mt_logo

మళ్లీ వచ్చిన స్వాతంత్య్రం

By: బిఎస్ రాములు

చరిత్ర ఇచ్చిన గొప్ప అవకాశం ద్వారా కేసీఆర్ తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా.. దేశ తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ వేసిన బాట, ముద్ర వలె చిరకాలం నిలిచిపోతుంది. అందుకు కేసీఆర్ గారికి సరైన సూచనలు, సహకారం అందించడం నేటి మేధావులు, జర్నలిస్టులు, శాస్త్రవేత్తల కర్తవ్యం.

ఈ మధ్య తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలకు ఒకే కాంపౌండులో ఏర్పాటు చేసిన సచివాలయాలకు వెళ్లాను. ఇంకా పూర్తిగా శాఖలు, కార్యాలయాలు విడిపోలేదు. తెలంగాణ రాష్ట్ర సచివాలయం కోసం ఉత్తరం దిక్కున కొత్త గేట్లను ఏర్పాటు చేశారు. మొదటి రోజు మిత్రుడు అంగలకుర్తి విద్యాసాగర్ ఐఏఎస్, ప్రిన్సిపల్ సెక్రటరీ సెక్యూరిటీకి ఫోన్ చేయించడంతో సచివాలయంలోకి ప్రవేశం దొరికింది. సాధారణంగా మధ్యాహ్నం 3 గంటల తర్వాత ప్రజలకు అనుమతిస్తారు. సెక్రటేరియట్ లోపలికి వెళ్లడం ఆలస్యం కావడం పట్ల విసుగు కలిగిన మాట వాస్తవం. భద్రతా కారణాలను పట్టించుకోవడం అవసరమని స్పృహను పెంచుకోవడం జరిగింది.

ఉద్యమకారులుగా ఉన్నప్పుడు కలిగే ఆలోచనలకు, మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది.. మనదే ప్రభుత్వం అనే భావన కలగడం ద్వారా అన్ని ప్రొటోకాల్స్‌ను, రక్షణ చర్యలను గౌరవించాలనే దృష్టి పెరిగింది. నా వెంట ఉన్న మిత్రులకు, నా సహనం ఆశ్చర్యం కలిగించింది. సెక్రటేరియట్ లోపలికి వెళ్లకుండానే వెళ్లిపోదామని ఒత్తిడి చేశారు. చూద్దాం.. లోపలికి వెళ్లాక ఎలా ఉంటుందో చూసి మన ప్రభుత్వానికి, పాత ప్రభుత్వానికి మధ్య తేడా తెలుసుకుందామని సముదాయించాను. లోపలికి వెళ్లాక తెలిసిన మిత్రులను కలిశాక మా విసుగు, అసహనం ఎగిరిపోయింది. ఎంతో ఉత్సాహంగా స్వేచ్ఛగా కలవదల్చుకున్న వారిని కలిశాం.

సెక్రటేరియట్‌లో తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన ఎందరో యువ మిత్రులు కలిశారు. నిన్నటి దాకా కలిసి పని చేసినవాళ్లు మంత్రులుగా ఆశీనులై ఆత్మీయంగా పలకరిస్తుంటే ఆనందమేసింది. ఈటెల రాజేందర్, కేటీఆర్, మహ్మద్‌అలీ, నాయిని నర్సింహారెడ్డి తదితరులు కలిశారు. వారివద్ద ప్రజలు తెలంగాణ భవన్‌లో హాయిగా కూర్చున్నట్టుగా కూర్చున్నారు. అన్ని జిల్లాల నుంచి ఇది మన ప్రభుత్వం.. మనవాళ్లు అని వచ్చిన వాళ్లల్లో ఎంత ఆత్మవిశ్వాసమో! వరసగా ఐదు రోజులు వెళితే ఐదో రోజు కేసీఆర్ గారిని కలవడం వీలైంది. ప్రభుత్వ సలహాదారు కె.వి.రమణాచారి, నేను కలిసి నేరుగా కేసీఆర్ ఉన్న ఛాంబర్‌లోకి వెళ్లాము. కలిసిన తర్వాత స్వేచ్ఛగా మాట్లాడుకున్నాం. అనేక విషయాలను ముచ్చటించుకున్నాం. ఈ ఐదు రోజుల సెక్రటేరియట్ సందర్శనలో మనకు మళ్లీ స్వాతంత్య్రం వచ్చిందనిపించింది. నాలాగే వేలాదిమంది మనకు మళ్లీ స్వాతంత్య్రం వచ్చిందని సంతోషపడడం, వారి కళ్లల్లో ఆత్మవిశ్వాసం స్వయంగా గమనించాను.

తెలంగాణ స్వరాష్ట్ర సాధన ఉద్యమంలో భాగంగా తీసుకున్న పల్లె నిద్ర కార్యక్రమంలో ఎన్నో అనుభవాలు కలిగాయి. కేసీఆర్, మల్లేపల్లి లక్ష్మయ్య, నేను ఇంకా చాలా మందిమి సాయంత్రం ఒక బహిరంగ సభ పూర్తి చేసుకొని మరో ఊళ్లో పల్లె నిద్రకు బయల్దేరాం. రాత్రి ఎక్కడ వీలైన వాళ్లు అక్కడ పడుకున్నారు. తెల్లవారి లేచి వేపపుల్ల వేసుకొని పళ్లు తోముకుంటూ దళితవాడలు తిరిగాం. ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నాం. ప్రతి ఇంటా సమస్యలు అడిగి తెలుసుకున్నాం. ఇంతలో ఊరి వాళ్లు పరిగెత్తుకొని వచ్చారు. దళిత వాడలకేనా.. మా ఇళ్లల్లోకి కూడా రండి అని పిలిచారు. బహిరంగ ప్రదేశంలో స్నానాలు ముగించి ఊళ్లోకి బయల్దేరాం. అనేక సమస్యలు ముందు పెట్టారు ప్రజలు. ఒక సమస్య సామాజికమైనది. ఒక సమస్య వ్యక్తిగతమైనది. మరొక సమస్య ఆలోచనా విధానంలో, సంస్కృతిలో మార్పు రావడానికి సంబంధించినది. ఇంకో సమస్య ఆర్ధిక ఇబ్బందులకు సంబంధించినది. పల్లెల్లో సమస్యలు అన్నీ ఆర్ధికానికి సంబంధించినవి కావని, ఆర్ధికంతో నిమిత్తం లేని సామాజిక, సాంస్కృతిక సమస్యలు ఎన్నో ఉన్నాయని ఆ పల్లె నిద్ర ద్వారా తెలుసుకున్నాం. ఇలాంటి సమస్యలకు చాలా మేరకు కేసీఆర్ స్వయంగా పరిష్కరించగలిగే వాటికి హామీలు ఇచ్చారు. మధ్యాహ్నం భోజనం చేసి నేరుగా కూలిపనికి హైదరాబాద్‌కు రావడం జరిగింది.

కేసీఆర్ కూలి పనిచేస్తూ లారీలోని పెట్టెలను దించి గోడౌన్ లో పెట్టారు. అలా అందరం కూలిపని చేశాం. ఇలా తెలంగాణ సాధన ఉద్యమంలో కొన్ని వందల సార్లు ప్రజల మధ్యకు వెళ్ళి ప్రజల సమస్యలను తెలుసుకోవడం, వాటి పరిష్కారానికి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు గల సంబంధాన్ని కేసీఆర్ వివరించడం జరిగింది. ఇప్పుడు ప్రభుత్వంలోకి వచ్చిన కేసీఆర్ వాటిని పరిష్కరించే స్థానంలోకి వచ్చారు. కేసీఆర్-మేము, గద్దర్-మేము, తెలంగాణ ధూంధాంలో మేము చేసిన పాదయాత్రలు సామాజిక, రాజకీయ చైతన్యానికి, సమస్యలను తెలుసుకోవడానికి, తెలపడానికి, వాటికి స్వరాష్ట్ర ఏర్పాటుకు గల సంబంధాన్ని వివరించడం జరిగింది. ఇలా ప్రజల నిర్దిష్ట సమస్యలు, సమాజం ఎలా ఉందో తెలుసుకోవడానికి పల్లెనిద్ర వంటి కార్యక్రమాలు, ఉద్యమాలు ఎంతగానో ఉపయోగపడ్డాయి. ఆ అనుభవాలు ఇప్పుడు కేసీఆర్ ఆయా సమస్యలను పరిష్కరించడానికి గైడ్‌లైన్స్‌గా ఉన్నాయి. అందువల్ల ఇంతకుముందు ఏ ముఖ్యమంత్రికీ లేని, రాని ఆలోచనలు, నూతన కోణాలు కేసీఆర్ దృక్పథంలో, నిర్ణయాల్లో కనబడుతున్నాయి.

కేసీఆర్ ముఖ్యమంత్రిగా తీసుకుంటున్న నిర్ణయాలు, చేస్తున్న ఆలోచనలు మంత్రివర్గ సహచరులను నిర్దేశించి నడిపిస్తున్న తీరు నిత్యనూతనంగా ఉన్నది. ముఖ్యమంత్రి పదవి స్వీకారం జరిగిన వెంటనే హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల తహసీల్దార్లను, కలెక్టర్లను వెంటనే బదిలీ చేసి కొన్నేళ్లుగా సాగుతున్న భూముల అక్రమ పందేరాలను అడ్డుకున్నారు. గత సంవత్సరంగా సాగిన వాన్నిటినీ వెలికితీశారు. అన్యాక్రాంతమైన భూములను తిరిగి సేకరించడానికి పూనుకున్నారు.

అంతదాకా విర్రవీగిన రాజకీయ నేతలు, రియల్టర్లు ఎక్కడి దొంగలు అక్కడే గప్‌చిప్. కఠిన నిర్ణయాలను తీసుకోవడం ద్వారా కేసీఆర్ ఆక్రమణదారులకు గట్టి హెచ్చరిక చేశారు. సీమాంధ్ర పత్రికలు, టీవీలు ఎన్నిదుష్ర్పచారాలు చేసినా, పుకార్లు పుట్టించినా కేసీఆర్‌గానీ, తెలంగాణ ప్రజలు గానీ వెనుకంజ వేయలేదు. కేసీఆర్‌కు మద్దతుగా నిలిచారు. కేసీఆర్ తీసుకున్న ప్రతి నిర్ణయానికి తెలంగాణ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే తెలంగాణ వాళ్లే తమను తాము పరిపాలించుకుంటే ఎలా ఉంటుందో మొదటిసారి తెలంగాణ ప్రజలకు అనుభవంలోకి వచ్చింది. 1952-56 మధ్య బూర్గుల రామకృష్ణారావు హైదరాబాద్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎంతో సాహసోపేతంగా స్వతంత్ర నిర్ణయాలను తీసుకొని ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టారు. విద్యావ్యాప్తికి, సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి ప్రణాళికలు వేశారు. అవి కొన్ని పూర్తయ్యాయి, కొన్ని మధ్యలోనే ఆగిపోయాయి. తెలంగాణ, సీమాంధ్ర కలిసి ఆంధ్రప్రదేశ్‌గా ఏర్పడిన తర్వాత నైజాం కాలంలో, బూర్గుల కాలంలో వేసిన ప్రణాళికలు, ప్రాజెక్టులు మూతపడ్డాయి. సీమాంధ్ర ప్రయోజనాలకు అనువుగా నాటి ముఖ్యమంత్రులు నీలం సంజీవరెడ్డి, కాసు బ్రహ్మానందరెడ్డి ప్రవర్తించారు. రాష్ట్ర అభివృద్ధి ప్రణాళికలు సీమాంధ్ర వలసలకు, వారి అభివృద్ధికి, ఆధిపత్యానికి, దోపిడీకి అనువుగా సాగాయి. అలా వలస వాదానికి చేయూతనిచ్చి తెలంగాణను, వనరులను, అధికారాలను, ఉద్యోగ అవకాశాలను ఆక్రమించే వలస ఆధిపత్య రాజకీయాలను, ప్రభుత్వాలను నడిపించారు.

ఇప్పటిదాకా సాగిన అభివృద్ధిలో ప్రతి అంశంలో సీమాంధ్ర ప్రయోజనాల దృష్టి, స్వార్ధం కొనసాగిందని అందువల్ల ప్రతి అంశాన్ని, ప్రతి శాఖను తెలంగాణ సొంత దృక్పథంతో కొత్తగా అధ్యయనం చేయడం అవసరమని కేసీఆర్ నొక్కి చెబుతున్నారు. తెలంగాణలోని నీటి ప్రాజెక్టులు కూడా సీమాంధ్ర ప్రయోజనాలకు అనువుగా వంకర తిప్పబడ్డాయి. కృష్ణ, గోదావరి నీళ్లు తెలంగాణ వాళ్లు వాడుకోకుండా ప్రాజెక్టులను దిగువ ప్రాంతాల్లో తక్కువ ఎత్తుతో కట్టారు.

కేసీఆర్ ముందు చూపుతో అనేక సమస్యలను పరిశీలిస్తున్నారు. పారిశ్రామిక, ఉద్యోగరంగం, విద్యా, వైద్య రంగం, రియల్ ఎస్టేట్, ప్రణాళికాబద్ధ అభివృద్ధి, గ్రామీణాభివృద్ధి, ప్రపంచ స్థాయి నగరాభివృద్ధి, సాఫ్ట్‌వేర్ రంగంలో అభివృద్ధి, సాగునీటి ప్రాజెక్టుల అభివృద్ధి మొదలైనవి కొత్త కోణాల్లో తెలంగాణ దృక్పథంతో పరిశీలించడం జరుగుతున్నది. ప్రతి రంగంలో చేస్తున్న పరిశీలనతో కేసీఆర్ ఆయా రంగాల్లోని నిపుణులను, మేధావులను, శాస్త్రవేత్తలను కూడా ఆశ్చర్యంలో పడవేస్తున్నారు. కేసీఆర్ సామాజిక దార్శనికుడిగా, రాజనీతి శాస్త్రవేత్తగా, రాజకీయ నాయకుడిగా బహుపాత్రాభినయం చేస్తూ మెప్పిస్తున్నారు. చరిత్ర ఇచ్చిన ఈ గొప్ప అవకాశం ద్వారా కేసీఆర్ తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా.. దేశ తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ వేసిన బాట, ముద్ర వలె చిరకాలం నిలిచిపోతుంది. అందుకు కేసీఆర్ గారికి సరైన సూచనలు, సహకారం అందించడం నేటి మేధావులు, జర్నలిస్టులు, శాస్త్రవేత్తల కర్తవ్యం.

నమస్తే తెలంగాణ సౌజన్యంతో..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *