మాసాయిపేట రైల్వే ప్రమాదంలో మృతిచెందిన విద్యార్థుల కుటుంబాలకు ఏడు లక్షల చొప్పున రాష్ట్ర ప్రభుత్వం ఆదివారం నాడు చెక్కులను అందజేసింది. భారీ నీటిపారుదల శాఖ మంత్రి టీ హరీష్ రావు మృతిచెందిన 14మంది విద్యార్థుల కుటుంబాలకు వెళ్లి వారికి ఆర్ధిక సహాయం అందజేశారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున 5లక్షలు, రైల్వే శాఖ తరపున 2లక్షలు మొత్తం 7లక్షల చెక్కును ఇచ్చారు. ప్రమాదంలో మృతిచెందిన విద్యార్థుల కుటుంబాలకు మంత్రి హరీష్ రావు దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి, జిల్లా ఇంచార్జ్ కలెక్టర్ శరత్, డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్ రెడ్డి తదితరులతో కలిసివెళ్లి పరామర్శించారు.
ఈ సందర్భంగా విద్యార్థుల తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించగా మంత్రి వారిని ఓదారుస్తూ మృతుల కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని, ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు. గాయపడిన విద్యార్థులకు ప్రభుత్వం తరపున యశోదా ఆస్పత్రిలో మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నారని, వైద్య శాఖ మంత్రి టీ రాజయ్య, ఉపముఖ్యమంత్రి మహమూద్ అలీ దగ్గరుండి విద్యార్థుల ఆరోగ్యపరిస్థితిని తెలుసుకుంటున్నారని హరీష్ రావు చెప్పారు.
ప్రమాదం జరిగిన విషయం తెలియగానే సీఎం కేసీఆర్ తీవ్రంగా కలతచెంది వెంటనే ప్రమాద సంఘటనా స్థలానికి తనను, మంత్రులను పంపించారని, ఆయన ఆదేశాల మేరకు అధికారులు సహాయచర్యలు చేపట్టడంతో మిగిలిన 20మంది ప్రాణాలను కాపాడుకోగలిగామని హరీష్ రావు పేర్కొన్నారు. ప్రస్తుతం అందించిన 7లక్షల రూపాయలతో పాటు ఇన్సూరెన్స్ కంపెనీ నుండి మరో లక్ష రూపాయలను అందిస్తామని, గాయపడిన విద్యార్థులకు ప్రభుత్వం నుండి లక్ష, రైల్వే శాఖ నుండి లక్ష రూపాయల ఆర్ధికసాయం అందిస్తామని ఆయన తెలిపారు.
