శాసనసభలో శుక్రవారం ద్రవ్య వినిమయ బిల్లుకు వివిధ పార్టీల సభ్యులనుండి ఏకగ్రీవ ఆమోదం లభించింది. రూ. 100 కోట్ల 643 లక్షల అంచనాలతో ప్రవేశపెట్టిన బిల్లుకు శాసనసభ, శాసనమండలి ఏకగ్రీవంగా ఆమోదం తెలిపాయి. బిల్లును ఆర్ధికమంత్రి ఈటెల రాజేందర్ సభలో ప్రవేశపెట్టగానే బిల్లుపై చర్చించిన అన్ని పార్టీలు సంపూర్ణ మద్దతు తెలిపాయి. తమ సభ్యుడు రేవంత్ రెడ్డి మాట్లాడేందుకు అవకాశం ఇవ్వలేదంటూ టీడీపీ సభనుండి వాకౌట్ చేసింది. మొదట బిల్లుపై కాంగ్రెస్ పార్టీ ఓటింగ్ కోరినప్పటికీ సీఎం చేసిన సూచనతో విప్ ను ఉపసంహరించుకుని బిల్లుకు పూర్తి మద్దతు ప్రకటించింది. అనంతరం బిల్లుకు పూర్తిగా సహకరించిన పార్టీలకు సీఎం కేసీఆర్ కృతజ్ఞతలు తెలిపారు.
అంతకుముందు సీఎం కేసీఆర్ మాట్లాడుతూ, ప్రభుత్వం చేపట్టబోయే ప్రాజెక్టులు, వాటి కేటాయింపులు, అందులో ఉన్న సమస్యలు, వాటిని అధిగమించేందుకు చేస్తున్న కృషిని వివరించారు. తెలంగాణ సమాజం అంతా మనవైపు చూస్తుందని, కొత్త రాష్ట్రంలో గౌరవం వచ్చే దిశగా మాట్లాడుకుని సహనంతో, సమన్వయంతో ముందుకు పోదాం అని అన్నారు. రాష్ట్రం ఏర్పడిన ఈ ఆరు నెలల్లో ప్రభుత్వానికి రూ. 25, 947 కోట్ల ఆదాయం వచ్చిందని, ఇందులో రాష్ట్ర సొంత పన్ను కింద రూ. 15, 101.97 కోట్లు, రాష్ట్ర సొంత ఆదాయం కింద రూ. 1247 కోట్లు, కేంద్ర పన్నుల ఆదాయం కింద రూ. 3969 కోట్లు, గ్రాంట్ ఇన్ ఎయిడ్ కింద రూ. 2541 కోట్లు, అప్పుల ద్వారా రూ. 2800 కోట్లు, ఇతర ఆదాయాల ద్వారా రూ. 288 కోట్లు ఆదాయం వచ్చినట్లు సీఎం పేర్కొన్నారు.
ఫీజు రీయింబర్స్ మెంట్ కింద నాలుగేళ్ళుగా రూ.1500 కోట్లు పెండింగ్ ఉన్నాయని, కోర్టు కేసులు, విద్యార్థుల ఆందోళనలు చూసి మనమే చెల్లిద్దామని చెప్పానని, తొలి విడతలో రూ. 500 కోట్లు ఇచ్చామని గుర్తు చేశారు. ఎర్రజొన్న రైతులు బకాయిలు చెల్లించాలని కోరితే గత పాలకులు కాల్పులు జరిపారని, వారికి కూడా మేమే ఇస్తామని చెప్పి రూ. 11 కోట్లు ఇచ్చామన్నారు. ఇన్ పుట్ సబ్సిడీ కింద రైతులకు రూ. 480 కోట్లు ఇచ్చామని, మొత్తం రూ. 1600 కోట్లు బకాయిలు ఇచ్చామని చెప్పారు.రుణమాఫీ కింద రూ. 17 వేల కోట్లకు పైగా రద్దు చేశామని, మొదటి విడతగా బ్యాంకులకు రూ. 4250 కోట్లు విడుదల చేసి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నామని, మిగిలిన రూ. 12000 కోట్లు మూడు విడతల్లో ఇస్తామని చెప్పామన్నారు.
పేదలకు సర్కారు అండగా ఉంటుందని, వాటర్ గ్రిడ్ ద్వారా నాలుగేళ్ళలో ప్రతి ఇంటికీ నల్లా కనెక్షన్ ఇస్తామని, అలా చేయకపోతే వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ ఓట్లు అడగదని సీఎం చెప్పారు. . కాకతీయ రెడ్డి రాజులు ఆనాడే వాటర్ షెడ్ లు నిర్మించి ప్రపంచానికి మార్గదర్శకం చేశారని, ఈరోజు చెరువుల పునరుద్ధరణకు మిషన్ కాకతీయ అని పేరు పెట్టుకున్నామని అన్నారు. రంజాన్, క్రిస్మస్ పండుగలకు రెండు రోజులు సెలవులు ఇస్తున్నట్లు తెలపగానే మజ్లిస్ నేతలు బక్రీద్ కూడా ఉందని గుర్తు చేయగానే సీఎం స్పందిస్తూ బక్రీద్ కు కూడా రెండు రోజుల సెలవు ప్రకటించారు. ముఖ్యమంత్రి ప్రకటన పట్ల ఎంఐఎం పక్షనేత అసదుద్దీన్ ఓవైసీ హర్షం వ్యక్తం చేశారు. గతంలో ఎన్నడూ ఆస్పత్రులకు విడివిడిగా నిధులు కేటాయించలేదని, తాము అన్ని దవాఖానలకు భారీగా నిధులు కేటాయించామని సీఎం కేసీఆర్ వివరించారు.