మెదక్ ఎంపీ స్థానానికి జరగనున్న ఉపఎన్నిక సందర్భంగా సోమవారం సాయంత్రం ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు పార్టీ నేతలతో తెలంగాణ భవన్లో సమావేశమై చర్చించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ మెదక్ పార్లమెంటు ఉపఎన్నికల్లో గతంలో కంటే అత్యధిక మెజారిటీ పొందేందుకు కృషి చేయాలని, కొద్ది కాలంలోనే టీఆర్ఎస్ ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టినందున ఓటర్లు విశేషంగా ఆదరిస్తారని పేర్కొన్నారు. ఎన్నికను ఆషామాషీగా తీసుకోకుండా కష్టపడితే తప్పనిసరిగా భారీ మెజారిటీ వస్తుందన్నారు.
ఎంపీ అభ్యర్థిని ఖరారు చేసేందుకు పార్టీ శ్రేణులతో సీఎం కేసీఆర్ గంటపాటు చర్చలు జరిపారు. టీఎన్జీవో అధ్యక్షుడు దేవీప్రసాద్, మెదక్ జిల్లా పార్టీ అధ్యక్షుడు ఆర్. సత్యనారాయణ, ఎమ్మెల్సీ భూపాల్ రెడ్డి, ప్రవీణ్ రెడ్డి, సోనీ ట్రావెల్స్ యజమాని కొత్త ప్రభాకర్ రెడ్డిల పేర్లను పరిశీలించారు. సోమవారం అమావాస్య కావడంతో మంగళవారం మరోసారి సమావేశమై అభ్యర్థి పేరును ప్రకటించాలని నిర్ణయించారు. అంతేకాకుండా ఉపఎన్నిక జరిగే మెదక్ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని ఒక్కో అసెంబ్లీ సెగ్మెంట్ కు ఒక్కో మంత్రిని ఇన్చార్జిగా నియమించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారని తెలిసింది.
పటాన్ చెరు నియోజకవర్గానికి డిప్యూటీ స్పీకర్ మహమూద్ అలీ, సంగారెడ్డికి డిప్యూటీ సీఎం టీ రాజయ్య, గజ్వేల్ కు పద్మారావు, మెదక్ కు కేటీఆర్, దుబ్బాక సెగ్మెంట్ కు పోచారం శ్రీనివాస్ రెడ్డి, నర్సాపూర్ కు జోగు రామన్న ప్రాతినిధ్యం వహించనున్నారు. ఈ సమావేశానికి ఎంపీ కేకే, డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్ రెడ్డి, మంత్రులు హరీష్ రావు, ఈటెల రాజేందర్, ఎమ్మెల్యేలు బాబూమోహన్, రసమయి బాలకిషన్, శ్రీనివాస్ గౌడ్, సోలిపేట రామలింగారెడ్డి, ఎమ్మెల్సీలు కర్నె ప్రభాకర్, రాములు నాయక్, సుధాకర్ రెడ్డి తదితరులు హాజరయ్యారు.