ఓటుకు నోటు కుంభకోణం టీడీపీ నేతలను రోజురోజుకీ మరింతగా వణికిస్తోంది. నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్ వాంగ్మూలాన్ని ఏసీబీ అధికారులు మరో రెండు రోజుల్లో సేకరించనున్న నేపథ్యంలో బాస్ బండారం బయటపడనుందని సమాచారం. స్టీఫెన్ సన్ వాంగ్మూలం, ఫోరెన్సిక్ నివేదికల గండం నుండి ఎలా బయటపడాలో తెలియక టీడీపీ నేతలకు కంటిమీద కునుకులేకుండా ఆదుర్దా చెందుతున్నారు. గతనెల 28వ తేదీన నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్ ఏసీబీకి చేసిన ఫిర్యాదు మేరకు ఏసీబీ అధికారులు ఎమ్మెల్సీ సీటు కోసం రూ. 50 లక్షలు అడ్వాన్స్ గా ఇస్తున్న రేవంత్ రెడ్డి అండ్ టీమ్ ను మే 31న రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఆ తర్వాత స్టీఫెన్ సన్ తో చంద్రబాబు మాట్లాడిన టెలిఫోన్ సంభాషణలు బయటకు లీక్ అవ్వడంతో ఫిర్యాదుదారుడి సెల్ ఫోన్ కొచ్చిన కాల్ ను రికార్డు చేసిన విషయాన్ని పక్కనపెట్టి ఏపీ సీఎం ఫోన్ ను ట్యాపింగ్ చేస్తున్నారంటూ పచ్చ పార్టీ నేతలు కేసును పక్కదారి పట్టించే ప్రయత్నం తెలిసిందే.
ఇదిలాఉండగా చంద్రబాబు హైదరాబాద్ లోని తన నివాసంలో ఏపీ డీజీపీ రాముడు, ఇంటలిజెన్స్ చీఫ్ అనురాధతో ప్రత్యేకంగా సమావేశమై ఈ అంశానికి సంబంధించి మంతనాలు జరుపుతున్నారు. ఈ వ్యవహారం నుండి ఎలా తప్పించుకోవచ్చనే విషయంపై పోలీసు అధికారులతో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. మరోవైపు గవర్నర్ సలహాదారులు ఏపీవీఎన్ శర్మ, ఏకే మహంతి ఆదివారం చంద్రబాబుతో రెండుగంటలపాటు సమావేశమయ్యారు. ఫోన్ ట్యాపింగ్, రాష్ట్ర విభజన చట్టంలోని సెక్షన్ 8 తదితర అంశాలపై చర్చ జరిగిందని తెలిసింది. ఈ సమావేశం జరుగుతున్న సమయంలోనే ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ వేదికగా టీడీపీ నేతలు గవర్నర్ నరసింహన్ పై విమర్శనాస్త్రాలు సంధించారు. ఈ అంశానికి సంబంధించి గవర్నర్ కు ఫిర్యాదు చేసినా ఇందుకు ఆధారాలు లేవని గవర్నర్ చెప్పడంతో, తెలంగాణ ప్రభుత్వానికి పక్షపాతిగా గవర్నర్ వ్యవహరిస్తున్నారని, ఏపీకి అసలు గవర్నర్ అవసరం లేదని, రాజ్ భవన్ అవసరం లేదని పార్టీ పోలిట్ బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తన అసహనాన్ని వెళ్లగక్కారు.