అమెరికాలోని మిన్నియాపోలిస్ నగరంలో తెలంగాణ రాష్ట్ర సమితి అమెరికా విభాగం (NRI TRS – USA) ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరిగాయి.
ఉదయం 9:00 గంటలకు విమానాశ్రయం వద్ద కవిత గారికి స్థానిక నాయకులు, అభిమానులు ఘనస్వాగతం పలికారు. అనంతరం రెండు గంటల పాటు రెండు వందలకు పైగా కార్ల ర్యాలీతో ఊరేగింపుగా కవిత గారు నాథ్ ఆడిటోరియంకు చేరుకున్నారు. దారి పొడవునా గులాబీ జెండాల రెపరెపలతో, అభిమానుల హర్షధ్వానాలతో ర్యాలీ జాతరలా సాగింది. స్థానిక పోలీస్ సిబ్బంది భద్రతను పర్యవేక్షించారు. హెలికాప్టర్ ద్వారా గులాబీపూల వర్షంతో కవిత గారికి స్వాగతం పలికారు. తెరాస అమెరికా శాఖ ఆవిర్భావం సంధర్భంగా వేద పండితులు కవిత గారికి పూర్ణకుంభ స్వాగతం పలికి హిందూ టెంపుల్ ఆఫ్ మిన్నెసోటాలో ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీర్వదించారు. అనంతరం కవిత గారు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంబించారు. ఆ తరువాత రెండు నిమిషాల పాటు మౌనం పాటించి అమరులకు నివాళులు అర్పించారు.
భారీగా హాజరైన సభికులను ఉద్దేశించి కల్వకుంట్ల కవిత గారు ప్రసంగించారు. ప్రభుత్వం చేస్తున్న మిషన్ కాకతీయ, వాటర్ గ్రిడ్, ఆసరా, కళ్యాణలక్ష్మి లాంటి అభివృద్ధి మరియు సంక్షేమ పథకాలను NRI TRS – USA ద్వారా విస్తృత ప్రచారం కల్పించాలని అన్నారు. అమెరికాలోని అన్ని తెలంగాణ సంఘాలతో సమన్వయంగా కలిసి పనిచేయాలని పార్టీ శ్రేణులకు సూచించారు. ఆ తరువాత కవిత గారు గులాబీ కండువా కప్పి పలువురు ఎన్.ఆర్.ఐలను తెరాస అమెరికా శాఖలోకి ఆహ్వానించారు. చేరినవారిలో నాగేందర్ మహీపతి, మహేష్ తన్నీరు, బిందు రెడ్డి, రాజేష్ మాదిరెడ్డి, వెంగళ్ జలగం, విజయ్ బొమ్మెన, నరసింహ నాగులవంచ, అరవింద్ తక్కళ్ళపల్లి, చందు తాళ్ల, నవీన్ కానుగంటి, శ్రీనివాస్ దొంతినేని, సక్రు నాయక్, నిరంజన్ అల్లంనేని, రాజ్ గౌలికర్, దివాకర్ రావు, గోపాల్ జనగామ ఉన్నారు.
స్థానిక నాయకులు నాగేందర్ మహీపతి గారు సభకు అధ్యక్షత వహించారు. నాగేందర్ గారు మాట్లాడుతూ అమెరికా శాఖ రాష్ట్ర పార్టీకి, ప్రవాస తెలంగాణ సమాజానికి ఒక వారధిగా పనిచేస్తుందని అన్నారు. సభలో మిషన్ కాకతీయ గూర్చి వివరిస్తూ లఘు చిత్రాలను ప్రదర్శించారు. ఎన్.ఆర్.ఐలు మిషన్ కాకతీయ ఒక బృహత్తర పథకమని, ప్రతి గ్రామాన్ని ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధి చేయడానికి ఎంతగానో దోహదపడుతుందని కొనియాడారు. మిషన్ కాకతీయ కార్యక్రమానికి తమ వంతు సహాయం చేస్తామని పలువురు ఎన్.ఆర్.ఐలు పేర్కొన్నారు.
భారీ సంఖ్యలో తెలంగాణ ఎన్.ఆర్.ఐలు పాల్గొన్న ఈ కార్యక్రమంలో మహిళలు తీసుకువచ్చిన బతుకమ్మలు, బోనాలు, కళాకారుల సాంస్కృతిక ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకున్నాయి. గాయకుడు జనార్ధన్ పన్నెల పాడిన పాటలు అందరినీ అలరించాయి. కేసీఆర్ గారి నిలువెత్తు కట్ అవుట్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సభ విజయవంతం కావటంతో తెరాస శ్రేణులు ఆనందం వ్యక్తం చేస్తూ భారీ ఎత్తున బాణాసంచా పేల్చి విజయోత్సవాలు జరుపుకున్నారు. జై తెలంగాణా, జై టీ.ఆర్.ఎస్ అంటూ చేసిన నినాదాలు మిన్నంటాయి.
సభ నిర్వహణకు స్థానిక నాయకులు భవాని రామ్, నర్సిరెడ్డి, జ్ఞానేశ్వర్ కాచం, కాపిడి రౌధర్ రెడ్డి, కమలాకర్ కంజమ్, రామ్ చేపూరి, మాటా నాయకులు రమేష్ రవ్వ, సుధాకర్ జాప, రమేష్ కొమాకుల, రవి సాగి, తేనా నాయకులు శ్రీనివాస్ రెడ్డి కొంపెల్లి విశిష్ట కృషి చేశారు.