అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మన ఊరు-మన చెరువు పథకాన్ని గ్రామస్థాయిలోకి తీసుకెళ్లేందుకు రాష్ట్ర ప్రభుత్వం విస్తృత ప్రచారం చేపట్టనుంది. ఇందుకోసం తెలంగాణలో ప్రసిద్ధి చెందిన చిందు యక్షగానాన్ని ఉపయోగించేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దాదాపు 1500 మంది కళాకారులకు ఈరోజు నుండి రెండు రోజులపాటు నగరంలోని రవీంద్రభారతిలో అవగాహన, శిక్షణ తరగతులను నిర్వహించనున్నారు.
ఈరోజు జరిగే సదస్సులో కళాకారులలో మాస్టర్ ట్రైనర్స్ ఎంపిక పూర్తి చేస్తామని, నీటిపారుదల రంగ నిపుణులు విద్యాసాగర్ రావు, చిందు యక్షగానంపై అధ్యయనం చేసిన మల్లేపల్లి లక్ష్మయ్య, సాంస్కృతిక శాఖ సలహాదారు రమణాచారి తదితరుల చేత కళాకారులకు శిక్షణ ఇప్పిస్తామని, శిక్షణ పొందిన కళాకారులు ప్రజలకు చెరువుల పరిరక్షణ, పునరుద్ధరణ ఆవశ్యకతను వివరించి చెప్తారని సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ తెలిపారు.