త్వరలో ఏర్పడనున్న తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు సంబంధించి పరిపాలనా భవనాలు మే 20లోగా పూర్తిచేయాలని రోడ్లు, భవనాల శాఖ అధికారులను రాష్ట్ర గవర్నర్ నరసింహన్ ఆదేశించారు. శాసనసభ, మండలి భవనాల మరమ్మత్తులు సాధ్యమైనంత త్వరగా పూర్తయ్యేలా చూడాలని అసెంబ్లీ కార్యదర్శి రాజా సదారాం కు సూచించారు. మంగళవారం రాజ్ భవన్ లో ఆర్ అండ్ బీ, పోలీస్, మరియు ఇతర శాఖల ఉన్నతాధికారులతో సమావేశమైన గవర్నర్ ఈనెల రెండవ వారంలో కేంద్ర హోం శాఖ కార్యదర్శి హైదరాబాద్ వస్తున్నందున వివిధ అంశాలకు చెందిన సమాచారాన్ని సిద్ధంగా ఉంచాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సీఎస్ మహంతిని ఆదేశించారు.
ఇప్పటికే రెండు రాష్ట్రప్రభుత్వాల నిర్వహణకు అవసరమైన భవనాల విభజన ఆర్ అండ్ బీ పూర్తిచేసింది. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల కార్యాలయాలు, శాసనసభ, మండలి, క్యాంపు కార్యాలయాలను వేరువేరుగా కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు. భవనాలు ఎక్కువగా ఉన్నవాటిని రెండు రాష్ట్రాలకు పంచారు. అందులో భాగంగా సచివాలయంలోని ఏ, బీ, సీ, డీ బ్లాకులను తెలంగాణకు, హెచ్, జే, కే, ఎల్ బ్లాకులను ఆంధ్రప్రదేశ్ కు విభజించారు. తెలంగాణ ముఖ్యమంత్రి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ప్రోటోకాల్ విభాగం, సచివాలయ భద్రతాధికారి కోసం సీ బ్లాకును కేటాయించారు. హెచ్ సౌత్ బ్లాక్ లో ఆంధ్రప్రదేశ్ సీఎం, సీఎస్ కార్యాలయాలుంటాయి.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల కోసం వేరువేరుగా క్యాంపు కార్యాలయాలను కూడా నిర్ణయించారు. లేక్ వ్యూ అతిథి గృహాన్ని ఏపీ సీఎం కు, ఇప్పుడున్న క్యాంపు కార్యాలయం తెలంగాణ సీఎం కు కేటాయించనున్నారు. పాత అసెంబ్లీ భవనాన్ని ఏపీకి, ఇప్పుడున్న అసెంబ్లీ భవనాన్ని తెలంగాణకు, జూబ్లీ హాలులో ఏపీ శాసనమండలి, ఇప్పుడున్న శాసనమండలి భవనాన్ని తెలంగాణకు నిర్ణయించారు.