రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ చురుకుదనం, ముందుచూపు, ఆయనలోని అమోఘమైన జ్ఞానం దేశానికి, రైతాంగానికి ఎంతో ఉపయోగపడుతుందని ఎంఐఎం నేత అసదుద్దీన్ ఓవైసీ ప్రశంసించారు. ఇవ్వాళ కేంద్ర బడ్జెట్ లో కిసాన్ సమ్మాన్ నిధిని ప్రకటించిన తర్వాత ఓవైసీ తన ట్విట్టర్ లో స్పందిస్తూ వ్యవసాయ సమస్యలపై సీఎం కేసీఆర్ కు ఉన్న లోతైన అవగాహన మరో నేతకు లేదని స్పష్టం చేశారు. తెలంగాణ చేపట్టిన పథకాలనే ప్రధాని అమలు చేస్తున్నారని, ప్రధానికి సొంత ఐడియాలు లేవని, దేశాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు కేసీఆర్ లాంటి నేతలు అవసరం అని, దేశానికి దిశానిర్దేశం చేసే సత్తా కూడా కేసీఆర్ కే ఉందని అసదుద్దీన్ పేర్కొన్నారు.
ఎంతో నిరాశతో ఉన్న రైతులకు రైతు బంధు పథకం ద్వారా ప్రాణం పోసిన తెలంగాణ సీఎం శ్రీ కే చంద్రశేఖర్ రావు ఇవాళ దేశ రైతాంగానికి దిక్సూచిలా మారారు. ప్రతీ సంవత్సరం ఎకరానికి రూ. 10 వేల చొప్పున ఎన్ని ఎకరాలు ఉంటే అన్ని ఎకరాలకు తెలంగాణ సర్కార్ రైతుబంధు పథకం ద్వారా రైతుల ఖాతాల్లోకి నేరుగా జమ చేస్తుంది. అంతేకాకుండా రైతులు ఆత్మహత్య చేసుకున్నా, సహజమరణం అయినా రూ. 5 లక్షలను రైతులకు నేరుగా అందజేయడం దేశంలోనే ఎక్కడా లేదు. రైతు సంక్షేమం కోసం కేసీఆర్ చేపట్టిన రైతు బంధు పథకం ప్రపంచ దేశాలను ఆకర్షిస్తున్న విషయం తెలిసిందే. కరువును పారద్రోలేందుకు ఈ పథకం దివ్యౌషధమని ఐక్యరాజ్యసమితి ఇటీవల ప్రశంసించిన విషయం తెలిసిందే. 130 కోట్ల భారతదేశ అన్నదాతలకు ఇప్పుడు రైతు బంధు పథకం కీలకంగా మారింది.
దూరదృష్టితో సీఎం కేసీఆర్ చేపట్టిన ఈ పథకాన్ని ఇప్పుడు కేంద్రం కాపీ కొట్టింది. దేశవ్యాప్తంగా రైతులను ఆదుకునేందుకు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పేరుతో ఆర్ధికసాయాన్ని అందించనుంది. 5 ఎకరాలు ఉన్న ప్రతి రైతుకు ఏటా రూ. 6 వేలు ఆర్ధికసాయం చేయనున్నట్లు, ప్రత్యక్షంగా రైతుల బ్యాంకు ఖాతాల్లోకి రూ. 2 వేల చొప్పున మూడు వాయిదాలలో ఈ నగదు బదిలీ కానుంది. తెలంగాణ ప్రభుత్వం విజయవంతంగా అమలుచేస్తున్న రైతుబంధు పథకాన్ని మోడీ సర్కార్ కాపీ కొట్టడం చూస్తే ఆ క్రెడిట్ తప్పకుండా ముఖ్యమంత్రి కేసీఆర్ కే దక్కుతుంది.