mt_logo

గడువు పెంచితే ఉద్యమమే- ప్రొఫెసర్ కోదండరాం

గురువారం రంగారెడ్డి జిల్లా తాండూరులో నిర్వహించిన సంపూర్ణ తెలంగాణ సాధన సభలో టీజేఏసీ చైర్మన్ కోదండరాం పాల్గొన్నారు. కార్యక్రమంలో మొదట ప్రొఫెసర్ జయశంకర్ సార్ ఫొటోకి పూలమాలలు వేసి నివాళులర్పించారు. విద్యావంతుల వేదిక డైరీ, క్యాలెండర్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలంగాణ బిల్లుపై చర్చించేందుకు అసెంబ్లీలో గడువు పెంచితే ఊరుకోమని, అవసరమైతే మళ్ళీ ఉద్యమిస్తామని హెచ్చరించారు. జనవరి  23 కల్లా చర్చను తప్పనిసరిగా ముగించి కేంద్రానికి తెలంగాణ బిల్లు పంపాల్సిందేనని, ఒకవేళ తాత్సారం చేస్తే టీజేఏసీ తగిన సమాధానం చెబుతుందని అన్నారు. వేయిమందికిపైగా తెలంగాణ కోసం అమరులైతే కేంద్రం ఎవరినడిగి తెలంగాణ ఇస్తుందని టీఎన్జీవో అధ్యక్షుడు అశోక్ బాబు అడగడం అతడి మూర్ఖత్వమని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్, టీడీపీ, వైసీపీ పార్టీలన్నీ తెలంగాణకు అనుకూలంగా వ్యవహరించాయని, అఖిలపక్ష భేటీ తర్వాతే కేంద్రం తెలంగాణపై నిర్ణయం తీసుకుందని కోదండరాం గుర్తు చేశారు. ఉమ్మడి రాజధానిని ఐదేళ్ళకే ఉండేలా, హైదరాబాద్ పై గవర్నర్ కు అధికారం ఉండొద్దని రాష్ట్రపతికి విజ్ఞప్తి చేశామని చెప్పారు. ఈ కార్యక్రమంలో చేవెళ్ళ పార్లమెంటు నియోజకవర్గ టీఆర్ఎస్ ఇన్చార్జి కొండా విశ్వేశ్వర్ రెడ్డి, ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి, విద్యావంతుల వేదిక రాష్ట్ర కార్యదర్శి ఆర్. విజయకుమార్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *