mt_logo

“ప్రధాన మంత్రి కౌశల్ వికాస్ యోజన” పథకాన్ని రాష్ట్రంలో ప్రారంభించిన ఎంపీ కవిత

– తెలంగాణలో నూతన పారిశ్రమల వల్ల రానున్న ఉద్యోగావకాశాలు మన యువతకు అందాలి:
పనినేర్పడంతో పాటు వారిని యజమానులుగా మార్చాలి.

– ఇప్పటికే వివిధ వృత్తుల్లో ఉన్న వారికి మరింత మెలుకువలు నేర్పడం, మార్కెట్ సృష్టించడం ద్వారా వారిని ఆదుకోవాలి.

– ప్రతిష్టాత్మక “ప్రధాన మంత్రి కౌశల్ వికాస్ యోజన” పథకాన్ని రాష్ట్రంలో ప్రారంభించిన ఎంపీ కల్వకుంట్ల కవిత.

కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన “ప్రధాన మంత్రి కౌశల్ వికాస్ యోజన” (PMKVY) పథకాన్ని రాష్ట్ర స్థాయిలో నిజామాబాద్ ఎంపీ శ్రీమతి కల్వకుంట్ల కవిత నేడు లాంచనంగా ప్రారంభించారు. హైదరాబాదులోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ది కేంద్రం లో నేటి సాయంత్రం జరిగిన ఈ కార్యక్రమానికి శ్రీమతి కవిత ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ కార్యక్రమంలో శ్రీమతి కవిత మాట్లాడుతూ రానున్న కాలంలో మన దేశ యువత ప్రపంచంలోనే నిర్ణయాత్మక శక్తిగా ఉంటుందన్నారు. ఐతే మనం వారికి వివిధ రంగాలలో పని మెళుకువలు నేర్పి వారిని సంసిద్ధులుగా తయారు చేయాలన్నారు. ఈ పథకంద్వారా ఈ సంవత్సరం 14 లక్షల మందికి 45 రంగాలలో శిక్షన ఇప్పించడం వల్లనే మనం చైనా ను మించిన శక్తిగా మారగలమన్నారు. రానున్నవి ఎక్కువ వరకు ప్రయివేటు ఉద్యోగావకాశాలే కాబట్టి మన యువతను వివిధ వృత్తుల్లో శిక్షణ ఇప్పించాల్సిన అవసరం ఉందన్నారు. నైపుణ్యత నేర్పడంతో పాటు వారికి కుటీర, మధ్యతరహా పరిశ్రమల్ని ఏర్పాటు చేసుకోడానికి అవసరమైన లోన్లు, గ్రాంటులు ఇవ్వల్సిన అవసరం ఉందన్నారు. మన యువకులకు ఉపాధి అవకాశాలను కల్పించడం కోసం కేంద్ర ప్రభుత్వం తలపెట్టే ప్రతి పథకానికి తెలంగాణ ప్రభుత్వం చేయూత నందిస్తుందన్నారు. పార్టీలకతీతంగా తెలంగాణ పునర్నిర్మాణం జరగాల్సి ఉందన్నారు ఎంపీ కవిత.

ఇదే కాక ఇటీవలే గల్ఫ్ కార్మికుల కోసం వివిధ దేశాల్లో లేబర్ క్యాంపులకు వెళ్లి అక్కడి కార్మికుల సమస్యలు అడిగి తెలుసుకున్నా అన్నారు. ఈ క్రమంలో అక్కడి ప్రభుత్వ అధికారులతో, అక్కడి భారత రాయబార కార్యాలయ అధికారులతో, తెలంగాణ సంఘాలతో మాట్లాడితే అనేక విషయాలు తెలిసాయన్నారు. లేబర్ వీసాపై వెళ్లిన వారు కేవలం 7000 రూపాయల భారత కరెన్సీ కోసం కూడా అక్కడ మని చేస్తున్నారన్నారు. ఇంక దాంట్లో ఏం తింటారు, ఇంటికి ఏం పంపుతారని అవేదన వ్యక్తం చేసారు. కాబట్టి అటువంటి వారు కూడా ఏదో ఒక రంగం లో నైపుణ్యత సాధించి పనికి వెళ్లడం ద్వారా ఆదాయం పెరుగుతుందన్నారు. ముందు ముందు ఏదో ఒక రంగం లో నైపుణ్యత లేకుండ కేవలం లేబర్ వీసాపై గల్ఫ్ దేశాలకు వెళ్లడానికి ప్రభుత్వం అనుమతించకూడదన్నారు. ఫిలిప్పీన్స్ దేశం లాగానే భారత దేశం కూడా మన శ్రామికులకు కనీస వేతనాన్ని నిర్ణయించి అది లభిస్తేనే విదేశాలకు వెళ్లేందుకు అనుమతించాలన్నారు.

మరో వైపు తెలంగాణ ప్రభుత్వం నూతన కంపెనీలకోసం ప్రవేశపెట్టిన టీఎస్ ఐపాస్ ద్వారా కూడా ఇప్పటికే కొన్ని కొత్త కంపెనీలు నిర్మాణం ప్రారంభమయిందని, మరెన్నో కంపెనీలు తెలంగాణ ప్రభుత్వంతో ఎంవోయూ చేసుకుంటున్నాయని తెలిపారు. రానున్న ఈ అవకాశాల్ని వాడుకునేందుకు కూడా తెలంగాణ యువత సిద్ధంగా ఉండాలన్నారు. వివిధ పారిశ్రామిక ఉద్యోగావకాశాలను వాడుకునేందుకు నైపుణ్యత సాధించలన్నారు. వివిధ కులవృత్తులకు ఆదరణ లేక ఉపాధి కోల్పోతున్నందున ఈ పథకంలో యువత తో పాటు వారికి కూడా శిక్షణ ఇప్పించి, దానికి సరైన మార్కెట్ చూపించాల్సిన అవసరం ఉందన్నారు. దీనికోసం వారికి వయోపరిమితి సడలించాల్సిన అవసరం ఉందన్నారు.

యువత ఉపాధి అవకాశాలను మెరుగు పర్చడానికి అటు పారిశ్రామికవేత్తలతో ఇటు వృత్తి పనుల్లో నైపుణ్యత నేర్పే శిక్షణ సంస్థలు, ప్రభుత్వ అధికారులతో సమావేశం ఏర్పరిచేందుకు తాను కృషి చేస్తున్నానన్నారు శ్రీమతి కవిత.

ఈ కార్యక్రమంలో National Skill Development Mission జాయింట్ డైరెక్టర్ శ్రీ ఆశిష్ శ్రీవాత్సవ, ప్లాన్ ఇండియా (దక్షిణ భారత ) అధికారి డా. విజయ భవాని, రాజా సురెశ్ కుమార్, కార్యక్రమ నిర్వాహకులు ప్రాజెక్టు తెలంగాణ శిక్షణా భాగస్వామి శ్రీ సునిల్ ముసులూరి, శిక్షణా నిపుణులు ప్రశాంత్ వెలుదండి తదితరులు పాల్ఘొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *