బీజేపీకి బహిరంగ మద్దతు ప్రకటించిన మందక్రిష్ణ మాదిగపై ఉపముఖ్యమంత్రి టీ రాజయ్య తీవ్రంగా మండిపడ్డారు. దమ్ము ధైర్యముంటే ప్రధాని మోడీ దగ్గర కూర్చుని ఎస్సీ వర్గీకరణ బిల్లును పార్లమెంటులో పెట్టించాలని, రాష్ట్రాల అభిప్రాయాలను కేంద్రం అడిగితే ఖచ్చితంగా కేసీఆర్ ద్వారా అనుకూల విధానం చెప్తామని రాజయ్య పేర్కొన్నారు. తెలంగాణ భవన్ లో గురువారం విలేకరుల సమావేశంలో పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్, ఎమ్మెల్యే రమేష్, ఎస్సీ సెల్ అధ్యక్షుడు శామ్యూల్ తదితరులతో కలిసి రాజయ్య మాట్లాడారు.
ఎన్డీయే అధికారంలోకి రాగానే పోలవరం ముంపు గ్రామాలను ఏపీలో కలపడం, హైదరాబాద్ శాంతిభద్రతల అంశాన్ని గవర్నర్ కు అప్పగించేందుకు ప్రయత్నించినా ఎన్నడూ మందక్రిష్ణ మాట్లాడలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమాన్ని మధ్యలోనే వదిలేసి స్వార్ధంతో తెలంగాణ వ్యతిరేకి అయిన చంద్రబాబు పంచన చేరాడని, వంద రోజులుగా తెలంగాణ పునర్నిర్మాణంలో కలిసి రాలేదని విమర్శించారు. తన మీద తుపాకీ ఎక్కుపెట్టి కేసీఆర్ ను కొట్టాలని చూస్తున్నాడన్నారు.