రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న వాటర్ గ్రిడ్ ప్రాజెక్టు నిర్మాణంలో అంతర్జాతీయ ప్రమాణాలున్న కంపెనీలకే భాగస్వామ్యం కల్పిస్తామని, నాణ్యత విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని పంచాయితీ రాజ్ శాఖామంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. మూడున్నరేళ్లలో వాటర్ గ్రిడ్ నిర్మాణం పూర్తి చేస్తామని, ప్రస్తుత బడ్జెట్ లోనే ఈ ప్రాజెక్టుకు నిధులు విడుదల చేస్తామని చెప్పారు.
సోమవారం రాజేంద్రనగర్ లోని అపార్డ్ లో వాటర్ గ్రిడ్ ప్రాజెక్టుకు అవసరమైన పైపుల తయారీదారుల ప్రతినిధులతో కేటీఆర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వాటర్ గ్రిడ్ కోసం 1,26,000 కిలోమీటర్ల మేరకు పైపులైన్ల నిర్మాణం జరుగుతుందని, అందుకే జాతీయస్థాయిలో పైపుల తయారీరంగంలో పేరున్న కంపెనీలనే ఈ సమావేశానికి ఆహ్వానించామని అన్నారు. కంపెనీలతో నేరుగా ప్రభుత్వం ఒప్పందం చేసుకుంటుందని, టెండర్ల ప్రక్రియ పారదర్శకంగా ఉంటుందని, నాణ్యత లేకున్నా, నిర్ణీత గడువులోపు పైపులను అందించకున్నా కఠినంగా వ్యవహరిస్తామని చెప్పారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ 20 ఏళ్ల క్రితం సిద్దిపేట ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నియోజకవర్గానికి కేవలం 14 నెలల్లోనే తాగునీరు అందించిన విధంగానే టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చే మూడున్నరేళ్లలో రాష్ట్రమంతటా తాగునీరు అందించాలని లక్ష్యంగా పెట్టుకుందని, తొమ్మిది జిల్లాల్లో ఏకకాలంలో వాటర్ గ్రిడ్ పనులను ప్రారంభిస్తామని, ఒక్కో గ్రిడ్ ను ఒక్కో ఇంజినీరింగ్ అధికారి పర్యవేక్షిస్తారని కేటీఆర్ తెలిపారు.