mt_logo

మేడిపల్లిలో రైతు బజారును ప్రారంభించిన మంత్రి హరీష్

రంగారెడ్డి జిల్లా ఘట్ కేసర్ మండలంలోని మేడిపల్లిలో రెండు ఎకరాల విస్తీర్ణంలో రూ. 56 లక్షల వ్యయంతో నిర్మించిన రైతు బజారును మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కార్యదర్శి టీ శివరామకృష్ణ, పలువురు టీఆర్ఎస్ నేతలతో పాటు రైతులు భారీ ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ రైతు బజార్ల వల్ల రైతులకు ఎంతో మేలు కలుగుతుందని, రైతు బజార్లలో రైతులకు గిట్టుబాటు ధర, వినియోగదారులకు నాణ్యమైన కూరగాయలు అందుతాయని అన్నారు. లక్ష జనాభాకు ఒక రైతు బజారు అవసరమని, శామీర్ పేట, ఘట్ కేసర్, కీసరలో 5వేల మెట్రిక్ టన్నుల సామర్ధ్యం గల గోడౌన్లను ఏర్పాటు చేయబోతున్నామని మంత్రి చెప్పారు.

మేడిపల్లి రైతు బజారులో రెండు రోజుల్లో హోల్ సేల్ ధరలకే టమాట, ఉల్లిగడ్డ అందిస్తామని హరీష్ హామీ ఇచ్చారు. చెరువులను కబ్జా చేయకుండా చట్టం తీసుకొస్తున్నామని, చెరువుల్లోకి మురికి నీరు చేరకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. మేడిపల్లి రైతు బజారుతో పాటు ఘట్ కేసర్ లో మహిళా సంక్షేమ గృహాన్ని కూడా మంత్రి ప్రారంభించారు. దీపం పథకం కింద అర్హులైన ప్రతి ఒక్కరికీ గ్యాస్ సిలిండర్లు అందిస్తామని, అర్హులైన ప్రతి మహిళా గ్రూపుకు త్వరలోనే రూ. 10 లక్షల వడ్డీ లేని రుణాలు, వడ్డీ లేని రుణాలతో సంబంధం లేకుండా స్త్రీ నిధి కింద రూ. 80 వేల రూపాయల రుణం అందజేస్తామని హరీష్ రావు తెలిపారు. ఈ ఏడాది హరితహారం కింద 40 కోట్ల చెట్లను నాటుతున్నామని, ప్రజలందరూ విధిగా మనిషికో మొక్క నాటాలని హరీష్ రావు పిలుపునిచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *