద్రకళ(8), చంద్ర హుస్సేన్(6)అని, ఆయన పేరు దేవుని పేరు కలిసొచ్చేటట్లు పెట్టుకున్న. నా బాధ చూసి కళ్యాణలక్ష్మి పథకం పెట్టడం సంతోషంగా ఉంది.
మా పాలిట పున్నమిచంద్రుడు
– బానోతు కీమానాయక్
ఇల్లు కాలి పుట్టెడు దుఃఖంలో ఉన్నప్పుడు కేసీఆర్ సార్ మాకు ఓ దారి చూపించిండు. మా పాలిట పున్నమి చంద్రుడు. రాష్ట్రం వచ్చేదాక ఆయన నడిచిన బాటలోనే నడిచిన. ఆయన దీక్ష చేసినప్పుడు భయంతో టీవీలో ఆయన్ని చూస్తూ లోలోపలనే కుమిలిపోయిన. ఇప్పుడు తెలంగాణ వచ్చింది. ఉద్యమ నేతగా నా ఒక్క బిడ్డపెళ్లికే ఆయన చేతిగుంట సహాయం అందించిండు. ఇప్పుడు ఆయనే సీఎం. కళ్యాణలక్ష్మి పథకం పెట్టి లక్షలాది మంది మా అసొంటి పేదోళ్ల పెళ్లిళ్లకు సహాయం చేత్తాననడం సంతోషం.
మా ఊళ్లే నన్ను కేసీఆర్ అంటరు
– నూనావత్ యాకూబ్
మాది నల్లబెల్లి మండలం మూడు చెక్కలపల్లె. వీళ్లది(కల్పన) భాగ్యతండా. కల్పనతో నాకు పెళ్లి చేస్తామని మాట్లాడుకున్నంక వాళ్ల ఇల్లు కాలిపోయింది. దేవునోలే వచ్చిన కేసీఆర్ సార్ మా పెళ్లికి పెద్ద దిక్కైండు. నన్ను మా ఊళ్లే కేసీఆర్ అని తమాషకు పిలుస్తరు. కట్నం తీసుకోలే. ఎకరన్నర భూమే ఉంది. కూలీ చేసుకొని బతుకుతున్నం. కొడుకును ప్రైవేట్ బడికి పంపి ఏడాదికి ఫీజు రూ.10వేలు కడుతున్న. అంతకట్టలేక బిడ్డను సర్కార్ బడికి పంపుతున్నం.
నమస్తే తెలంగాణ సౌజన్యంతో..