mt_logo

మెట్రో నిర్మించి తీరుతాం – కేటీఆర్

ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా, అడ్డంకులు సృష్టించినా హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టు పూర్తిచేసి తీరుతామని, ఈ విషయంలో వెనుకడుగేసేది లేదని ఐటీ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. బుధవారం ఢిల్లీవెళ్ళిన ఆయన నలుగురు కేంద్రమంత్రులను కలిసి రాష్ట్రానికి సంబంధించిన అనేక అంశాలపై చర్చించారు. అంతకుముందు కేంద్రం నిర్వహించిన పలు రాష్ట్రాల జౌళిశాఖ మంత్రుల సమావేశంలో మంత్రి పాల్గొని ప్రసంగించారు. అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ, మెట్రో ప్రాజెక్టుపై విమర్శలు చేస్తున్న టీడీపీ నేత రేవంత్ రెడ్డి మాటల్లో నిలకడలేదని, రోజుకో తీరుగా మాట్లాడుతున్నారని, అక్రమాలపై స్పష్టమైన ఆధారాలుంటే బహిర్గతం చేయాలని మండిపడ్డారు.

మెట్రో రైల్ ప్రాజెక్టుపై కేంద్రం జారీ చేసిన గెజిట్ గురించి మాట్లాడుతూ, ఏ ప్రాజెక్ట్ కైనా ఇలాంటి గెజిట్ లు రావడం సహజమేనని, గెజిట్ వల్ల మెట్రో ప్రాజెక్టు పురోగతికి వచ్చిన ఇబ్బందేమీలేదని, ప్రాజెక్టును అనుకున్న సమయానికి పూర్తి చేసి తెలంగాణ ప్రజలకు కానుకగా ఇస్తామని చెప్పారు. 2040 సంవత్సరానికల్లా మెట్రో ప్రాజెక్టును 250 కిలోమీటర్లకు విస్తరిస్తామని, రాష్ట్రంలో త్వరలోనే భారీ స్థాయిలో ఉద్యోగాల నియామకాలు చేపడతామన్నారు. నిరుద్యోగ యువతకు భయాలు అవసరంలేదని, పబ్లిక్ సర్వీస్ కమిషన్ ను త్వరలోనే ఏర్పాటు చేస్తామని, గ్రామీణ తాగునీటి అభివృద్ధి విభాగంలో సుమారు వెయ్యి ఉద్యోగాలు భర్తీ చేస్తామని కేటీఆర్ పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *