mt_logo

ఐసొలేషన్ కేంద్రాన్ని సందర్శించిన మంత్రి ఈటెల

మహబూబాబాద్ ఏరియా ఆస్పత్రిలోని కోవిడ్ ఐసొలేషన్ కేంద్రాన్ని ఆరోగ్య శాఖామంత్రి ఈటెల రాజేందర్ సోమవారం సందర్శించారు. ఈటెల వెంట పంచాయితీ రాజ్ శాఖామంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎమ్మెల్యే శంకర్ నాయక్, జెడ్పీ ఛైర్మన్ బిందు తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా మంత్రి ఈటెల మాట్లాడుతూ ఐసోలేషన్ కేంద్రంలో ఉన్న వారిని పరామర్శించడం జరిగిందని, ఇక్కడున్న రోగుల్లో ఎవరూ సీరియస్ గా ఉన్నవారు లేరని, మామూలు కోవిడ్ చికిత్స పొందే వారేనని అన్నారు.

ప్రజలకు మరోసారి విజ్ఞప్తి చేస్తున్నా.. గ్రామీణ ప్రాంతాల్లో గానీ, పట్టణ ప్రాంతాల్లో గానీ ఎవరికైనా జ్వరం, తలనొప్పి, ఒళ్ళు నొప్పులు, శరీరంలో ఏదైనా తేడా రావడంలాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వెళ్ళి టెస్టులు చేయించుకోవాలి. ఒకవేళ ఎవరికైనా టెస్టులు పాజిటివ్ వస్తే ఇక్కడ ఉన్న డాక్టర్లు మీ స్థితిని బట్టి ఇక్కడే ట్రీట్మెంట్ ఇవ్వాలా? ఇంటికి పంపాలా? లేకపోతే ఇంతకన్నా మెరుగైన దవాఖానకు పంపి చికిత్స అందించాలా? అని నిర్ణయిస్తారు. ఎవ్వరూ కూడా నిర్లక్ష్యం చేయొద్దు. ఈ సీజన్ లో వచ్చే జ్వరమేలే. వస్తదిలే.. పోతదిలే.. అనుకోకుండా డాక్టర్ ను కలిసి తగిన చికిత్స చేయించుకోవాలని సూచించారు. ఒకవేళ మీ అంతట మీరే ఇళ్ళలో ఉండి వ్యాధి ముదిరాక హాస్పిటల్ కి వస్తే ప్రాణాలు దక్కించుకునే అవకాశం ఉండదని, అర్ధం చేస్కోవాలన్నారు.

ఇంతకుముందు ఉన్న కొన్ని వ్యాధుల్లాగే ఇది కూడా అని, కాకపోతే దీనికి త్వరగా స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉందని మంత్రి పేర్కొన్నారు. ప్రజలు ఎక్కువ తక్కువ గుమికూడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. దైర్యంగా దీనిని ఎదుర్కోవాలని, కుటుంబ సభ్యులు, చుట్టుపక్కల వారు కరోనా పాజిటివ్ వచ్చినవారికి అన్ని విధాలా అండగా ఉంటూ వారిలో మానసిక ధైర్యం నింపాలని ఈటెల విజ్ఞప్తి చేశారు. ప్రజలు ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్ళి డబ్బులు ఖర్చు చేయకుండా ప్రభుత్వ దవాఖానల్లో వైద్య సదుపాయం పొందాలని ఈటెల రాజేందర్ సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *