mt_logo

అక్రమ ప్రాజెక్టులతో తెలంగాణకు నీళ్ళు రాకుండా అడ్డుకుంటున్నారు!

కర్ణాటక లోని గిరిజాపూర్ లో నిర్మిస్తున్న ప్రాజెక్టును పరిశీలించేందుకు మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎంపీ జితేందర్ రెడ్డి, మరో ముగ్గురు వెళ్ళగా వీరిని తెలంగాణ, కర్ణాటక సరిహద్దుల్లో రాయచూరులోని శక్తినగర్ వద్ద పోలీసులు అడ్డుకున్న విషయం తెలిసిందే. అయితే మంత్రి జూపల్లి కృష్ణారావు కర్ణాటక అధికారులతో ఫోన్ లో మాట్లాడిన అనంతరం ప్రాజెక్టు పరిశీలనకు వారికి అనుమతి లభించింది. ఈ సందర్భంగా ఎంపీ జితేందర్ రెడ్డి మాట్లాడుతూ, కృష్ణా నదిపై కర్ణాటక ప్రభుత్వం అక్రమ ప్రాజెక్టులు కడుతున్నట్లు తాము గుర్తించామన్నారు. గిరిజాపూర్ తో పాటు భీమానగర్, గూగల్ దగ్గర అక్రమ ప్రాజెక్టులు నిర్మిస్తున్నట్లు, అక్రమ ప్రాజెక్టులతో తెలంగాణకు నీళ్ళు రాకుండా అడ్డుకోవాలని ప్రయత్నిస్తున్నట్లు ఎంపీ తెలిపారు. కర్ణాటకలో నిర్మిస్తున్న అక్రమ ప్రాజెక్టుపై తెలంగాణ ప్రాజెక్టుల సీఈ ప్రభుత్వానికి నివేదిక ఇచ్చిందని, ఎంపీలంతా కలిసి కేంద్రమంత్రి ఉమాభారతిని కలిసి పరిస్థితిని వివరిస్తామని చెప్పారు.

కర్ణాటకలోని అక్రమ ప్రాజెక్టును ఆంధ్రాకు చెందిన కాంట్రాక్టరే నిర్మిస్తున్నాడని, బీజేపీ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి పనులు నిలిపివేయకుండా టీడీపీ నేతలు చోద్యం చూస్తున్నారని జితేందర్ రెడ్డి విమర్శించారు. కర్ణాటకలో నిర్మిస్తున్న అక్రమ ప్రాజెక్టుతో పాటు ఏపీ ప్రభుత్వం నిర్మిస్తున్న పోలవరం పై కూడా కేంద్రానికి ఫిర్యాదు చేస్తామన్నారు. కర్ణాటకలో నిర్మిస్తున్న ఈ అక్రమ ప్రాజెక్టుపై ఇప్పటికే సుప్రీంకోర్టులో బ్రిజేష్ ట్రిబ్యునల్ పై కేసు వేశామని తెలిపారు. గిరిజాపూర్ ప్రాజెక్టుతో తెలంగాణకు ఎంత నష్టం జరుగుతుందో నిర్ధారిస్తామని జితేందర్ రెడ్డి పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *