నల్గొండ జిల్లా సూర్యాపేటలో శుక్రవారం రాత్రి రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి జీ జగదీశ్ రెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ప్రతిపక్షాలపై నిప్పులు చెరిగారు. తెలంగాణ ఉద్యమంలో టీఆర్ఎస్ ను అడుగడుగునా అవహేళన చేసి రాష్ట్ర ఏర్పాటును అడ్డుకోవడానికి కుటిల యత్నాలు చేస్తూ సీమాంధ్ర పెట్టుబడిదారులకు తాబేదార్లుగా ఉన్న కాంగ్రెస్, టీడీపీలతో పాటు ఇతర ప్రతిపక్ష పార్టీలు మళ్ళీ కుట్రలకు తెరలేపుతున్నాయని అన్నారు. రైతుల పేరుతో మొసలి కన్నీరు కారుస్తూ మొసళ్ళ రూపంలో బంద్ పేరుతో రాబందులు వస్తున్నాయని, తస్మాత్ జాగ్రత్త అని జగదీశ్ రెడ్డి హెచ్చరించారు.
కాంగ్రెస్, టీడీపీల పాలనలో రైతాంగాన్ని నట్టేట ముంచి వారి ఆత్మహత్యలకు ప్రధాన కారకులయ్యారని, హత్య చేసినవాడే శవాన్ని మోస్తున్నాడని, నాడు గంటపాటు విద్యుత్ సరఫరా చేయని దద్దమ్మలకు టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని విమర్శించే హక్కు లేదని జగదీశ్ రెడ్డి స్పష్టం చేశారు. ఏపీ సీఎం చంద్రబాబు తెలంగాణపై చేస్తున్న కుట్రలను ప్రశ్నించే దమ్ములేని ప్రతిపపక్షాలు అభివృద్ధి పథంలో ఉన్న తెలంగాణ ప్రభుత్వాన్ని విమర్శించడం అతి నీచమని, తెలంగాణ ప్రభుత్వానికి వ్యతిరేకంగా, ప్రజల అభ్యున్నతికి వ్యతిరేకంగా ప్రతిపక్షాలు బంద్ కు పిలుపునిస్తున్నాయని, ఇది వారి దివాళాకోరుతనానికి నిదర్శనమన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పరిపాలనా దక్షత, ప్రజా సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధిని చూసి ఆయా పార్టీలనుండి టీఆర్ఎస్ లోకి వస్తున్న వలసలను అడ్డుకోవడానికి చేస్తున్న చివరి ప్రయత్నమే రైతుల ఆత్మహత్యల పేరుతో ఇస్తున్న బంద్ పిలుపు అని జగదీశ్ రెడ్డి తెలిపారు.