mt_logo

మరో మూడు కలెక్టరేట్లు ప్రారంభించనున్న సీఎం కేసిఆర్

రాష్ట్రంలో మరో 3 కలెక్టరేట్ల ప్రారంభానికి ముహూర్తం ఖరారైంది. ఈ నెల 12న మహబూబాబాద్‌, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టరేట్‌, జిల్లా అధికారుల సమీకృత భవన సముదాయాన్ని (ఐడీవోసీ), 18న ఖమ్మం జిల్లా కలెక్టర్‌ కార్యాలయాన్ని ముఖ్యమంత్రి కేసిఆర్ ప్రారంభించనున్నారు. 12న ఉదయం మహబూబాబాద్‌ కలెక్టరేట్‌ను, మధ్యాహ్నం భద్రాద్రి కొత్తగూడెం కలెక్టరేట్‌ను ప్రారంభిస్తారు. ప్రభుత్వ సేవలన్నీ సింగిల్‌ విండో పద్ధతిలో ఒకేచోట అందుబాటులో ఉండేలా ఈ సమీకృత కలెక్టరేట్లు నిర్మించారు.

కాగా రాష్ట్రంలో 29 జిల్లాల్లో రూ.1,581.62 కోట్ల వ్యయంతో జిల్లా అధికారుల సమీకృత భవన సముదాయాలు, మరో రూ.206.44 కోట్లతో 24 జిల్లాల్లో కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, డీఆర్వోలు, ఇతర జిల్లా స్థాయి అధికారుల నివాస క్వార్టర్లను నిర్మిస్తున్నారు. సిద్దిపేట, కామారెడ్డి, హనుమకొండ, రాజన్న సిరిసిల్ల, జనగామ, యాదాద్రి భువనగిరి, వనపర్తి, మేడ్చల్‌ మల్కాజిగిరి, రంగారెడ్డి, పెద్దపల్లి, నిజామాబాద్‌, మహబూబ్‌నగర్‌, జగిత్యాల, వికారాబాద్‌ జిల్లాల్లో కలెక్టరేట్లను సీఎం ప్రారంభించారు. తాజాగా మహబూబాబాద్‌, భద్రాద్రి, ఖమ్మం జిల్లాల కలెక్టరేట్లు ప్రారంభానికి సిద్ధమయ్యాయి.

నెల రోజుల్లో మరిన్ని కలెక్టరేట్లు సిద్ధం :
నిర్మల్‌, గద్వాల, కుమ్రంభీం ఆసిఫాబాద్‌, నాగర్‌కర్నూల్‌, సూర్యాపేట, మంచిర్యాల, జయశంకర్‌ భూపాలపల్లి, మెదక్‌, కరీంనగర్‌ తదితర జిల్లాల్లో కలెక్టరేట్ల నిర్మాణం తుదిదశకు చేరాయి. నెల రోజుల్లో ఇవి ప్రారంభానికి సిద్ధమవుతాయని అధికారులు తెలిపారు. ములుగు, నారాయణపేట జిల్లాల్లో కలెక్టరేట్ల నిర్మాణం ఇటీవలే ప్రారంభమైంది. ఆదిలాబాద్‌ జిల్లా కలెక్టరేట్‌ భవన నిర్మాణం టెండర్ల దశలో ఉన్నది. వరంగల్‌లో ఇంకా స్థలాన్ని ఖరారు చేయాల్సి ఉన్నది. హైదరాబాద్‌, సంగారెడ్డి, నల్లగొండ జిల్లాల్లో ఇదివరకే కలెక్టరేట్‌ భవనాలు ఉన్నాయి.

వివిధ పనుల నిమిత్తం జిల్లా కేంద్రాలకు వచ్చే ప్రజలకు సౌకర్యవంతంగా ఉండేందుకు అన్ని శాఖల కార్యాలయాలు ఒకేచోట ఉండేలా కలెక్టరేట్లలో తగిన ఏర్పాట్లు చేశారు. దీంతో ప్రజలు అటూ, ఇటూ వెళ్లనవసరం పనిలేకుండా అన్ని పనులను ఒకేచోట పూర్తిచేసుకునేందుకు వీలవుతుంది. ఒక్కో కలెక్టరేట్‌ నిర్మాణానికి రూ.50-60 కోట్ల వరకు వెచ్చిస్తున్నారు. పచ్చటి ప్రాంగణాలు, సాధ్యమైనంత తక్కువ విద్యుత్తు వినియోగంతో ఆ భవన సముదాయాలన్నీ పర్యావరణహితంగా ఉండేలా, గాలి, వెలుతురు ధారాళంగా వచ్చేలా చర్యలు చేపట్టారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *