mt_logo

మైహోం భూమిపై తెలుగు తమ్ముళ్ళ రెండు నాల్కల ధోరణి!

హైటెక్ సిటీకి దగ్గరలో ఉన్న భూమిని గతంలో ఏపీఐఐసీ వేలం వేస్తే తెలంగాణ పారిశ్రామికవేత్త, మైహోం గ్రూప్ చైర్మన్ జూపల్లి రామేశ్వర్ రావు కొనుగోలు చేశారు. ఒక తెలంగాణ పారిశ్రామికవేత్తకు భూమిని ఇవ్వడం ఇష్టంలేక అప్పటి కిరణ్ కుమార్ సర్కార్ వేధించడం మొదలుపెట్టి చివరకు ఆ భూమిని గేమింగ్ పార్క్ కు కేటాయించింది. గత ఏడాది జనవరి 8న గేమింగ్ పార్కుకు సమైక్య రాష్ట్ర చివరి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి శంకుస్థాపన చేయడంతో రామేశ్వర్ రావు శంకుస్థాపన సభలోనే ఆందోళనకు కూడా దిగారు. ఆ సంఘటనను ఖండిస్తూ వెంటనే టీడీపీ అధినేత చంద్రబాబు తెలంగాణ టీడీపీ నేతలను రంగంలోకి దింపి ఆందోళన చేయించారు.

రామేశ్వర్ రావు 30 ఎకరాల భూమిని ప్రభుత్వం వద్దనుండి ఎకరం రూ. 21 కోట్ల చొప్పున కొనుగోలు చేశారని, ప్రభుత్వానికి 450 కోట్ల రూపాయలు చెల్లించారని, ఆ భూమిని గేమింగ్ పార్కు పేరుతో స్వాధీనం చేసుకొని పార్కుకు కేటాయించడం ఏమిటని టీడీపీ నేతలు ఎర్రబెల్లి దయాకర్ రావు, అప్పటి రంగారెడ్డి జిల్లా టీడీపీ అధ్యక్షుడు పట్నం మహేందర్ రెడ్డి తదితరులు ఆందోళనకు దిగారు. మరుసటిరోజు అంటే జనవరి 9 వ తేదీన సీఎం కార్యాలయం ముందు తెలంగాణ టీడీపీ నేతలు బైఠాయించగా కిరణ్ కుమార్ రెడ్డి వారిని తన చాంబర్ కు పిలిపించి మాట్లాడారు. సీఎం ఛాంబర్ లో టీడీపీ ఎమ్మెల్యేలకు, పొన్నాలకు మధ్య తీవ్ర వాగ్వివాదం కూడా జరిగింది. విషయం ఇంతవరకూ వచ్చాక చేసేదేమీలేక గేమింగ్ పార్కుకి ఇచ్చిన కేటాయింపులు రద్దు చేసి మైహోం కు భూమిని అప్పగిస్తానని కిరణ్ కుమార్ రెడ్డి తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యేలకు హామీ ఇచ్చారు.

తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత న్యాయపరంగా తనకు రావాల్సిన భూమిపై రామేశ్వర్ రావు పొజిషన్ తీస్కున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం న్యాయం చేస్తే దానిని తట్టుకోలేని టీడీపీ ఇప్పుడు అనవసర రాద్ధాంతం చేస్తుంది. గత కిరణ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మైహోంకు భూమి ఇవ్వాలని ఆందోళన చేసిన టీడీపీ, ఇప్పుడు అదే సంస్థకు భూమి ఎందుకు ఇచ్చారని నానా యాగీ చేస్తుంది. ఈ విషయంపై టీడీపీ నేతల్లోనే తీవ్ర ఆందోళన మొదలయ్యింది. అప్పుడలా, ఇప్పుడిలా ఆందోళన చేయడం వల్ల తెలంగాణలో టీడీపీ నామరూపాలు లేకుండా పోతుందని తెలంగాణ టీడీపీ సీనియర్ నేత ఒకరు అభిప్రాయం వ్యక్తం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *