చెరువుల పునరుద్ధరణ కార్యక్రమంతో ప్రభుత్వ ప్రతిష్ఠ పెరిగేలా ఇంజినీర్లు కృషి చేయాలని, ఎలాంటి అవకతవకలు జరగకుండా చూడాలని భారీ నీటిపారుదల శాఖామంత్రి హరీష్ రావు అధికారులను ఆదేశించారు. కొత్తగా నియమించబడ్డ ఎస్ఈలు, ఈఈలతో మంగళవారం జలసౌధలో మంత్రి మిషన్ కాకతీయ పథకంపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, చెరువుల పునరుద్ధరణ కార్యక్రమాన్ని ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుందని, ఇంజినీర్లు అందరూ సమిష్టిగా శక్తివంచన లేకుండా పనిచేయాలని సూచించారు.
ఎస్ఈలు, ఈఈలు ప్రతిరోజూ ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గంలో పర్యటించి పనులను పర్యవేక్షించాలని, ప్రభుత్వానికి నివేదికలు ఎప్పటికప్పుడు పంపించాలన్నారు. ఫీడర్ ఛానల్స్ లో ఆక్రమణలను తొలగించే విషయంలో, చెరువు పూడిక తీసే విషయంలో పట్టాదారుల నుండి ఎదురయ్యే సమస్యలను కలెక్టర్లకు, అర్డీవోలకు, ఎమ్మార్వోలకు వివరించి వారి సహాయం తీసుకోవాలని హరీష్ చెప్పారు. తాను ప్రతీ వారం జిల్లా పర్యటనలు చేపడతానని, డిసెంబర్ 4న మహబూబ్ నగర్, 5న నిజామాబాద్, 10న మెదక్, 11న వరంగల్ జిల్లాల్లో పర్యటించి జిల్లా పరిషత్ సమావేశాల్లో సమీక్షలు నిర్వహించి చెరువుల పునరుద్ధరణపై అవగాహన కలిగించే ప్రయత్నం చేస్తానని మంత్రి తెలిపారు.
చెరువుల పునరుద్ధరణ పనులను పర్యవేక్షించడానికి స్థానిక జిల్లా చీఫ్ ఇంజినీర్లకు ఈ సమావేశంలో బాధ్యతలు అప్పగించారు. ఆదిలాబాద్ కు శంకర్, కరీంనగర్ కు అనిల్ కుమార్, నిజామాబాద్ కు మధుసూదన రావు, మెదక్ కు కృష్ణారావు, రంగారెడ్డికి నాగేందర్, హైదరాబాద్ కు శ్రీదేవి, ఖమ్మంకు శంకర్ నాయక్, వరంగల్ కు విజయ్ ప్రకాష్, నల్లగొండకు పురుషోత్తమ రాజు, మహబూబ్ నగర్ కు ఖగేందర్ ను ఇన్చార్జిలుగా నియమించారు. ఈ అధికారులంతా వారానికి కనీసం 10 చెరువులనైనా సందర్శించి పనుల ప్రణాళికను, పురోగతిని పర్యవేక్షించాల్సి ఉంటుంది.