జీన్స్ కార్నర్ అనే చిన్న దుకాణంతో మొదలైన మర్రి జనార్ధన్ రెడ్డి ఇప్పుడు జేసీ బ్రదర్స్, చెన్నై షాపింగ్ మాల్ వంటి మెగా షాపింగ్ మాల్స్ నెలకొల్పి కోట్లకు పడగలెత్తాడు. ఇప్పుడు తన దగ్గరున్న కోట్లను నిచ్చెన మెట్లలా వాడుకుని ఎమ్మెల్యే అవుదామని కలలు కంటున్నాడు. అంత వరకూ బాగానే ఉంది. కానీ రాజకీయాల్లోకి దిగడానికి ఎంచుకున్న ముహూర్తమే బాగాలేదు.
తెలంగాణ కొరకు నాగం జనార్ధన్ రెడ్డి చేసిన రాజీనామాతో వచ్చిన ఉప ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున పోటీలోకి దిగాడు మర్రి జనార్ధన్ రెడ్డి. అప్పటిదాకా రాజకీయాల ఊసు తెలియని మర్రిని పాపం ఎవరో బాగానే బురిడీ కొట్టించినట్టున్నారు. పేరు కూడా సేం-టు-సేం కాబట్టి గెలుపు నీదే, అని గ్యాసు కొట్టినట్టున్నారు. కానీ మర్రి జనార్ధన్ రెడ్డికి దిగీ దిగగానే లోతు అర్థం అయ్యింది.
తెలంగాణలో తెలుగుదేశం అవసాన దశలో ఉన్నది. గెలవడం మాట దూరం, డిపాజిట్ దక్కించుకోవడమే కష్టంగా ఉన్నది. డబ్బు మంచినీళ్లలా ఖర్చు పెట్టినా పెద్దగా ప్రభావం లేకపోవడం, మరోవైపు తెలంగాణ వ్యతిరేక పార్టీ అభ్యర్ధిగా రంగంలోకి దిగడంతో అటు జేసీ బ్రదర్స్, ఇటు చెన్నై షాపింగ్ మాల్స్ వ్యాపారంపై ప్రభావం చూపే ప్రమాదం ఉండటంతో మర్రికి వెర్రెక్కింది.
ఇంకేముంది, డ్రమ్ముల నిండా పెయింటు తెప్పించి నాగర్ కర్నూల్ నియోజకవర్గంలో ఉన్న ప్రతి చెట్టుకు, పుట్టకు, రాయికి, రప్పకు పసుపు రంగు వేయించి పారేశాడు.
అసలు చెట్లకు రంగులు వేయడం ఏమిటి? అది పర్యావరణానికి హాని కదా. ఆమాత్రం తెలివిలేకుండా ఎట్లా ప్రవర్తిస్తరు ఈ తెలుగుదేశం నాయకులు, అని ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు.