హైదరాబాద్ లోని నెక్లెస్ రోడ్ లో గల థ్రిల్ సిటీలో నేడు జరిగిన ఐటీ పరిశ్రమల ప్రతినిధుల సమావేశానికి మంత్రి కేటీఆర్ హాజరయ్యారు. తెలంగాణ ఐటీ రంగంలో ఇన్నోవేషన్ ఏకో సిస్టమ్ వరల్డ్ క్లాస్ మాదిరిగా అభివృద్ధి చేశామని పేర్కొన్నారు. పెట్టుబడులకు హైదరాబాద్ అంత్యంత అనుకూలం ఉంది కాబట్టే ప్రపంచ ప్రఖ్యాత సంస్థలు ఇక్కడికి క్యూ కడుతున్నాయని అన్నారు. ఉద్యోగ కల్పనలో బెంగుళూర్ నగరాన్ని దాటామని, ఒక ఐటీ రంగలోనే లక్షలాది ఉద్యోగాలు కల్పించామని మంత్రి కేటీఆర్ తెలియ జేశారు.
అలాగే ఐటీ రంగాన్ని నగర ఉత్తరం వైపు కూడా విస్తరిస్తున్నామని మంత్రి కేటీఆర్ ప్రకటించారు. కాగా తొలి రెండు స్పేస్ టెక్ స్టార్టప్ లు హైదరాబాద్ కు చెందినవేనని ఈ సందర్భంగా గుర్తు చేశారు. అతి త్వరలో తెలంగాణలో టీఫైబర్ నెట్ ద్వారా ఇంటర్నెట్ అందిస్తామని తెలియజేశారు.
ఈ సందర్భంగా హైసియా ప్రెసిడెంట్ మనీషా మాట్లాడుతూ… ఐటీ పరిశ్రమకు మంత్రిగా కేటీఆర్ ఉండటం వల్లే హైదరాబాద్ లో ఐటీ పరిశ్రమ శరవేగంగా అభివృద్ది చెందుతోందని అన్నారు. అహర్నిశలు కష్టపడే కేటీఆర్ లాంటి వ్యక్తి ఐటీ ఇండస్ట్రీ మంత్రిగా ఉండటం గర్వకారణం అన్నారు.
ఐటీ పరిశ్రమల ప్రిన్సిపల్ సెక్రెటరీ జయేశ్ రంజన్ మాట్లాడుతూ… గత రెండేళ్లలోనే ఐటీ రంగంలో 40 వేల కొత్త ఉద్యోగాలు కల్పించామని పేర్కొన్నారు. కరోనా వంటి విపత్కర సమయంలో రాష్ట్రానికి ఐటీ ఇండస్ట్రీ అందించిన సహకారం మరవలేనిది అన్నారు.