ఆర్ధికమంత్రి ఈటెల రాజేందర్ నేడు వరంగల్ జిల్లాలోని నర్సంపేట నియోజకవర్గంలో లక్షమొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మహబూబాబాద్ ఎంపీ ప్రొ. సీతారాం నాయక్, టీఆర్ఎస్ నేత పెద్ది సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి ఈటెల ప్రజలకు 10 రకాల పండ్ల మొక్కలను పంపిణీ చేశారు. పదేళ్ళు అనంతరం ఈటెల మాట్లాడుతూ, అధికారంలో ఉండి రాష్ట్రంలో ఒక్క ప్రాజెక్టు కూడా కట్టకుండా ఇప్పుడు మాట్లాడుతున్న పార్టీలు ఆత్మవిమర్శ చేసుకోవాలని సూచించారు. గత ప్రభుత్వాలు కాంట్రాక్టర్లకు మేలు కలిగేలా వ్యవహరించాయని, తెలంగాణ రాష్ట్రంలో గత 50 ఏళ్లుగా పాలకుల అనాలోచిత నిర్ణయాల వల్ల ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తికాలేదని, తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టులను పూర్తిచేసి ఇంటింటికి మంచినీళ్ళు అందిస్తామని స్పష్టం చేశారు.
రైతు ఆత్మహత్యలనేవి దేశ సమస్య. మద్దతు ధర, అకాల వర్షాలకు పంటనష్టం, భీమా సరిగా అమలుచేయక రైతులు అప్పుల పాలయ్యారు. గత పాలకుల నిర్లక్ష్యంతో తెలంగాణ సాగునీటి ప్రాజెక్టులకు నోచుకోలేదు. ఇప్పుడు వచ్చింది తెలంగాణ రాష్ట్రం.. ప్రజల మేలుకోరే ప్రభుత్వం.. రైతులు ధైర్యంగా ఉండాలని ఈటెల రైతులకు విజ్ఞప్తి చేశారు. బోర్లు వేసి అప్పులు పాలయ్యే బాధలనుండి విముక్తి పొందడానికే ప్రాజెక్టులు కట్టుకుంటున్నామని, రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర వచ్చేవరకు నిల్వ ఉంచుకోవటానికి గ్రామాల్లో గోదాములు నిర్మిస్తున్నామని చెప్పారు. రైతులు నిల్వ ఉంచిన పంటకు 70 శాతం రుణం మంజూరు చేస్తున్నామని, ఈ రుణానికి ఆరు నెలల వరకు వడ్డీ లేకుండా చెల్లించడం కోసం రైతు బంధం పథకం తీసుకొచ్చామని మంత్రి తెలిపారు. రైతులు ధీమాగా ఉండాలని, తెలంగాణ రైతులకు మంచిరోజులు రాబోతున్నాయని ఈటెల పేర్కొన్నారు.