mt_logo

ఈచ్ వన్ అడాప్ట్ వన్ కు విశేష స్పందన!

తెలంగాణ రాష్ట్రంలో ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను ఆదుకునేందుకు తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఇటీవల సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో జరిగిన సమీక్ష సమావేశంలో ఈచ్ వన్ అడాప్ట్ వన్ అనే కార్యక్రమాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. నవంబర్ ఒకటవ తేదీనుండి ఈ కార్యక్రమం ప్రారంభం కానుంది. రైతు కుటుంబాలని దత్తత తీసుకోవాలంటూ ఎంపీ కవిత ఇచ్చిన పిలుపుకు తెలంగాణ జాగృతికి చెందిన వివిధ శాఖలే కాకుండా క్రీడారంగానికి చెందిన ప్రముఖుల నుండి కూడా ఈ కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తుంది.

తెలంగాణ జాగృతికి చెందిన వివిధ శాఖలు 80 కుటుంబాల్ని దత్తత తీసుకునేందుకు ముందుకు వచ్చాయి. ఒక్కో రైతు కుటుంబానికి ఏడాది పాటు ప్రతి నెలా రూ. 5వేల చొప్పున ఇచ్చేందుకు తమ సంసిద్ధత వ్యక్తం చేశాయి. ఇదిలాఉండగా జాగృతి పిలుపుతో రైతు కుటుంబాలను దత్తత తీసుకునేందుకు క్రీడా ప్రముఖులు ప్రజ్ఞాన్ ఓజా, గుత్తా జ్వాల, సానియా మీర్జా తరపున ఆమె తల్లి నసీం మీర్జాలు ముందుకొచ్చారు. వీరితో కలిసి ఎంపీ కవిత తెలంగాణ భవన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ రైతు కుటుంబాలను ఆదుకునేందుకు సినీ, క్రీడా, ఇతర రంగాలకు చెందిన ప్రముఖులు ముందుకొస్తున్నారని, ఆర్ధికసాయం అందించేందుకు నవంబర్ ఒకటవ తేదీని నిర్ణయించామని తెలిపారు.

రైతు కుటుంబాలను ఆర్ధికంగా ఆదుకోవడంతో పాటు ఇకముందు ఆత్మహత్యలు జరగకుండా చూడాలన్నదే జాగృతి లక్ష్యమని, ఎప్పటికప్పుడు రైతుల్లో ఆత్మస్థైర్యాన్ని నింపడం, వారికి అండగా నిలవడం, వ్యవసాయ రంగంలో చేపడుతున్న ఆధునిక విధానాలపై అవగాహన కల్పించడం వంటి కార్యక్రమాలు చేపడతామని కవిత చెప్పారు. మొత్తం కాకపోయినా స్వచ్చంద సంస్థలు కొంతమేర ఆదుకునేందుకు వీలుందని, జాగృతికి మొత్తం 1.20 లక్షలమందికి పైగా కార్యకర్తలు ఉన్నారని, వారి సహకారంతో క్షేత్రస్థాయి పరిశీలన చేసి రైతు కుటుంబాలను ఎంపిక చేస్తామని అన్నారు.

60 ఏళ్ల సమైక్య పాలనలో గత పాలకులు తెలంగాణ రైతాంగానికి చేసిందేమీ లేదని, రైతులే తమ ఖర్చుతో బోర్లు వేసుకుని నష్టాలు భరిస్తూ వస్తున్నారని, వారి బతుకుల్లో వెలుగు నింపాలని తెలంగాణ ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నదని కవిత తెలిపారు. మొన్న జరిగిన క్యాబినెట్ మీటింగ్ లో ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు ఇచ్చే పరిహారాన్ని రూ. 6 లక్షలకు పెంచేందుకు నిర్ణయం తీసుకున్నారని, ఇదే కాకుండా ప్రజల పక్షాన కూడా చనిపోయిన రైతులకు సహకారం లభించాలని ఆమె పేర్కొన్నారు. ఈ సందర్భంగా టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా తరపున ఆమె తల్లి నసీం మీర్జా రూ. 3 లక్షలు, ప్రజ్ఞాన్ ఓజా రూ. 2 లక్షలు, బాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాల రూ. లక్ష ఆర్ధికసాయాన్ని చెక్కుల రూపంలో ఎంపీ కవితకు అందజేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *