mt_logo

అమరుడు కానిస్టేబుల్ కిష్టయ్య భార్య పద్మావతి అతిథి సంపాదకీయం

ఏడాది క్రితం అమరుడు పోలీసు కిష్టయ్య భార్య పద్మావతి హైదరాబాద్‌లోని రవీంద్రభారతి వేదికపై ‘బతుకమ్మ’ను ఆవిష్కరించారు. నేడు బతుకమ్మ జన్మదిన సంచిక. ఈ సందర్భంగా ఆ ‘బతుకమ్మ’ మనందరికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, తన జీవితాన్ని అతిథి సంపాదకీయంలో ఇలా ఆవిష్కరించారు…

పోలీసు కిష్టయ్యంటే డ్యూటీలో అందరికీ తెలుసు. ఆయనకు పదహారు అవార్డులు వచ్చినయి. ఎవ్వర్నీ బాధ పోవు. తనకు చేతనైన సహాయం చేసేటోడు. డ్యూటీల ఏ పని చెప్పినా సరే…ఎంత కష్టమైనా పట్టుదలగా చేసేటోడు. తెలంగాణ కోసం ప్రాణం ఇడిసిండంటెనే తెలుస్తది, ఆయన ఎంత ఆశయం గల మనిషో అని…

ఆయన చనిపోయి మూడేండ్లాయె!

ఆయనొక్కడే కాదు, ఎంతోమంది ప్రాణాలు పోయినై.

చనిపోయినోళ్లంతా పేదలే. బాధల్లనుంచి తేరుకోలేక ఆత్మహత్యలు చేసుకున్నరు. అయినాగని ఇప్పటికీ తెలంగాణ వస్తలేదు. రాజకీయ నాయకులు తలా ఓ తీరు మాట్లాడుతున్నరు. ఒకల్నొగలు తిట్టుకుంటున్నరు. రోజురోజుకీ తెలంగాణ తెస్తరన్న నమ్మకాన్ని పోగొడుతున్నరు. అయినాగని నా భర్తమీద నాకు నమ్మకం ఉన్నది. ఆయన ప్రాణాలకు తెగించి చనిపోయిండు కాబట్టి తెలంగాణ వస్తదనే అనుకుంటున్న. ఆయన ఆఖరి కోరిక తీరుతదనే నమ్ముతున్న.

మా ఆయనకు పిల్లలంటే చానా ప్రేమ. కొడుక్కి రాహుల్, బిడ్డకి ప్రియాంక అని పేర్లు పెట్టిండు. ఇప్పుడు వాళ్లిద్దరూ టెన్త్ చదువుతున్నరు. కెసీఆరే వాళ్లని గౌతం మోడల్ స్కూల్ల చేర్పించిండు. ఫ్రీగ సదివిస్తున్నడు. కవలలు కాదు. రాహుల్‌ను మొదట్ల ఇంగ్లీష్ మీడియంల వేయడంతో ఒక ఏడాది సదువు నష్టమైంది. చెల్లెలూ, వాడూ ఒక్కటే తరగతిలకు వచ్చిండ్రు.

పిల్లలిద్దరికీ మొన్న మొన్నటిదాకా తండ్రి బాగా యాదికి వచ్చేడిది. ఇప్పుడిప్పుడే చదువుల్ల నిమగ్నమై కొద్దిల కొద్దిల ఆ బాధనుంచి బయట వడుతున్నరు.

ఇంటి పెద్ద లేకపోతే ఆ బతుకులు ఎట్లుంటయో నేను వేరే జెప్పాల్నా? సూస్తున్నోళ్లకు ఎరికే! ఉన్న ఊరును, అందర్నీ వదిలి ఈడికొచ్చి బతుకుతున్న. పిల్లల్ని బతికించుకుంటున్న.

నిన్నటికి సరిగ్గ ( మే 30) మా పెళ్లయి పద్దెనిమిదేండ్లు. ఆయన్ని మరచిపోవడం నాతోటి కావడంలేదు. కన్నుమూసినా తెరిచినా ఆయన జ్ఞాపకాలె. గుండెని రాయి చేసుకుని బతుకుతున్న.

ఆయన డ్రెస్‌లు, గ్లాసెస్, డైరీలను భద్రపర్చిన. జ్ఞాపకార్థం పెట్టుకున్న.

మేం ముదిరాజ్‌లం. మా తల్లిగారిది జగిత్యాల. అత్తగారిది కామారెడ్డి దగ్గర నెరాయిపల్లి. 1 డిసెంబర్ 2009 నైట్‌ల… పావుదక్కువ రెండింటికి ఆయన ఆత్మహత్య చేసుకున్నడు. తెలంగాణ వచ్చినంక నా భార్యపిల్లలకు మేలు చేయమని సూసైడ్ లెటర్ల రాసి పోయిండు. కెసీఆర్‌కు కూడా గట్టిగ చెప్పిండు, తెలంగాణ తేవాలెనని.

ఆయన మమ్మల్ని అనాధల్ని చేసి పోయినందుకు తిట్టుకుంటున్ననా అంటే లేదనే జెప్పాలె! ఆయన దేశం గురించే ఆలోచించిండు. దేశం కోసమే సచ్చిపోయిండు. ఏమని తిట్టాలె? తెలంగాణ వచ్చినంక భార్యాపిల్లల్ని ఆదుకోమ్మని గూడ రాసిండు.

