ఎంఆర్ఎఫ్ సీఎండీ కేఎం మమెన్, సీనియర్ జనరల్ మేనేజర్ ఐజాక్ తంబురాజ్ తదితరులు ఈరోజు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావును సచివాలయంలో కలిశారు. మెదక్ జిల్లా సదాశివపేట మండలం అంకంపల్లి గ్రామంలో ప్రస్తుతం ఉన్న ఎంఆర్ఎఫ్ ఫ్యాక్టరీని విస్తరించనున్నట్లు కంపెనీ ప్రతినిధులు సీఎంకు తెలిపారు. ఫ్యాక్టరీ విస్తరణ విషయంలో ప్రభుత్వం అన్నివిధాలా సహకరిస్తుందని కేసీఆర్ వారికి హామీ ఇచ్చారు.
ప్రస్తుతం ఉన్న ఫ్యాక్టరీ 1990 నుండి నడుస్తున్నదని, రూ. 4,300 కోట్ల టర్నోవర్ తో 6,500 మందికి ఉద్యోగ అవకాశం కల్పిస్తున్నదని, దీనికి అనుబంధంగా మరో రూ. 980 కోట్ల పెట్టుబడితో ఫ్యాక్టరీని విస్తరిస్తామని, దీనివల్ల అదనంగా మరో 905 మందికి ఉద్యోగ అవకాశం లభిస్తుందని కంపెనీ ప్రతినిధులు సీఎంకు వివరించారు. తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ కోత లేకుండా చేసినందుకు వారు ముఖ్యమంత్రిని ఈ సందర్భంగా అభినందించారు.
అనంతరం సీఎం మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో పరిశ్రమలకు ఎలాంటి కోత లేకుండా విద్యుత్ సరఫరాను, వినియోగానికి తగ్గట్టు నీటిని సరఫరా చేస్తామని, విద్యుత్ కొరత లేకుండా తీసుకుంటున్న చర్యలు మంచి ఫలితాలనిచ్చాయని, భవిష్యత్ లో కూడా తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ కోతలు ఉండవని సీఎం వారికి చెప్పారు. అంతేకాకుండా తెలంగాణ డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్ట్ పూర్తయితే రాష్ట్రంలోని అన్ని పరిశ్రమలకు కావాల్సినంత నీరు అందుతుందని, దేశంలోనే అత్యుత్తమ పారిశ్రామిక విధానం తెలంగాణ రాష్ట్రంలో తీసుకువస్తున్నామని కేసీఆర్ పేర్కొన్నారు. ఈ సమావేశంలో పరిశ్రమల శాఖ కార్యదర్శి అరవింద్ కుమార్, ఆర్ధికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ప్రదీప్ చంద్ర తదితరులు పాల్గొన్నారు.