– నిన్నటి ఉద్యమ వైజయంతిక, నేటి పునర్నిర్మాణ పతాక
– ప్రపంచదేశాల్లో సైతం ఘనంగా పువ్వుల పండుగ
-ఊరూవాడలో ప్రారంభమైన బతుకమ్మ సంబురాలు
బతుకమ్మ తెలంగాణ పునరుజ్జీవన పూలరథమై మురిసిపోయింది. తెలంగాణ పల్లెల్లో వెలుగుదివ్వెగా కొత్తశోభతో కళకళలాడింది. నిన్నటి ఉద్యమ వైజయంతిక, నేటి పునర్నిర్మాణ పతాకమై మిరుమిట్లు గొలిపింది. తెలంగాణ పల్లెలు, పట్టణాలు, కార్యాలయాలు, దేవాలయాలు చెరువులు బుధవారం బతుకమ్మ శోభతో మిలమిలలాడాయి,. సొంతరాష్ట్రంలో తొలిసారి బతుకమ్మ సంబరాలు తెలంగాణమంతటా ఘనంగా, వైభవంగా ఉత్సాహహభరిత వాతావరణంలో జరిగాయి.
ఆడబిడ్డలు, అన్నదమ్ములు, అక్కచెల్లెలు, పిల్లలు, నిండు హృదయంతో బతుకమ్మ సంబరాలు పంచుకున్నారు. ప్రపంచంలోని పలు దేశాల్లోనూ గొప్పగా బతుకమ్మ సంబరాలు జరిగాయి. నమస్తే తెలంగాణ ఎడిటర్‌కు ప్రపంచ దేశాలనుంచి తెలంగాణ ప్రవాసులు వందల సంఖ్యలో సందేశాలు పంపిస్తూ తాము ఉన్న చోటనే తాము తెలంగాణ బతుకమ్మ సంబరాలను వైభవంగా జరిపామని తెలియచేస్తూ వర్తమానాలు పంపించారు.
వాషింగ్టన్ తెలంగాణ అసోసియేషన్ (వాటా) ఆధ్వర్యంలో వాషింగ్టన్‌లో, ఆస్ట్రేలియా తెలంగాణ అసోసియేషన్ అధ్యక్షుడు రవీందర్‌గౌడ్ సారధ్యంలో బుధవారం మెల్‌బోర్న్‌లో తెలంగాణ బతుకమ్మ ఉత్సవాలు జరిగాయి. అక్టోబర్ 11న లండన్‌లో బతుకమ్మ, దసరా వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు తెలంగాణ ఎన్నారై ఫోరం భారీ ఏర్పాట్లు చేస్తున్నది. ఈ మేరకు వేడుకల పోస్టర్‌ను తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, నిజామాబాద్ ఎంపీ కవిత బుధవారం తన నివాసంలో ఆవిష్కరించారు.
కార్యక్రమంలో తెలంగాణ ఎన్నారైల ఫోరం వ్యవస్థాపక సభ్యుడు గంప వేణుగోపాల్, ఎన్నారై టీఆర్‌ఎస్ ప్రధాన కార్యదర్శి రాజ్‌కుమార్ శానబోయిన, అధికార ప్రతినిధి హరిగౌడ్ నవపేట్, తెలంగాణ కో ఆర్డినేటర్ ప్రవీణ్‌కుమార్, నరేశ్ పాల్గొన్నారు. ఈమేరకు వేడుకల సెక్రటరీ నగేశ్‌రెడ్డి కాసర్ల, మహిళా విభాగం కో ఆర్డినేటర్ అర్చన జువ్వాడి ఓ ప్రకటన విడుదల చేశారు. కువైట్ దేశంలోని తెలంగాణ రాష్ట్ర ప్రవాసులు ఏర్పాటుచేసుకున్న కువైట్ తెలంగాణ సమితి గురువారం ఆ దేశంలో ప్రపథమంగా బతుకమ్మ సంబురాలు ఘనంగా జరుపుకునేందుకు ఏర్పాట్లు చేస్తున్నది.
