mt_logo

కులవృత్తులకు కేరాఫ్ అడ్రస్ టీఆర్ఎస్: తలసాని

పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి శాఖా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పాలకుర్తి నియోజకవర్గం పరిధిలోని రాయపర్తి మండలం మైలారం రిజర్వాయర్ లో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుతో కలిసి ఈరోజు చేపపిల్లలను వదిలారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మైలారం రిజర్వాయర్ లో ఉచిత చేపపిల్లల పంపిణీ కార్యక్రమానికి రావడం ఎంతో ఆనందంగా ఉందని అన్నారు. గత పాలకుల నిర్లక్ష్యంతోనే కుల వృత్తులు మరుగున పడ్డాయని, ఎటువంటి అభివృద్ధికి నోచుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. సీఏం కేసీఆర్ పాలనలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే నంబర్ వన్ రాష్ట్రంగా ముందుకు వెళ్తుందని, కుల వృత్తులకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నదని అన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం మత్స్య కార్మికులకు ఉచితంగా కోట్ల రూపాయలు అందించి చేపపిల్లలను అందిస్తున్నదని, మత్స్య కార్మికుల కోసం రూ. 900 కోట్లు వెచ్చించి సబ్సిడీపై వాహనాలు, ఇతర వస్తువులు అందించామని, రాబోయే రోజుల్లో కేసీఆర్ గారి నేతృత్వంలో ఫుడ్ ప్రాసెసింగ్ ద్వారా మరింత అభివృద్ధి కోసం కృషి చేస్తామని తెలిపారు.

అంతకుముందు మంత్రి తలసాని మైలారం గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేసిన పశు ఆరోగ్య శిబిరాన్ని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎంపీలు బండా ప్రకాష్, పసునూరి దయాకర్, కలెక్టర్ హరితతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ రైతులను ఆదుకోవడం కోసం పాడి పరిశ్రమ అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతున్నదన్నారు. పశువులకు గడ్డి, దాణా కొరత లేకుండా చర్యలు చేపడుతున్నామని, వాక్సిన్ విషయంలో కూడా ముందు జాగ్రత్త చర్యలు టీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకుంటున్నదని స్పష్టం చేశారు. అనంతరం మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ జాతీయ కృత్రిమ గర్భదారణ దినోత్సవం సందర్భంగా పాలకుర్తి నియోజకవర్గంలోని రాయపర్తిలో పశు వైద్య శిబిరాన్ని ప్రారంభించడం ఆనందంగా ఉందని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *