ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమంలో భాగంగా పది నియోజకవర్గాలకు గాను అంబులెన్స్ లను మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుతో కలిసి ప్రారంభించారు. వర్ధన్నపేట-2, పాలకుర్తి-2, పరకాల-1, ములుగు-1, భూపాలపల్లి-1, జనగామ-1, వరంగల్ ఈస్ట్-1, వరంగల్ వెస్ట్-1 చొప్పున పది అంబులెన్సులను బుధవారం ప్రారంభించారు. అంబులెన్సులు అందజేసిన ఎమ్మెల్యేలను మంత్రులు కేటీఆర్, ఎర్రబెల్లి దయాకర్ రావు అభినందించారు.
ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖామంత్రి శ్రీ కేటీఆర్ చేపట్టిన ‘గిఫ్ట్ ఏ స్మైల్’ కు విశేష స్పందన లభిస్తోంది. ఇటీవల తన జన్మదినం సందర్భంగా ఎవరూకూడా బహుమతులు, బొకేలు తేవొద్దని, పేదవారి ముఖంలో చిరునవ్వులు చూడాలన్నదే తన అభిమతమని పేర్కొన్న విషయం తెలిసిందే. కేటీఆర్ పిలుపుకు స్పందించిన పలువురు ప్రజాప్రతినిధులు కరోనా మహమ్మారి వల్ల ప్రజలు ఇబ్బంది పడకుండా ఉండేందుకు అంబులెన్సుల కొనుగోలుకోసం చెక్కుల రూపంలో ఆర్ధికసాయం అందిస్తున్నారు.
తాజాగా మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు ఆర్ధికసాయం అందించేందుకు ముందుకొచ్చారు. నడిపెల్లి ఛారిటబుల్ ట్రస్ట్ ఛైర్మన్ నడిపెల్లి విజిత్ కుమార్ తో కలిసి అంబులెన్స్ కొనుగోలు కోసం రూ. 20.50 లక్షల చెక్కును హైదారాబాద్ లో మంత్రి కేటీఆర్ కు అందజేశారు. కరోనా కష్టకాలంలో ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ చేసిన సహాయాన్ని మంత్రి కేటీఆర్ అభినందించారు.