భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం పడమటి నర్సాపురంలో రూ.5.03కోట్లతో 80 డబుల్ బెడ్ రూం ఇళ్ళు, దుబ్బతండా గ్రామంలో రూ.2.26 కోట్లతో 45 డబుల్ బెడ్ రూం ఇళ్ళు, రామచంద్రపురం గ్రామంలో రూ.3.27 కోట్లతో 65 డబుల్ బెడ్ రూం ఇళ్ళు, ఎలకలఒడ్డు గ్రామంలో రూ.1.76కోట్లుతో 35 డబుల్ బెడ్ రూం ఇళ్ళు మొత్తం రూ. 12.32 కోట్లతో నూతనంగా నిర్మించిన 225 ఇళ్ళను ఎమ్మెల్యే రాములు నాయక్ తో కలిసి మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ప్రారంభించి లబ్ధిదారులకు అందజేశారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. పేదలు ఆత్మగౌరవంతో జీవించాలన్నది ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆలోచన అని, అందుకే భారీ వ్యయంతో కూడుకున్నప్పటికీ రెండు పడకగదుల ఇళ్ల నిర్మాణంకు శ్రీకారం చుట్టారని అన్నారు. పేదలకు కేటాయించిన ఇండ్లు ఒక్కొక్కటి 15 లక్షల విలువైనవవి తెలిపారు. ఇండ్ల కేటాయింపు పూర్తి పారదర్శకంగా చేపట్టామన్నారు. ప్రజల సమక్షంలో నిజమైన నిరుపేదలను లబ్దిదారులుగా ఎంపిక చేశామని మంత్రి తెలిపారు. ఎస్సీలు, బీసీలు, ఎస్టీలు, ముస్లిం మైనారిటీలకు ఇండ్లు కేటాయించామన్నారు.
జిల్లాలో ఇప్పటివరకు 500కు పైగా రెండు పడక గదుల ఇండ్లను నిరుపేదలకు అందజేశామన్నారు. కేటాయింపులో నిరుపేదలకు అధిక ప్రాధాన్యం ఇచ్చామని, ఒక్క రూపాయి లంచం లేకుండా గృహ ప్రవేశాలు చేయించామని వివరించారు. అధిక వ్యయం అయినప్పటికీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పేదల సంక్షేమం, వారి ఆత్మగౌరవం కాపాడేందుకు రెండు పడక గదుల ఇళ్లను కేటాయించిందని, వాటిని సద్వినియోగం చేసుకుని పేద ప్రజలు అన్ని విధాలుగా అభివృద్ధి సాధించాలని సూచించారు. తమ కాళ్ళ మీద తాము నిలబడి ఆత్మగౌరవంతో బ్రతకాలని, స్థానిక ప్రజాప్రతినిధులు, ప్రజల సమిష్టి కృషి వల్లే నేడు పేదలకు ఇళ్ళు కేటాయించుకోగలిగామని చెప్పారు.
కోవిడ్ అనివార్య పరిస్థితుల వల్ల ఇళ్లను అందజేయడం కొంత ఆలస్యం అయినప్పటికీ, డబుల్ బెడ్ రూం ఇండ్లను ప్రారంభించడం సంతోషంగా ఉందని, లబ్ధిదారులతో కలిసి గృహప్రవేశం చేయడం, పాలు పొంగించడం పట్ల ఆనందంగా ఉందన్నారు. నిర్మాణాలు పూర్తి అయిన వాటికి లబ్ధిదారులను ఎంపిక చేసి అందజేస్తామని, నిర్మాణంలో ఉన్న మిగతా గ్రామాల్లో ఇండ్లను కూడా త్వరితగతిన పూర్తి చేసి ప్రారంభిస్తామన్నారు. సీఎం కేసిఆర్ గారి లక్ష్యాలకు అనుగుణంగా లబ్ధిదారులకు అందజేస్తామని హామీ ఇచ్చారు.
అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతి కోసం ప్రభుత్వం పని చేస్తుందని, ప్రజలు కూడా పని చేసే ప్రభుత్వాలకు అండగా నిలవాలి కోరారు. కోవిడ్ కష్టకాలంలో ప్రజలకు ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకున్నామని అన్నారు. రైతులు పండించిన ధాన్యంను పూర్తిగా కొనుగోలు చేసి రైతులకు వారి ఖాతాలో నగదును జమ చేశామన్నారు. రాష్ట్రంలో అన్ని రంగాల ప్రజలకు అన్ని అందుబాటులో ఉంచామని, వ్యవసాయం కోసం విత్తనాలు, ఎరువులు, సాగునీరు ఉంచామన్నారు. సంక్షేమ పథకాలు ఆగకుండా నిధులు విడుదల చేస్తూ గ్రామాల అభివృద్ధికి అన్ని విధాలుగా పూర్తి సహకారం అందించామని పేర్కొన్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా కరోనా కట్టడికి ప్రభుత్వం అన్ని చర్యలు చేపట్టిందన్నారు. ఇది మన సమస్య మాత్రమే కాదని ప్రపంచ వ్యాప్తంగా ఎదుర్కొంటున్న సమస్యగా వివరించారు. ప్రతి ఒక్కరు వ్యక్తిగత దూరం, మాస్కులు, శ్యానిటైజర్లు వాడుతూ జాగ్రత్తగా ఉండాలని మంత్రి కోరారు.