ఒకపక్క తెలంగాణ ఆవిర్భావ వేడుకలు అంగరంగవైభవంగా జరుగుతుంటే, మరోవైపు నిరసన కార్యక్రమాలు చేపట్టాలని మహాజన సోషలిస్టు పార్టీ అధ్యక్షుడు మందక్రిష్ణ పిలుపునివ్వడంపై ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు భాస్కర్, ప్రధాన కార్యదర్శి మేడి పాపయ్య, ఎంఎఫ్ఎస్ రాష్ట్ర కో- ఆర్డినేటర్ వంగపల్లి శ్రీనివాస్ మండిపడ్డారు. తెలంగాణకు అసలైన ద్రోహి మందక్రిష్ణ అని, మతతత్వ పార్టీతో ఎలా చేతులు కలిపారని ప్రశ్నించారు.
ఇన్నేళ్ళ పోరాటం తర్వాత స్వయం పాలన రానున్న తరుణంలో మందక్రిష్ణ వ్యవహరిస్తున్న తీరు విమర్శలకు దారితీస్తుందని, ఎంఎస్ఎఫ్ పార్టీ తరపున ఆయన ఒక్కరే పోటీలో నిలిచి ఇతరులను ఎందుకు పోటీ నుండి తప్పించారని విమర్శించారు. ఎన్నికల పోస్టర్లలో మీ పక్కన ఉన్న చంద్రబాబు, ఎర్రబెల్లి, కిషన్ రెడ్డి దొరలుగా కనిపించలేదా? అని, కేసీఆర్ ఒక్కరే దొరలాగా కనిపిస్తున్నారా? అని మండిపడ్డారు.
చంద్రబాబుతో మందక్రిష్ణకు ఉన్న ఒప్పందం, సంబంధం ప్రజలకు అర్ధమైందని, సీమాంధ్రలో కూడా బీసీని సీఎం గా ప్రకటించకుంటే టీడీపీ కి మద్దతు తెలుపనంటూ మీడియాలో ప్రకటించిన నువ్వు మాటమీద నిలబడకుండా ఇతరులను ప్రశ్నించడం సరికాదని అన్నారు. పార్టీ అధినేత రియాజ్ కు టీడీపీ, బీజేపీ ఎందుకు మద్దతు తెలపలేదని మందక్రిష్ణపై విమర్శలు చేశారు. ఈ సమావేశంలో ఎమ్మార్పీఎస్ నాయకులు సురేందర్, శ్రీనివాస్, జీవ మాదిగ, కనకరాజు తదితరులు పాల్గొన్నారు.