మహబూబ్ నగర్ జిల్లా జడ్చెర్ల సమీపంలోని నాగసాల గ్రామ శివారులో రూ. 5,953 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న ఎల్లూరు సెగ్మెంట్ వాటర్ గ్రిడ్ పథకానికి బుధవారం రాష్ట్ర ఐటీ, పంచాయితీ రాజ్ శాఖామంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేసి పైలాన్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, మూడేళ్ళలో వాటర్ గ్రిడ్ పథకాన్ని పూర్తిచేసి ప్రజలకు నల్లాల ద్వారా నీళ్లిచ్చాకే ఎన్నికల్లో నిలబడి ప్రజలను ఓట్లు అడుగుతామని అన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం పాలనకు, పథకాలకు ప్రజలు పూర్తిస్థాయిలో సహకరిస్తారన్న పూర్తి విశ్వాసంతోనే ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు భీష్మ ప్రతిజ్ఞ చేశారని కేటీఆర్ పేర్కొన్నారు.
దేశచరిత్రలో ఏ ముఖ్యమంత్రీ చేయనివిధంగా ఒకవైపు అభివృద్ధి, మరోవైపు సంక్షేమ కార్యక్రమాలతో సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర సమగ్రాభివృద్ధి కోసం అంకితభావంతో పని చేస్తున్నారని, వాటర్ గ్రిడ్ అంటే మామూలు పథకం కాదని, రూ. 6,773 కోట్ల అంచనా వ్యయంతో 60 ఏళ్ల వరకు 3,737 గ్రామాల పరిధిలో 85లక్షల కుటుంబాలకు రక్షిత మంచినీరు అందించే భగీరథ ప్రయత్నమని చెప్పారు. వచ్చే ఎండాకాలంలోగా రైతులకు పగటిపూటే 9 గంటల విద్యుత్ ను నిరంతరాయంగా సరఫరా చేస్తామని హామీ ఇచ్చారు. వాటర్ గ్రిడ్, పాలమూరు ఎత్తిపోతల పథకాలతో రాష్ట్ర అభివృద్ధికోసం తమ ప్రభుత్వం కృషి చేస్తుంటే ఏపీ సీఎం చంద్రబాబు సీడబ్ల్యూసీకి లేఖలు రాస్తూ అడ్డుపడుతున్నాడని, వాటర్ గ్రిడ్ పథకాన్ని సైతం అడ్డుకునే ప్రయత్నం చేస్తూ బాబు కుట్రలు చేస్తున్నాడని మండిపడ్డారు.
అధికారంలో ఉండగా ఏనాడూ ప్రజలను పట్టించుకోని కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం అధికార విరహవేదనతో, కడుపుమంటతో రగిలిపోతూ రోడ్లపైకి వచ్చి ధర్నాలు చేయడం వింతగా ఉందన్నారు. మొన్నటిదాకా అధికారంలో ఉండి ఏమీ చేయని కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు డ్రామా కంపెనీ పెడితే ప్రజలు ఎలా నమ్ముతారని ప్రశ్నించారు. తమ ప్రభుత్వం ప్రజలకు జవాబుదారీగా ఉంటుంది తప్ప పనిలేని ప్రతిపక్షాలకు కాదని కేటీఆర్ స్పష్టం చేశారు. అనంతరం మంత్రి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వాల నిర్వాకం వల్లే ప్రస్తుతం రైతుల ఆత్మహత్యల పరంపర కొనసాగుతుందని విమర్శించారు. 60 ఏళ్లుగా తెలంగాణను నాశనం చేసిన గత పాలకులకు టీఆర్ఎస్ 15 నెలల పాలనను విమర్శించే నైతిక హక్కు లేదని మండిపడ్డారు. ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ పాలనను పొరుగు రాష్ట్రాల సీఎంలు సైతం ప్రశంసిస్తుంటే తమ జెండా దిమ్మెలు కదులుతున్నాయనే ప్రతిపక్షాలు అసత్య ఆరోపణలకు దిగుతున్నాయని విమర్శించారు.