By: శ్రీధర్ బాబు పసునూరు
—
మా ఇంట్ల మేముంటం.. మీ ఇంట్ల మీరుండ్రుండంటె ఎందుకు కొట్లాడుతున్నరో అర్థమైతలేదు. మీకు ఇల్లు లేదా.. నీళ్ళు లేవా ఏం లేదని గిట్ల యాగి చేస్తున్నరు? మీ కొట్లాట చూస్తుంటె.. మీ కడుపుల గింత కసుందా అని భయమైతంది. హమ్మో.. గిసుమంటోళ్ళతోని కలిసుండుడెట్లా అని గిప్పటిదాంక భయం లేనోళ్ళకు కూడ దడ పుడ్తంది.
ఇది కలిసుందామని చేసే వుద్యమం లెక్క లేదు.. ఎప్పటికీ మీరు మీరే.. మేం మేమే అని రాళ్ళిసిరేసి కొడ్తున్నట్లుంది. ఇన్నేళ్ళు ఇక్కడ సుఖంగ.. సంతోషంగా ఉండి.. ఇప్పుడేమో మాతో ఉంటందుకు భయమైతుందని అంటందుకు మీకు మనసెట్లొచ్చింది? మమ్మల్ని గిట్ల కూడ అవమానిస్తరా? మిమ్మల్నేమన్న అంటిమా.. పొమ్మంటిమా..? మా రాష్ట్రం మేం ఏలుకుంటమన్నం.
అరవై ఏళ్ళ సంది చేస్తున్న పోరాటం ఇయ్యాళ ఫలిస్తె కళ్ళళ్ళ నిప్పులు పోసుకుంటరా? మేమూ తెలుగోళ్ళమే కద. మా మీద నిజంగా మీకు అభిమానముంటె.. సాటి తెలుగోళ్ళు ఏళ్ళ సంది చేస్తున్న పోరాటం ఫలించిందని మీరు కూడా సంబరపడాలె. మా పండగను మీరు కూడ చేసుకోవాలె. మీ ఇంటిని మీరు బాగ చేసుకోవాలె. మా ఇంటిని మమ్మల్ని బాగ చేసుకోనివ్వాలె. అది సమైక్యమంటే. దోస్తీ అంటే. ఒకరేమో వీసా అంటరు.. ఒకరేమో పాకిస్తానంటరు.. ఒకరేమో హైదరాబాదును మీకొద్దు మాకొద్దు ఢిల్లీవోళ్ళకిచ్చేద్దామంటరు…
ఏంది ఇదంతా? కలిసిబతికే షెకలేనా? రాష్ట్రం విడిపోతే ఏమైతది? రోడ్లు మూసేస్తున్నరా? తలుపులు పెట్టేస్తున్నరా? మీరే గుండెల్లో మంట పెడ్తున్నరు. మాసిపోని మాటలంటున్నరు. ఏడ తప్పు దొరుకుతదా అని కోడిగుడ్డు మీద ఈకలెతుకుతున్నరు. వొద్దొద్దు.. సమైక్య ఉద్యమం పేరుతో అనైక్యత గోడలు కట్టొద్దు. మావోళ్ళే వందల మంది సచ్చిపోయిండ్రు. ఆ బాధే మమ్మల్ని ముద్ద మింగనిస్త లేదు. మళ్ళ మీ వోళ్ళను కూడా రెచ్చగొట్టి సచ్చిపోయేటట్లు చేయొద్దు. ఎక్కడి బిడ్డలైనా ఉసురు తీసుకుంటె మా కడుపు సెరువైపోతుంది. వొద్దొద్దు.. ఇయ్యన్ని వొద్దు. అరవయ్యేళ్ళు పోరాడినం. మీవోళ్ళ ఏలుబడిలనే బతికనం. ఇప్పట్నుంచైన మా గోసేదో మమ్మల్ని చూసుకోనియ్యుండ్రి. మా బాధేదో మమ్మల్ని పడనియ్యుండ్రి. మా ఇంట్ల మమ్మల్ని బతకనియ్యండ్రి. మీ ఇంట్ల మీరు సల్లంగ ఉండుండ్రి. మీ అందరికీ నిండు గుండెతో పెడ్తున్న దండం.