ఆయన ఒక్కడే కాదు. మస్తు మంది దేశం కోసం ప్రాణాలు ఇడిసిండ్రు. వాళ్లందరూ పేదలే. వాళ్లను ఆదుకునేటందుకు ముందుకు రావాలెనని నోరు తెరిచి చెప్పుడు కూడ మంచిగుండదు. ఎవరిది వాళ్లకు తెలవాలె!

ఆయన పోయినంక నాకు చాలా కష్టమైంది. ఆఖరికి కరీంనగర్ ఆర్ట్స్ అండ్ కామర్స్ జూనియర్ కాలేజీలో అటెండర్‌గా ఉద్యోగం ఇచ్చిండ్రు. నేను పదో తరగతి కూడా పాసైన. కానీ ఏం ఫాయిద. ఆయన డ్యూటీ మీదనే నాకు ఉద్యోగం ఇయ్యమని తిరిగేటప్పుడే గట్టిగ ప్రయత్నిస్తె బాగుండు. రికార్డ్ అసిస్టెంట్‌గనైన ఉద్యోగం వచ్చేది. అయితేమాయెగని ఎట్లనో ఒక తీరుగ అటెండర్‌గ నౌకరైతె ఇచ్చిండ్రు. ఐదు వేల దాకా వస్తది. ఈ జీతంతోనే రెంటుకు ఉండుకుంట కొడుకును బిడ్డను సాదుకుంటున్న.

గవర్నమెంటు స్థలం ఇయ్యమని కలెక్టర్‌కు అర్జీ పెట్టుకున్న. అదింక ముందట వడలె. కెసీఆర్‌గారూ, మన మంత్రులు, కాంగ్రెస్ నాయకులు ఐదెకరాల స్థలం ఏర్పాటు చేసి ఇల్లు కట్టిస్తమని మా అన్నరు. గా పనిల ఎవరైన పట్టుదలగ నిలబడ్తె మంచిగుండు.

అండ్లదండ్ల సంతోషం ఏమిటిదంటె, కెసీఆర్ నా బిడ్డ పేరుమీద రెండు లక్షలు ఫిక్స్‌డ్ చేయించిండు. ఇక కాంగ్రెస్ మంత్రులు తలా ఇన్ని కలేసి లక్ష రూపాయల చొప్పున అమరుల కుటుంబాలకు ఇస్తమన్నరుగని మా జిల్లాలనైతె (నిజామాబాద్) ఎవ్వరికి అందనే లేదు.

బాధనిపిస్తది. ఎందుకనిపీయదు. ఉద్యమం అప్పుడే సల్లవడ్తన్నది. అప్పుడే వేడెక్కుతున్నది. కానీ పోరాటం ఆగవద్దు. దీన్ని నిలబెట్టాలె. తెలంగాణ తెచ్చుకోవాలె. అప్పుడే మనందరికీ పండగ.

ఇంతకంటే నేనేమీ ఎక్కువ చెప్పలేను. సందేశం ఇచ్చేంతటి పెద్ద వాళ్లం కాదు. మేం సామాన్యులం. మాకు రాజకీయాలు ఏమెరుక. ఆయన పోవట్టి తెలంగాణ గురించి తెల్సిందిగని లేకపోతే మా వంటివాళ్లకి ఈ సంగతులు తెల్వనే తెల్వదు.

తెలంగాణ తేవడానికి మా ఆయనే పోయిండు. ఆయన ఆశయం తీరితే చాలు. అంతకన్నా మాకు వేరే కోరికేదీ లేదు.

బతుకమ్మ గురించి ఇంకొక్క మాట చెబుత…

బతుకమ్మ పండగకు అమ్మగారింటికి పోదుంటును. కావల్సినన్ని పూలతో బతకమ్మను పేరుద్దు. మా ఆయన పోయినప్పటినుంచి పండగ చేసుకోలేదు. ఈ పండగ… ఆ పండగ…అని కాదు, ఏ పండగా చేసుకుంటలేం. తెలంగాణ రాష్ట్రం వస్తెనే మాకు పండగ. అప్పటిదాకా దేనికీ మనసు నిమ్మలించదు.

ఆయన ఆశయం తప్పక నెరవేరుతది. ఎందుకంటే ఆయన మంచి మనిషి. ఎవరికీ అన్యాయం చేయలేదు. పద్దెనిమిదేండ్ల సర్వీస్‌ను వదులుకుని, భార్య పిల్లల్ని, తల్లిని వదులుకుని దేశం కోసం పాణాలిడిసిండు. ఇంత పట్టుదల ఉన్న ఆ మనిషి బలిదానం వట్టిగ పోదు. ఆయన ఆశయం తీరుతది. తెలంగాణ రాష్ట్రం తప్పక వస్తది. రావాలె.

‘బతుకమ్మ’ పాఠకులకు ఇంతకుమించిన శుభాకాంక్షలు ఏముంటయి?

(నమస్తే తెలంగాణలో ప్రచురితం)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *