mt_logo

నాలుగైదు నెలల్లో లక్ష ఉద్యోగాలు!

రాష్ట్రంలో వచ్చే నాలుగైదు నెలల్లో లక్ష ఉద్యోగాలు భర్తీ చేస్తామని, నిరుద్యోగ యువతకు ఐదేండ్ల వయోపరిమితి సడలింపు ఇచ్చి ఖాళీ ఉద్యోగాలన్నింటినీ భర్తీ చేస్తామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు సోమవారం శాసనసభలో ప్రకటించారు. నిరుద్యోగ యువత ఎలాంటి నిరాశా నిస్పృహలకు గురి కావొద్దని, కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్దీకరణకు ప్రభుత్వం నూటికి నూరుపాళ్ళు కట్టుబడి ఉందని, రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటించి అందరికీ న్యాయం చేస్తామని అన్నారు.

కొత్త రాష్ట్రం తన గమ్యాన్ని, గమనాన్ని నిర్దేశించుకునే క్రమంలో ఉందని, పోలీసు శాఖలో 3,700 కానిస్టేబుళ్లు, హోంగార్డుల పోస్టుల భర్తీకి అనుమతించామని, రాష్ట్రంలో 25 వేల మంది కాంట్రాక్టు ఉద్యోగులున్నారని, అందులో 21 వేల మంది మన తెలంగాణకు వస్తారని అధికారులు చెప్తున్నారని అన్నారు. వారిలో 19 వేల మందిపై స్పష్టత వచ్చిందని, కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్దీకరణ అంశంపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధ్యక్షతన ఉన్నతాధికారులతో కమిటీ ఏర్పాటు చేశామని, త్వరలో ఈ కమిటీ నివేదిక ఇస్తుందని సీఎం తెలిపారు.

ఉద్యోగుల విభజనపై కమల్ నాథన్ కమిటీ తేల్చేస్తే పరిస్థితులను బట్టి వయోపరిమితిని సడలించి అన్ని ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తామని, ప్రభుత్వ శాఖల్లో ఉన్న 1 లక్షా 7 వేల ఖాళీ ఉద్యోగాలతో పాటు తెలంగాణ జెన్ కో, ఎన్టీపీసీ లలో 10 వేల మెగావాట్ల విద్యుత్ ప్రాజెక్టులు రాబోతున్నందున అందులో కూడా వేల సంఖ్యలో ఉద్యోగాలు, ఉపాథి అవకాశాలు లభిస్తాయని కేసీఆర్ పేర్కొన్నారు. త్వరలో తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా నియామకాలు చేపడతామని, క్యాడర్ల వారీగా ఎన్ని పోస్టులు వస్తాయనే అంశంపై స్పష్టత వస్తే నిరుద్యోగులకు లక్షకు పైగా ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *