రాష్ట్ర పంచాయితీ రాజ్, ఐటీ శాఖామంత్రి కేటీఆర్, అటవీశాఖ మంత్రి జోగురామన్నలు కరీంనగర్ జిల్లాలో పర్యటిస్తున్నారు. నేటినుండి రెండురోజులపాటు జరిగే జడ్పీ సర్వసభ్య సమావేశాల్లో మంత్రులు పాల్గొననున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం పథకం, పుష్కర పనులపై జిల్లా కలెక్టరేట్ లో ఈరోజు అధికారులతో సమీక్షాసమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ ప్రజాప్రతినిధులు, అధికారులు కలిసి టీం వర్క్ గా పనిచేస్తే విజయం సాధించవచ్చని అన్నారు. ఏ కార్యక్రమం చేపట్టినా కరీంనగర్ జిల్లా నుండే చేపడ్తున్నామని, ఈ జిల్లాలో చేపట్టిన ప్రతి కార్యక్రమం విజయవంతమైందని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ మానస పుత్రిక ఈ హరిత హారం పథకమని, ఇందుకోసం అందరూ సమిష్టి కృషి చేయాలని మంత్రి పిలుపునిచ్చారు.
మరోవైపు నగరంలోని మెహదీపట్నం రైతు బజారులో ఏర్పాటుచేసిన ‘మన కూరగాయలు’ దుకాణాలను మంత్రులు హరీష్ రావు, పోచారం శ్రీనివాస్ రెడ్డిలు ప్రారంభించారు. గుడిమల్కాపూర్ లోని వ్యవసాయ మార్కెట్లను కూడా మంత్రులు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ త్వరలో రాష్ట్రవ్యాప్తంగా మరో 25 రైతు బజార్లను ప్రారంభిస్తామని, హైదరాబాద్ ప్రజలకు తక్కువ ధరలకే కూరగాయలు అందించే ఉద్దేశంతో ఈ పథకాన్ని ప్రారంభించామని చెప్పారు. రూ. 21కే కిలో ఉల్లిగడ్డలు, రూ. 24కే కిలో టమాటాలను అందిస్తున్నామని, మెహదీపట్నంతో పాటు నగరంలోని అన్ని రైతు బజార్లను ఆధునీకరిస్తామని హామీ ఇచ్చారు.