మహాజన సోషలిస్టు పార్టీ అధ్యక్షుడు మందక్రిష్ణ మాదిగ వైఖరికి నిరసనగా ఇటీవల ఆ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి మహ్మద్ రియాజ్ పార్టీ పదవికి, ప్రాధమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఆయనతో పాటు మహబూబాబాద్ ఎమ్మెల్యే అభ్యర్థి శంకర్ నాయక్ కూడా రాజీనామా చేశారు. రోజురోజుకీ మందక్రిష్ణ మాదిగపై నిరసనసెగలు ఎక్కువవుతున్నాయి. వీరే కాకుండా గతంలో ఎంఎస్ఎఫ్ రాష్ట్ర కోఆర్డినేటర్ వంగపల్లి శ్రీనివాస్ సహా మరికొందరు పార్టీకి రాజీనామా చేశారు. తాజాగా నిన్న ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీలోని న్యూ సెమినార్ హాలులో నిర్వహించిన మీడియా సమావేశంలో పలువురు ఎమ్మార్పీఎస్ నేతలు మందక్రిష్ణపై విరుచుకుపడ్డారు.
అంబేద్కర్ సిద్దాంతమైన చిన్న రాష్ట్రాలకు వ్యతిరేకంగా పనిచేసిన చంద్రబాబుకు మందక్రిష్ణ ఎలా మద్దతు ఇచ్చారని, కేసీఆర్ తెలంగాణ దొరైతే, ఆంధ్రాలో చంద్రబాబుది ఏ కులమో స్పష్టం చేయాలని మందకృష్ణను ఎమ్మార్పీఎస్ నేతలు డిమాండ్ చేశారు. వివాహవేడుకకు కేసీఆర్ హాజరైతే వంగపల్లి శ్రీనివాస్ ఇరవై కోట్లు తీసుకున్నాడని శ్రీనివాస్ పై తప్పుడు ప్రచారం చేసిన మందక్రిష్ణ ఎన్ని కోట్లు సంపాదించారో చెప్పాలని, మహాజన సోషలిస్టు పార్టీని బలోపేతం చేయడానికి ఎమ్మార్పీఎస్ ను బలిపీఠం ఎక్కించారని, మాదిగ జాతి ఆత్మగౌరవం నిలిపేందుకు తాము పోరాడుతామని వారు స్పష్టం చేశారు.
మందక్రిష్ణ తోనే మాదిగల అభివృద్ధి జరుగుతుందని భావించి ఆయనకోసం జైలుకు కూడా వెళ్లామని, కానీ పరిస్థితుల్లో ఏమాత్రం మార్పు లేదని అన్నారు. తెలంగాణలో మాదికలు అధికంగా ఉండటంతో మందక్రిష్ణ నాయకత్వంలో వారి పక్షాన పోరాడేందుకు కుదరదని దండు సురేందర్ అన్నారు. రాష్ట్ర విభజన జరగడంతో ప్రాంతాల వారీగా పోరాటం చేయాల్సిన అవసరముందని మరొకనేత అన్నారు. ఈ సమావేశంలో పలువురు ఎమ్మార్పీఎస్ నేతలు పాల్గొన్నారు.