ఈ కార్యక్రమంలో తెలంగాణ గాయకుడు, శాసనసభ్యుడు రసమయి బాలకిషన్ ముఖ్యఅతిథిగా హాజరుకానున్నారు. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, నిజామాబాద్ ఎంపీ కే కవిత సారధ్యంలో భువనగిరిలో వైభవంగా బతుకమ్మ ఉత్సవాలు జరిగాయి. సెక్రటేరియట్ బతుకమ్మ పండుగతో కళకళలాడింది. టీఎన్జీవో అధ్యక్షుడు జీ దేవీప్రసాద్, టీజీవో వ్యవస్థాపక అధ్యక్షులు వీ శ్రీనివాస్‌గౌడ్, తెలంగాణ సెక్రటేరియట్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎం నరేందర్‌రావు, టీఎన్జీవో ప్రధానకార్యదర్శి కారం రవీందర్‌రెడ్డి, తెలంగాణ ఉద్యోగుల ఐక్యవేదిక అధ్యక్షుడు ఏ పద్మాచారి, సెక్రటేరియట్ టీఎన్జీవో శ్రావణ్‌కుమార్‌రెడ్డి, సెక్రటేరియట్ మహిళా విభాగం అధ్యక్షురాలు జూపాక సారధ్యంలో మహిళా ఉద్యోగులు బృందాలుగా ఏర్పడి పాటలు పాడి, ఆటలు ఆడారు.
రవీంద్రభారతి ప్రాంగణంలో జరిగిన బతుకమ్మ ఉత్సవాలలో రాష్ట్ర భాషా సాంస్కృతిక సలహాదారు కేవీ రమణాచారి, సాంస్కృతికశాఖ డైరక్టర్ రాళ్లబండి కవితాప్రసాద్ పాల్గొన్నారు. టీఎన్జీవో మహిళావిభాగం అధ్యక్షురాలు బండారు రేచల్ సారధ్యంలో ఈఎన్‌టీ దవాఖాన, పబ్లిక్‌గార్డెన్స్, ఇన్సూరెన్స్ భవనసముదాయాలల్లో బంగారుబతుకమ్మ సంబరాలు జరిగాయి. ఏజీ కాలనీలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు మల్లికార్జున్ నాయకత్వంలో మహిళలు బతుకమ్మ సంబరాలను చేసుకున్నారు.
పది జిల్లాల కలెక్టరేట్‌ల ఎదుట టీఎన్జీవో మహిళలు, టీజీవో మహిళలు బతుకమ్మ ఆడారు. తెలంగాణ మహిళా విద్యుత్ ఉద్యోగులు విద్యుత్‌సౌధలో బతుకమ్మ వేడుకలకు శ్రీకారం చుట్టారు. జెన్‌కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్‌రావు జ్వోతిప్రజ్వలనం చేసి సంబరాలను ప్రారంభించారు. తెలంగాణ సచివాలయ సాధికార బతుకమ్మ సంబురాల పేరుతో తెలంగాణ సచివాలయ మహిళా ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో బుధవారం సాయంత్రం ఉద్యోగినులు ఘనంగా బతుకమ్మ సంబురాలు చేసుకున్నారు. సెర్ప్ కార్యాలయంలో బతుకమ్మ పండుగను ముఖ్య కార్యనిర్వహణ అధికారి మురళీ ప్రారంభించారు. బతుకమ్మ సంబరాలను నాంపల్లి న్యాయస్థానం ఆవరణలో బుధవారం ఘనంగా నిర్వహించారు. మెట్రోపాలిటన్ సెషెన్స్ జడ్జి రజని, మహిళా న్యాయమూర్తులు హేమ రాజేశ్వరి, రాధాదేవి, శైలజ, శ్రీదేవి ఇతర మహిళా సిబ్బంది వేడుకల్లో పాల్గొన్నారు.
నమస్తే తెలంగాణ సౌజన్యంతో..
