నిజామాబాద్ ఎంపీ కవిత చౌపాల్ ఆన్ ట్విట్టర్ కార్యక్రమంలో పాల్గొని పలువురు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. ప్రధాని మోడీ గ్రాఫ్ రోజురోజుకూ దిగజారుతుందని, అన్ని రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు తమ సత్తా చాటుతున్నాయని ఆమె చెప్పారు. ఎంపీ నిధులు ఏడాదికి కనీసం రూ. 25 కోట్లు ఉండాలని, విభజన సమస్యలు మొదలుకుని రాష్ట్రానికి కేటాయించే నిధుల వరకు మోడీ తెలంగాణపై వివక్ష కనపరిచారని అన్నారు. మోడీ ప్రభుత్వానికి పూర్తి మెజారిటీ ఉన్నా మహిళలకు 33 శాతం రిజర్వేషన్ల చట్టం ఆమోదించలేదని కవిత పేర్కొన్నారు.
నిజామాబాద్ లో అభివృద్ధి పనులు జరుగుతున్నందున ప్రజలకు కొంత అసౌకర్యం కలిగిందని, రాబోయే రోజుల్లో నిజామాబాద్ లో మంచినీటి సమస్య, డ్రైనేజీ సమస్య ఉండవన్నారు. పసుపు బోర్డు కోసం పోరాటం కొనసాగుతుందని హామీ ఇచ్చారు. రాహుల్ గ్రాఫ్ లో ఎలాంటి పెరుగుదల లేదని, దేశ రాజకీయాల్లో ఫెడరల్ ఫ్రంట్ కీలక పాత్ర పోషిస్తుందని, రాబోయే రోజుల్లో వైసీపీ తో పాటు ఇతర పార్టీలను కలుస్తామని ఎంపీ కవిత స్పష్టం చేశారు.