ఎన్నికల మానిఫెస్టోలో ఇవ్వని హామీలను ఇచ్చామని చెప్పవద్దని, తాము ఏది చెప్పినా ఎంతో బాధ్యతగా చెప్తామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు టీడీపీ ఫ్లోర్ లీడర్ ఎర్రబెల్లి దయాకర్ రావుకు సూచించారు. ఎన్నికల హామీల్లో ఇంటికో ఉద్యోగం అంశాన్ని పెట్టలేదని, డ్వాక్రా మహిళల రుణాలు మాఫీ చేస్తామని చెప్పలేదని స్పష్టం చేశారు. తనపై ఎన్ని వత్తిళ్ళు వచ్చినా వాటిని మానిఫెస్టోలో పెట్టలేదని, తనకు అబద్దాలు చెప్పడం రాదని, చెప్పిందే చేస్తానని కేసీఆర్ తేల్చిచెప్పారు.
తాము ఏది చెప్పినా బాధ్యతగా చెప్పామని, ఉత్తపుణ్యానికి చెప్పలేదని, వందకు వంద శాతం ఎన్నికల మానిఫెస్టోలో ఇచ్చిన హామీలను నెరవేరుస్తామని చెప్పారు. డ్వాక్రా రుణ పరిమితిని 5లక్షల రూపాయల నుండి 10లక్షల రూపాయలకు పెంచుతామని చెప్పామని, రైతులందరికీ లక్ష రూపాయల లోపు పంట రుణాలను మాఫీ చేస్తామని చెప్పినట్లు సీఎం కేసీఆర్ గుర్తు చేశారు.
ఢిల్లీ వెళ్లి ప్రధానిపై ఒత్తిడి తెచ్చి దొంగదారిన పోలవరంపై ఆర్డినెన్స్ జారీ చేయించింది చంద్రబాబేనని మండిపడ్డారు. పోలవరం ఆర్డినెన్స్ కు వ్యతిరేకంగా తెలంగాణ బంద్ కు పిలుపునిచ్చామని, ఆర్డినెన్స్ ఆపాలని రాష్ట్రపతికి లేఖ కూడా రాశామని కేసీఆర్ గుర్తుచేశారు.